బండి సంజ‌య్.. టీఆర్ఎస్ నేత‌ల‌పై న్యాయ‌స‌ల‌హాలు!

తెలంగాణ రాష్ట్ర స‌మితి నేత‌లు, మంత్రుల‌పై చ‌ట్ట‌ప‌రంగా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో న్యాయ‌ప‌ర‌మైన స‌ల‌హాలు కూడా తీసుకుంటున్నార‌ట తెలంగాణ బీజేపీ విభాగం అధ్య‌క్షుడు బండి సంజ‌య్. మొత్తం 18 మంది నేత‌ల‌ను లిస్టులో చేర్చార‌ట.…

తెలంగాణ రాష్ట్ర స‌మితి నేత‌లు, మంత్రుల‌పై చ‌ట్ట‌ప‌రంగా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవాలో న్యాయ‌ప‌ర‌మైన స‌ల‌హాలు కూడా తీసుకుంటున్నార‌ట తెలంగాణ బీజేపీ విభాగం అధ్య‌క్షుడు బండి సంజ‌య్. మొత్తం 18 మంది నేత‌ల‌ను లిస్టులో చేర్చార‌ట. వారి విష‌యంలోనే న్యాయ‌ప‌ర‌మైన స‌ల‌హాలు తీసుకుంటున్నార‌ట‌.

మ‌రి ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గానే కోర్టుల ద్వారా ప్రొసీడ్ కావ‌డానికి ఈ న్యాయ‌స‌ల‌హాలు తీసుకుంటున్నారో, లేక తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చాకా ఈ నేత‌ల‌పై చ‌ర్య‌ల గురించి ఇప్పుడే న్యాయ స‌ల‌హాలు తీసుకుంటున్నారో కానీ.. ఇంత‌కీ స‌ద‌రు నేత‌లు ఎవ‌రో మాత్రం తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు చెప్ప‌డం లేదు.

ఆ 18 మంది ఎవ‌రో ఇప్పుడే ఒక మాట‌నేసుకుంటే జ‌నాల‌కూ క్లారిటీ ఉంటుంది. ఒక‌వైపు ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలోకి చేర‌డం గురించి ముహూర్తాన్ని ప్ర‌క‌టించారు బండి సంజ‌య్. వారం రోజుల్లో ఈట‌ల బీజేపీలోకి చేర‌తార‌ని చెప్పేశారు. అధికార ప‌క్షం వారు ఈట‌ల మీద చేస్తున్న‌ది అవినీతి ఆరోప‌ణ‌లే.

ఇప్పుడు బీజేపీ అధ్య‌క్షుడు అధికార పార్టీ వారిపై చేస్తున్న‌ది అవినీతి ఆరోప‌ణ‌లే. టీఆర్ఎస్ వాళ్లు అవినీతి అంటున్న ఈట‌ల‌ను బీజేపీ చేర్చుకుంటోంది, మ‌రోవైపు టీఆర్ఎస్ లో అవినీతి నేత‌లంటున్నార‌ని కూడా బీజేపీ అంటోంది. ఒక‌వేళ ఈట‌ల టీఆర్ఎస్ లోనే ఉండి ఉంటే.. ఈయ‌న బీజేపీ ద‌గ్గ‌ర ఉండే లిస్టులో ఉండే వారో లేరో మ‌రి!

అయినా.. ఇప్పుడే ఆ 18 మంది పేర్లు చెప్పేస్తే.. ముందు ముందు వారిలో ఎవ‌రైనా బీజేపీలోకి వ‌స్తామంటే క‌మ‌లం పార్టీ చేర్చుకుంటుందా… అనే క్లారిటీ జ‌నాల‌కు వ‌స్తుంది. ప‌శ్చిమ బెంగాల్ లో నార‌ద స్కామ్ లో విచార‌ణ సంస్థ‌లు చాలా సెలెక్టివ్ గా నేత‌ల‌ను అదుపులోకి తీసుకుంటున్న దాఖ‌లాలున్నాయి.

నార‌ద స్కామ్ లో బోలెడంత మంది నేత‌ల పేర్లు ఉండ‌గా.. వారిలో కొంద‌రు బీజేపీలో చేరిపోయారు. వారినిప్పుడు విచార‌ణ సంస్థ‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. కేవ‌లం టీఎంసీలో ఉన్న వారి నే విచార‌ణ‌, అరెస్టులు అనే వార్త‌లు వ‌స్తున్నాయి. వాళ్లంతా టీఎంసీలో ఉన్న‌ప్పుడు మొద‌లైన విచార‌ణ నుంచి, బీజేపీలోకి చేరిన వారంతా ఊర‌ట పొందారు. మ‌రి రేపు టీఆర్ఎస్ నుంచి ఎవ‌రైనా బీజేపీలోకి చేరితే.. వారికీ ఈ న్యాయ‌స‌ల‌హాలు, సూచ‌న‌ల ప్రోగ్రామ్ నుంచి మిన‌హాయింపును ఉండ‌టం ఖ‌రారే కాబోలు!