విస్తీర్ణంలో బుల్లిదే అయినా… రాష్ట్రానికి తక్కువ, కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతానికి ఎక్కువ అయిన ఢిల్లీలో.. కరోనా అటు ఫస్ట్ వేవ్ లోనూ విజృంభించింది, ఇక సెకెండ్ వేవ్ లో అయితే ఢిల్లీ అల్లాడి పోయింది. రెండు కోట్ల జనాభా స్థాయికి అటు ఇటుగా 14 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.
జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఆ తరహాలో కరోనా కేసులు రావడం భయానకమైన పరిస్థితే. ఈ భయనాక పరిస్థితిని అనుభవించిన ఢిల్లీ ఇప్పుడిప్పుడు కోలుకుంటోంది. గత కొన్నాళ్లుగా అక్కడ క్రమం తప్పకుండా కేసుల సంఖ్య తగ్గుతూ ఉంది. ఈ క్రమంలో ఢిల్లీలో గత వారం రోజులుగా కొత్త కేసుల సంఖ్య వెయ్యి లోపు నమోదవుతూ వస్తోంది.
గత 24 గంటల టెస్టుల్లో 623 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పుడు జనసాంద్రతను బట్టి చూస్తే.. అతి తక్కువ కేసులు నమోదవుతున్న ప్రాంతంగా నిలుస్తోంది ఢిల్లీ. యాక్టివ్ కేసుల సంఖ్య 10 వేల స్థాయికి వచ్చింది. మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ తగ్గిపోయింది. ఈ వారం నుంచినే అక్కడ లాక్ డౌన్ నుంచి రిలాక్సేషన్ కూడా మొదలైంది.
రోజుకు ఐదారు వందల కేసులు అంటే.. కరోనా దాదాపు తగ్గిపోయినట్టే. అయితే.. జీరో కరోనా కేసులు సాధ్యమేమో చూడాల్సి ఉంది. ఇలాగే తగ్గుదల కొనసాగితే.. జీరో కరోనా డే కూడా త్వరలోనే ఉండవచ్చు. ప్రస్తుత తగ్గుదలలను గమనిస్తే అలాంటిది ముందుగా ఢిల్లీలోనే నమోదు కావాల్సి ఉంది. గ్రోత్ రేటు లేదు, తగ్గుదల కొనసాగుతోంది కాబట్టి.. జీరో కరోనా డే ను దేశ రాజధానిలోనే ముందుగా ఆశించవచ్చు.