న్యూయార్క్ – తానా ప్రపంచ సాహిత్య వేదిక మే 30న నిర్వహించిన అన్నమాచార్య 613 వ జయంతి ఉత్సవాలు అంతర్జాతీయంగా అంతర్జాలంలో ఘనంగా జరిగాయి.
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. అన్నమయ్య రచించిన 32,000 కీర్తనలలో నేడు మనకు లభించే 12, 000 కీర్తనలను పరిశీలిస్తే, వాటిలో కేవలం ఆధ్యాత్మిక భావాలే కాకుండా కులభేదాల నిరశన, సామాజిక స్పృహ, మానవీయ విలువలు ఎన్నో ఉన్నాయన్నారు. అన్నమయ్య వాడింది ప్రజల భాష అని, ఆ సాహిత్యం లో ఎన్నో జానపద బాణీలు, దేశ్య పదాలు, పలుకుబడులు, సామెతలు, జాతీయాలు అన్నమయ్య కవితాసౌందార్యానికి, స్వచ్చమైన భావసంపదకు దృష్టాంతాలన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అపూర్వ పంచ సహస్రావధాన సార్వభౌమ డా. మేడసాని మోహన్ తొలి వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు అన్నమాచార్య సాహిత్యంపై విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు. అన్నమయ్య కేవలం ఆధ్యాత్మిక రచనలే కాకుండా సంస్కృతంలో గ్రంథాలు, 12 శతకాలను రచించారని, 6౦౦ సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ మనం అంతా అన్వయించుకోగల్గే ఎన్నో మానవీయ విలువలు ఉన్నాయన్నారు.
తన జీవితంలో అధిక భాగాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో అన్నమాచార్య యోజన నిర్దేశక పదవితో సహా అనేక భాద్యతలు నిర్వహించే అవకాశం గల్గడం మరపురాని అనుభూతి అన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసురాలు పద్మశ్రీ డా. శోభారాజ్ విశిష్ట అతిథిగా పాల్గొని అన్నమయ్య సాహిత్యంలోని భావ లాలిత్యం, గంభీరత్వం గురించి సంగీత ప్రధానంగా ఎంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో అన్నమయ్య సాహిత్యం ఎన్నో వేలమంది గాయనీ గాయకులకు పవిత్రమైన వృత్తిగా మారిందన్నారు. తాను తన జీవితాన్ని అన్నమయ్య సేవకే అంకితం చేశానని, ఇప్పటివరకు కొన్ని వేల మంది విద్యార్దినీ విద్యార్ధులకు అన్నమాచార్య భావనా వాహిని అనే తన సంస్థ ద్వారా సంకీర్తనాగానం లో శిక్షణ ఇచ్చే అవకాశం, అదృష్టం కలిగాయన్నారు.
శతాధిక చిత్రాల దర్శకుడు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అన్నమయ్య చిత్రానికి దర్శకత్వం వహించడం తన సినీ జీవితంలో ఒక గొప్ప అనుభవం అని, తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఎన్నో వైవిధ్యభరితమైన సాహిత్య కార్యక్రమాలు జరుపుతున్నారని, ఈ కార్యక్రమం కూడా విజయవంతం కావాలని అభిలషించారు.
అన్నమయ్య చిత్రానికి కథ, మాటలు సమకూర్చిన ప్రముఖ రచయిత జె.కె. భారవి విశిష్ట అతిధిగా పాల్గొని తాను రాసిన అన్నమయ్య కథను ఎంతో మందికి వినిపించగా అందరూ ఈ చిత్రాన్ని తీయడానికి ఉత్సాహం చూపారు గానీ, చివరకు దొరస్వామిరాజు నిర్మాతగా, రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అన్నమయ్య చిత్రాన్ని నిర్మించి 1997 లో విడుదల చేయగా, ఆ చిత్రం సంచలనం సృష్టించిందన్నారు. కొన్ని దశాబ్దాల కు పూర్వం అన్నమయ్య జీవిత కథను తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఎన్నో వందల సార్లు హరికథా గానం చేసే అవకాశంకల్గడం తన పూర్వజన్మ సుకృతం అన్నారు.
ప్రముఖ గాయని, సూర్యప్రభ సంగీత అకాడమీ వ్యవస్థాపకురాలు, గురు శ్రీమతి కళ్యాణి ద్విభాష్యం నిర్వహణలో హైదరాబాద్ నుంచి చిన్మయి, భవ్యశ్రీ, నిత్య, ప్రీతిక, వర్ణిక, లక్ష్మి భావజ మరియు అమెరికా నుండి సింధు బాలకవి, అనిక ఐనంపూడిలు అనేక కొత్త అన్నమాచార్య సంకీర్తనలను శ్రావ్యంగా గానంచేసి అందరి మన్నలను పొందారు.
ప్రముఖ గాయకులు శ్రీవేదవ్యాస ఆనందభట్టార్ కొన్ని అన్నమాచార్య సంకీర్తనలను మధురంగా గానం చేయగా, ప్రముఖ వేణుగాన విద్వాంసులు తాళ్లూరి నాగరాజు కొన్ని అన్నమాచార్య కీర్తనలను తన పిల్లనగ్రోవి ద్వారా అద్భుతంగా వినిపించారు. శ్రీవేదవ్యాస శ్రీరామ భట్టార్ అన్నమయ్య జీవిత కథను సంక్షిప్తంగా హరికథా గానం ద్వారా విన్పించి రక్తికట్టించారు.
ఈ కార్యక్రమంలో పోలాండ్ దేశానికి చెందిన తెలుగు భాషతో పరిచయం లేని, భారతదేశంతో సంబంధం లేని 12 సంవత్సరాల వయస్సున్న జిబిగ్స్ అనే బాలుడు అనుకోని అతిథిగా పాల్గొని శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని, ‘కలగంటి కలగంటి’ అనే అన్నమాచార్య సంకీర్తనను అత్యంత మధురంగా వినిపించి అందరినీ సంభ్రమాశచ్యారాలకు గురి చేశాడు.
తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరికి, కార్యక్రమ విజయానికి తోడ్పాటు అందించిన వారందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.