రాజకీయం వేడెక్కుతోంది. సార్వత్రిక ఎన్నికలకు సమయం మరో రెండేళ్ల లోపే ఉంది. చివరి ఆరు నెలలూ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుతుందనుకుంటే, ఏడాదిన్నర సమయంలోనే అసలు రాజకీయం జరగనుంది. ముందస్తు ఎన్నికల ఊహాగానాలూ ఒక మూలన ఉండనే ఉన్నాయి.
ఇప్పటికిప్పుడు కాకపోయినా, చివరి ఏడాదిలో అయినా జగన్ ముందస్తు ఎన్నికలకు తెర తీస్తారనే టాక్ ఉంది. అయితే జగన్ పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో అంతుబట్టనిది. కాబట్టి ముందస్తు ఎన్నికల గురించి ఊహాగానాలు కేవలం ఊహాగానాలు మాత్రమే! ఇది నాణేనికి ఒక వైపు.
ఇంకో వైపు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ల పాలన పూర్తయ్యింది. పదేళ్ల పోరాటం అనంతరం అనుకున్న పదవిని భారీ మెజారిటీతో సాధించుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో కొన్ని అవాంతరాలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. రాజకీయంగా జగన్ తీసుకుంటున్న విధాన పరమైన నిర్ణయాల్లో చాలా వాటికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
జగన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ఎవరో ఒకరు కోర్టు లకు వెళ్లడం, ఆ తర్వాతి పరిణామాలు అనేక మలుపులు తిరగడం జరుగుతూనే ఉంది. ఇదో సీరియల్ లా సాగుతూ ఉంది. అమరావతి, మూడు రాజధానులు వంటి అంశాల్లో జగన్ ఆటంకాలతో కొంత వెనక్కు తగ్గాల్సి కూడా వచ్చింది. మరి ఈ అంశంపై జగన్ ముందు ముందు వేసే అడుగులు ఎలా ఉంటాయనేది ఆసక్తిదాయకమైన అంశం.
జగన్ పాలనలో ఇప్పటి వరకూ పూర్తయిన మూడేళ్లపై ప్రజల స్పందన ఎలా ఉందనేది అత్యంత ఆసక్తిదాయకమైన అంశం. సంక్షేమమే పరమావధిగా జగన్ పాలన సాగుతూ ఉంది. ఏ ప్రభుత్వం అయినా చేయాల్సింది ఇదే కానీ, జగన్ చేస్తుండే సరికి మాత్రం ప్రత్యర్థులు తట్టుకోలేకపోతున్నారు. జగన్ సంక్షేమ కార్యక్రమాల వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని, ఏపీ శ్రీలంక అవుతుందంటూ అసంబద్ధమైన వాదనలను వినిపిస్తూ ఉన్నారు.
జగన్ మాత్రం ఈ విమర్శలకు జడవడం లేదు. సంక్షేమం విషయంలో రాజీ లేదంటున్నారు. గమనించాల్సిన అంశం ఏమిటంటే.. జగన్ కార్యక్రమాల్లో చాలా వరకూ ఆయన మెనిఫెస్టోలో పేర్కొన్నవే. తన మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలను జగన్ అమలు చేస్తూ ఉన్నారు. మెనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 95 శాతం వరకూ నెరవేర్చినట్టుగా జగన్ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఒక నాయకుడికి, అనుచరులకూ గర్వించడానికి ఇంతకన్నా వేరే గొప్ప విషయం ఉండదు.
ఇక అభివృద్ధి విషయంలో జగన్ నాయకత్వంలో పడుతున్న అడుగులను విస్మరించడం మీడియాలో సహజంగా జరుగుతోంది. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు అనామకులతో చేసుకున్న ఎంవోయులు కూడా పతాక శీర్షిక వార్తలు, వేల, లక్షల కోట్ల పెట్టుబడులు అయ్యాయి. ఆ ఎంవోయులు చిత్తుకాగితాలతో సమానం అయినప్పటికీ వాటికి అనుకూల మీడియా ఇచ్చిన ప్రచారం అంతా ఇంతా కాదు! అలాంటి ప్రచార ఆర్భాటాలు, అవకాశాలు జగన్ కు లేవు.
ఆంధ్రప్రదేశ్ అనేది పురోగమనంలో ఉన్న రాష్ట్రం. దానికి ఉన్న అవకాశాలను బట్టి, వనరులను బట్టి వచ్చే పెట్టుబడులు, కంపెనీలు వస్తూనే ఉంటాయి. అది సహజమైన అంశం. జగన్ సీఎం అయ్యాకా కూడా చెప్పుకోదగిన స్థాయిలో ప్రాజెక్టులు ఏపీ బాట పట్టాయి. అయితే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అయినా, ఇప్పుడు జగన్ హయాంలో అయినా… ఇలాంటి సానుకూల అంశాలకు వచ్చే ప్రచారాలు అంతంత మాత్రం! చంద్రబాబుకు ఉన్న మీడియా బలం, బలగం జగన్ కు లేదు, రాదు! అది వేరే కథ.
ప్రతిపక్షాల పరిస్థితి…
గత మూడేళ్లలో ఏపీలో ప్రతిపక్ష పార్టీలూ పని చేస్తూ ఉన్నాయి. అయితే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ తన పాత్రను చాలా పరిమితం చేసుకుంది. మూడేళ్లలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వెబ్ మీట్ లకే పరిమితం అయ్యారు. ప్రజల మధ్యకు వెళ్లింది లేదు. అమరావతిని ఇష్యూని మినహాయిస్తే మరో విధానపరమైన అంశంలో చంద్రబాబు నాయుడు ఆరాటం, పోరాటాలు లేవు. ఆయన కన్నా తెలుగుదేశం నేతలు మరింత మొహాలు చాటేశారు.
నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజలను పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. అధికారంలో ఉన్నప్పుడు అంతా తామైన నేతలు కూడా, అధికారం కోల్పోయిన వెంటనే ఇళ్లకు పరిమితం అయ్యారు. కరోనా కష్టకాలంలో కానీ, మరే అంశంలో అయినా కానీ తెలుగుదేశం పార్టీ నేతల పనితీరులో చెప్పుకోదగిన అంశాలేమీ లేవు. ప్రతిపక్షం అంటే ప్రభుత్వాన్ని విమర్శించడమే తప్ప, మరేం చేయనక్కర్లేదు అనే తీరున ఉంది తెలుగుదేశం నేతల తీరు. వీరికి మీడియా అండ ఉండనే ఉంది.
ఇది తెలుగుదేశం పార్టీకి ఎంత ప్లస్సో అంత మైనస్. తెలుగుదేశం నేతలు ఏ చిన్నప్రకటన చేసినా మీడియాలో పెద్ద కవరేజీ వస్తుంది. అయితే ఇలాంటి ప్రకటన వల్ల వచ్చే ప్రయోజనం మాత్రం శూన్యం. తెలుగుదేశం పార్టీ ఉనికిని ఈ కవరేజీ కొంత కాపాడుతుందేమో కానీ, ప్రజల్లో మాత్రం ఆ పార్టీ విశ్వసనీయత ఈ తరహాలో పెరగదు. ఇక ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు జనం మధ్యకు కదిలారు. జిల్లాల పర్యటన ద్వారా తిరిగి పట్టు పెంపొందించుకునే ప్రయత్నంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ మాత్రం సోషల్ మీడియాకు, పత్రికాప్రకటనలకూ పరిమితం అయ్యారు.
మరోవైపు చంద్రబాబు నాయుడు పొత్తుల కోసం స్నేహహస్తాలు చాచుతున్నారు. పవన్ కల్యాణ్ తో జట్టు కట్టడానికి తాపత్రయపడుతూ ఉన్నారు. ఈ ప్రయత్నంలో ఆయన తనది వన్ సైడ్ లవ్ గా చెప్పుకుంటూ ఉన్నారు స్వయంగా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం అధినేత చాచిన స్నేహహస్తాన్ని అందుకోవడానికి పవన్ కల్యాణ్ కూడా తాపత్రయపడుతూ ఉన్నాడు.
ఇప్పటికే వీరు సాగిస్తున్న రహస్య స్నేహం ఎన్నికల నాటికి పూర్తిగా బాహాటం కావడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కలిసి పోటీ చేసినా, చేయకపోయినా చంద్రబాబు నాయుడి చేతిలో మనిషి పవన్ కల్యాణ్ అనే అభిప్రాయాలు బలంగా నాటుకున్నాయి. వీరి పొత్తు దాదాపు లాంఛనం. ఈ వ్యవహారంలో బీజేపీ కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తుందా, చంద్రబాబు – పవన్ కల్యాణ్ ల పొత్తు ప్రేమను నిరసిస్తూ పవన్ కల్యాణ్ కు దూరం అవుతుందా.. అనేది ఎన్నికలు ఎప్పుడొస్తే అప్పుడు క్లారిటీ వచ్చే అంశం కావొచ్చు.
ఇంతకీ ప్రజలేమనుకుంటున్నారు?
ఈ రాజకీయ పరిస్థితుల్లో ఇంతకీ ప్రజలేమనుకుంటున్నారు? అనేది అన్నింటికి మించిన ఆసక్తిదాయకమైన అంశం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజల పొలిటికల్ పల్స్ ను పట్టే ప్రయత్నం చేసింది గ్రేట్ ఆంధ్ర.
ఆంధ్రప్రదేశ్ లోని వేర్వేరు ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయాలను తీసుకుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారు? అనే అంశంపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది.
రాయలసీమ, ఆంధ్ర, కోస్తా, ఉత్తరాంధ్ర ల్లో వేర్వేరుగా ఈ సర్వేను చేపట్టడం జరిగింది. నాలుగు రకాల ప్రాంతాల పరిస్థితులను బట్టి ప్రజలు జగన్ పాలనను ఎలా చూస్తున్నారు? వచ్చే ఎన్నికల్లో వారి మొగ్గు ఎటు ఉంది? అనే అంశాలపై ఈ అధ్యయనం జరిగింది.
మూడేళ్ల పాలన అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన పట్ల పూర్తి సానుకూలత వ్యక్తం అయ్యింది గ్రేట్ ఆంధ్ర అధ్యయనంలో. నాలుగు ప్రాంతాల నుంచి వేల శాంపిల్స్ ను సేకరించి, సశాస్త్రీయంగా జరిగిన ఈ అధ్యయనం ఫలితాలు ఇలా ఉన్నాయి.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల సానుకూలంగా ఉన్న ఓటర్ల శాతం 51. ఎన్నికలెప్పుడు వచ్చినా తాము జగన్ కే ఓటేస్తామని వీరు స్పష్టంగా చెప్పారు. వందకు 51 శాతం ఓటర్ల మెప్పును పొందుతూ ఉన్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ శాతానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. గత ఎన్నికల్లో జగన్ కు దక్కిన ఓట్ల శాతం కన్నా ఇది కాస్త ఎక్కువ.
గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఇదే శాతం ఓట్లు పడ్డాయి. ఈ అధ్యయనంలో జగన్ పాలన పట్ల సానుకూలంగా స్పందించిన వారి శాతం 51. ఇది మూడేళ్ల పాలన తర్వాత జగన్ పట్ల వ్యక్తం అయిన సానుకూల ధోరణి అని చెప్పవచ్చు.
ప్రాంతాల వారీగా తేడాలు!
అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన, వచ్చే ఎన్నికల్లో ఓటెవరికి అనే అంశంలో ప్రాంతాల వారీగా కాస్త తేడాలు ఉండటం గమనార్హం. జగన్ పాలనకు ఎక్కువ మార్కులు వేస్తోంది రాయలసీమ. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రికార్డు స్థాయిలో సీట్లను ఇచ్చింది రాయలసీమ. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలు పోటీ పడి జగన్ కు సీట్లను ఇచ్చాయి. అనంతపురం జిల్లాలో రెండు సీట్లు, చిత్తూరు జిల్లాలో ఒక సీటు మినహాయిస్తే రాయలసీమ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. విశేషం ఏమిటంటే.. సీమలో జగన్ హవా ఏ మాత్రం తగ్గలేదు. రాయలసీమ లో సేకరించిన శాంపిల్స్ ప్రకారం జగన్ పట్ల దాదాపు 60 శాతం సానుకూలత ఉంది. సీమలో తెలుగుదేశం పార్టీ దయనీమైన పరిస్థితుల్లోకి జారి పోయింది.
రాయలసీమలో ఉన్న 50కి పైగా అసెంబ్లీ సీట్లలో అతి తక్కువ స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త వ్యతిరేకపవనాలు వీస్తున్నాయి. ఒక టర్మ్ అధికారాన్ని పూర్తి చేసుకునే సరికి ముఖ్యమంత్రి పై అయినా, ఎమ్మెల్యేలపై అయినా కాస్తో కూస్తో వ్యతిరేకత ఉంటుంది. ఇలాంటి ప్రభావం కొన్ని నియోజకవర్గాల్లో కాస్త ఎక్కువగా కూడా ఉండొచ్చు. రాయలసీమలో ఇలాంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. స్థూలంగా 60 శాతం సానుకూలత వ్యక్తం అయినప్పటికీ.. సీమలో ఎమ్మెల్యేల వారీగా చూస్తే మాత్రం కొందరిపై ఈ అధ్యయనంలో వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.
జగన్ పాలనపై ఉన్న సానుకూలత ఈ ఎమ్మెల్యేలపై లేదు. జగన్ ఫ్యాక్టర్ గట్టిగా పని చేస్తే తప్ప ఇలాంటి వారు కొందరు విజయం సాధించే అవకాశలు లేవు. అయితే గత ఎన్నికల్లో రాయలసీమలో 90 శాతానికి పైగా సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, జగన్ పై వ్యక్తం అవుతున్న 60 శాతం సానుకూల ఫలితంగా మరోసారి అలాంటి ఫీటే నమోదైనా ఆశ్చర్యం లేదు. ఎమ్మెల్యేలపై వ్యక్తిగతంగా ఉన్న వ్యతిరేకత ఆఖరి నిమిషం వరకూ ఏ మేరకు కొనసాగుతుందనేదే కీలకమైన అంశం. అభ్యర్థుల మార్పు వంటివి కూడా ప్రభావం చూపే అంశాలే.
గ్రేటర్ రాయలసీమ పరిధిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుకూలత వ్యక్తం అయ్యింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రాయలసీమ తరహాలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలత ఉంది. వాటం కుదిరితే ఈ రెండు జిల్లాల్లో కూడా గత ఎన్నికలకు ధీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లను సంపాదించుకోనుంది. ఇలా ఆరు జిల్లాల పరిధిలో వైఎస్ జగన్ పట్ల దాదాపు 60 శాతం సానుకూలత వ్యక్తం అయ్యింది.
ఆంధ్రలో తగ్గిన వైఎస్ఆర్సీపీ జోరు!
రాయలసీమకు ధీటుగా ఆంధ్ర ప్రాంతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు వచ్చాయి. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోరు కాస్త తగ్గింది. ప్రత్యేకించి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పోలిస్తే కృష్ణ, గుంటూరు జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోరు తక్కువగా కనిపిస్తూ ఉంది.
ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కిన సానుకూలత 50 శాతం మాత్రమే. గ్రేటర్ రాయల సీమ జిల్లాల్లో 60 శాతంగా ఉన్న సానుకూలత కృష్ణ, గుంటూరు వరకూ వచ్చే సరికి 50 శాతానికి పడిపోయింది. మరి దీనికి రాజధాని అంశం కారణమా, మరో అంశమా అనేది పక్కన పెడితే.. ఈ జిల్లాల్లో అర్బన్ ఓటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగా లేరు.
గుంటూరు, విజయవాడ సిటీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఎదురుగాలి వీస్తూ ఉంది. అయితే రూరల్ ప్రాంతాల్లో మాత్రం కాస్త మెరుగైన పరిస్థితి ఉంది. రూరల్ నుంచి వ్యక్తం అవుతున్న సానుకూలతతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాల్లో కనీసం 50 శాతం సానుకూలతను సంపాదించింది. కేవలం అర్బన్ నే పరిగణనలోకి తీసుకుంటే మాత్రం ఈ స్థాయి సానుకూలత లేదు. అర్బన్, రూరల్ ఓటర్ ను కలగలిపితే ఈ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50 శాతం సానుకూలత వ్యక్తం అయ్యింది.
ఇది కూడా మెరుగైన శాతమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతానికి దాదాపు సరిసమానం ఇది. అయితే.. పట్టణ ప్రాంతం ఓటర్ నుంచి ఇక్కడ జగన్ పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలత వ్యక్తం కాకపోవడంతో కొన్ని అసెంబ్లీ సీట్లపై గట్టి ప్రభావం పడనుంది. గ్రామీణ ప్రాంతం ఉన్న నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగినా, సిటీ ఓటర్ ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం ఈ హవా వచ్చే ఎన్నికల్లో తగ్గుముఖం పట్టవచ్చు.
విజయవాడ, గుంటూరు.. పట్టణాల్లోని అసెంబ్లీ సీట్ల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తతతో వ్యవహరించాల్సిన అవసరాన్ని అధ్యయనం హైలెట్ చేస్తోంది. ఇదే సమయంలో ఈ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతంలో కూడా సీమలో ఉన్నంత సానుకూలత లేదనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తెరగాల్సి ఉంది.
గోదావరి జిల్లాల్లో త్రిముఖ పోరు!
గోదావరి జిల్లాల్లో త్రిముఖ పోరులాంటిది నెలకొని ఉండటం గ్రేట్ ఆంధ్ర అధ్యయనంలో తేలిన ఆసక్తిదాయకమైన అంశం. నియోజకవర్గాల వారీగా కాకుండా, ఓట్ల శాతం వారీగా చూస్తే ఈ జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే లీడ్ లో ఉంది. జగన్ పార్టీ పట్ల సుమారు 40 శాతం మంది ఓటర్లు సానుకూలంగా ఉన్నారు. ఈ జిల్లాల్లో రెండో స్థానంలో ఉంది తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూలత వ్యక్తం అయ్యింది. సుమారు 35 శాతం మంది తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపించారు.
ఇక ఈ జిల్లాల మీదే ఆశలు పెట్టుకున్న జనసే పట్ల కూడా ఇక్కడ ఓ మోస్తరు సానుకూలత వ్యక్తం అయ్యింది. జనసేన పట్ల దాదాపు 25 శాతం మంది అనుకూలత వ్యక్తం చేశారు. ఇది స్థూలంగా ఉభయగోదావరి జిల్లాల ఓట్ల శాతం లెక్క. ఒక విధంగా ఇక్కడ ముక్కోణపు పోరు నెలకొని ఉంది. ఒకవేళ తెలుగుదేశం, జనసేనలు కలిసి పోటీ చేస్తే.. వాటి ఓట్ల శాతం 60 శాతంగా తేలవచ్చు. అయితే రాజకీయాల్లో ఒకటి , ఒకటి కలిపితే ఎప్పటికీ రెండు కాదు అనే ఒక పాత సామెత ఉంది.
ఆ పార్టీలు కలిసి పోటీ చేస్తాయా లేదా అనే సంగతిని పక్కన పెడితే ఉభయ గోదావరి జిల్లాల్లో సోలోగా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే లీడ్ లో ఉంది. అయితే అనుకూలత ఇక్కడ 40 శాతానికి పరిమితం కావడం గమనార్హం.
విశాఖ, ఉత్తరాంధ్రల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్!
ఉత్తరాంధ్ర, విశాఖల్లో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కనిపిస్తూ ఉంది. ఈ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలత 54 శాతం వరకూ నమోదు అయ్యింది. రాయలసీమ స్థాయిలో కాకపోయినా, కృష్ణ-గుంటూరు, గోదావరి జిల్లాల్లో కన్నా ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల సానుకూల ధోరణి బాగా ఉంది.
ఈ జిల్లాల్లో రెండో పెద్ద ప్లేయర్ తెలుగుదేశం పార్టీనే. జనసేన ప్రభావం కూడా ఇక్కడ తక్కువగానే ఉంది. 54 శాతం సానుకూలతతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రలో నిలదొక్కుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
రాష్ట్రం మొత్తం మీదా కలిపి 51 శాతం!
గ్రేటర్ రాయలసీమ పరిధిలో 60 శాతం, కృష్ణా-గుంటూరు ప్రాంతంలో 50 శాతం, గోదావరి జిల్లాల్లో 40 శాతం, ఉత్తరాంధ్రలో 54 శాతం .. స్థూలంగా 51 శాతం సానుకూలతతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో తను సంపాదించిన ఓటు బ్యాంకును ధీమాగా పొందుతుందనేది ఈ సర్వేలో తేటతెల్లం అవుతోంది.
సశాస్త్రీయమైన అధ్యయనం!
ప్రాంతాల వారీగా ప్రజల పల్స్ ను వేర్వేరుగా పట్టిన ప్రయత్నం ఇది. గ్రేటర్ రాయలసీమ, ఆంధ్ర, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర వేర్వేరుగా పరిగణిస్తూ ఈ అధ్యయనం జరిగింది. పట్టణ ఓటరు, గ్రామీణ ఓటరు, కులాల విభజన, స్త్రీ- పురుష.. వంటి విభజనలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అధ్యయనం జరిగింది. వీటి ప్రకారం.. 51 శాతం ఓట్లను పొందే అవకాశం తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది.
తెలుగుదేశం పార్టీ ఎక్కడా కోలుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలెప్పుడు వచ్చినా సోలోగా ఓట్ల శాతం విషయంలో వైఎస్ జగన్ విజేతగా నిలుస్తాడని ఈ అధ్యయనం స్పష్టం చేస్తూ ఉంది.