ఇన్నాళ్లూ పెద్ద సినిమాలు ఓటీటీలోకి రాకపోవడానికి ప్రధాన కారణం మార్కెట్ సమస్య. నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తే బ్రేక్ ఈవెన్ కష్టం. ఇప్పుడా సందేహాలు, సమస్యలకు రాధే చెక్ పెట్టాడు.
ఒకేసారి ఇటు ఓటీటీలో, అటు అందుబాటులో ఉన్న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. పెద్ద సినిమాలకు ఓ మార్గం చూపించింది. ఇప్పుడిదే దారిలో నడవడానికి సిద్ధమౌతోంది ఏజెంట్ సినిమా.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా రాబోతున్న ఈ సినిమాకు ''రాధే మోడల్'' ను ఫాలో అవ్వాలని అనుకుంటున్నారట. మూవీని ఒకేసారి ఇటు ఓటీటీ, అటు థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.
నిజానికి ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు. రిలీజ్ టైమ్ కు కరోనా పరిస్థితులన్నీ సర్దుకుంటాయి కూడా. అయినప్పటికీ మేకర్స్ ఇలా నిర్ణయించడానికి ఓ కారణం ఉంది. అఖిల్-సురేందర్ రెడ్డి సినిమాకు బడ్జెట్ సమస్యలున్నాయి.
అఖిల్ మార్కెట్ ను మించి బడ్జెట్ అవుతోంది ఏజెంట్ సినిమాకు. అందుకే ఓ మంచి ఓటీటీ పార్టనర్ ను భాగస్వామిగా చేసుకొని.. థియేటర్-ఓటీటీలో ఒకేసారి రిలీజ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తున్నారట. అయితే ఇదంతా ఇంకా ఆలోచన దశలోనే ఉంది.
మరోవైపు ఏజెంట్ సినిమాకు సంబంధించి కొంతమంది రైటర్లను ప్రత్యేకంగా తీసుకున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా స్క్రిప్ట్ ను మరింత టైట్ గా మలిచేందుకు ఓ నెల రోజుల పాటు రైటర్స్ తో కలిసి కూర్చోబోతున్నాడు.