క‌రోనా కంటే ప్ర‌మాదకారిగా ఈనాడు

దేశ‌మంతా క‌రోనా క‌ట్ట‌డికి పోరాడుతుంటే, ఏపీలో మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి. ఇక్క‌డ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం త‌న‌కు రాజ‌కీయాలే ముఖ్య‌మ‌ని, ఆ త‌ర్వాతే క‌రోనా క‌ట్ట‌డి అని త‌న చ‌ర్య‌ల ద్వారా తేల్చి చెబుతోంది.…

దేశ‌మంతా క‌రోనా క‌ట్ట‌డికి పోరాడుతుంటే, ఏపీలో మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి. ఇక్క‌డ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం త‌న‌కు రాజ‌కీయాలే ముఖ్య‌మ‌ని, ఆ త‌ర్వాతే క‌రోనా క‌ట్ట‌డి అని త‌న చ‌ర్య‌ల ద్వారా తేల్చి చెబుతోంది. క‌రోనా పాజిటివిటీ అంటే ఎంత భ‌య‌మో, టీడీపీ నెగెటివిటీ కూడా జ‌నాన్ని అంతే భ‌య‌పెడుతోంది. కొత్త ర‌కం వైర‌స్ క‌ర్నూల్‌లో పుట్టింద‌నే ప్ర‌చారాన్ని తెర‌పైకి తెచ్చి, ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లే తెలుగు వాళ్ల‌ను ఇబ్బందుల‌కు గురి చేశారు. టీడీపీ నెగెటివిటీ వైర‌స్‌కు వ్యాక్సిన్ క‌నుగొనేదెప్పుడు? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

టీడీపీ నెగెటివిటీ వైర‌స్‌కు ఈనాడు తోడైంది. అగ్గికి గాలి తోడైన చందంగా క‌రోనా వైర‌స్‌పై టీడీపీ దుష్ప్ర‌చారానికి ఈనాడు అస‌త్య క‌థ‌నాలు తోడ‌య్యాయ‌నే విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. టీడీపీ రాజ‌కీయాలు చేయ‌డంలో అర్థ‌ముంది. కానీ ఈనాడు త‌న రాత‌ల‌తో క‌రోనా కంటే ప్ర‌మాద‌కారిగా త‌యారైంద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

తాజాగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను అడ్డు పెట్టుకుని జ‌గ‌న్ స‌ర్కార్‌ను బ‌ద్నాం చేసే కుట్ర‌ల‌కు టీడీపీ తెర‌లేపింది. దీనికి ప్ర‌ధానంగా ఈనాడు ఆజ్యం పోస్తోందనేందుకు వాటి క‌థ‌నాలే ఆధారాలు. ఏపీలో ప్ర‌తి ఒక్క‌రికీ వ్యాక్సిన్ ఇవ్వ‌క‌పోవ‌డానికి జ‌గ‌న్ స‌ర్కారే కార‌ణ‌మ‌ని టీడీపీ ఆరోపించ‌డం, దానికి ఈనాడు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతోంది.

అయితే వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో టీడీపీ విమ‌ర్శ‌ల్లోని డొల్ల‌త‌నాన్ని తిప్పికొట్ట‌డంలో జ‌గ‌న్ స‌ర్కార్ విఫ‌ల‌మైంది. వ్యాక్సినేష‌న్‌పై అజ‌మాయిషి ఎవ‌రిదో, ఎందుకు త‌గినంత‌గా వ్యాక్సిన్లు రావ‌డం లేదో, వ్యాక్సిన్లు తెప్పించేందుకు ప్ర‌భుత్వ ప‌రంగా తామేం చేస్తున్నామో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆధారాల‌తో స‌హా బ‌య‌ట పెట్ట‌డ‌తంతో టీడీపీ అవాక్కైంది. మ‌రోవైపు ఇంత‌టి క‌రోనా విప‌త్కాలంలో కూడా క‌నీసం జ‌నం కోస‌మైనా ఈనాడు త‌న నెగెటివిటీ పంథాను మార్చుకోక పోవ‌డం గ‌మ‌నార్హం.

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ మొత్తం కేంద్ర ప్ర‌భుత్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉంటుంది. రాష్ట్రాల వారీగా ఎవ‌రెవ‌రికి ఎంతెంత మోతాదులో స‌ర‌ఫ‌రా చేయాలో కేంద్ర ప్ర‌భుత్వ‌మే ఫార్మా కంపెనీల‌కు నిర్దేశిస్తుంది. అంతేకాదు, కంపెనీలకు ఎంత డబ్బు చెల్లించాలో రాష్ట్రాల క్కూడా కేంద్రమే చెబుతోంది. ఏ వయసు వారికి వ్యాక్సిన్‌ ఇవ్వాలో కూడా కేంద్రమే నిర్దేశిస్తుంది. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌కు సంబం ధించి ఇవి వాస్త‌వాలు. అయితే టీడీపీ, ఈనాడు టీడీపీల‌ది ఒక‌టే ఎజెండా… జ‌గ‌న్ స‌ర్కార్‌పై జ‌నంలో నెగెటివిటీ పెంచ‌డం. త‌ద్వారా త‌మ‌పై పాజిటివిటీ ద‌క్కించుకుని రాజ‌కీయంగా ల‌బ్ధి పొంద‌డం.

పైపెచ్చు వ్యాక్సినేష‌న్ కేంద్రాల వ‌ద్ద టీడీపీ ఆందోళ‌న‌కు దిగ‌డం కుట్ర‌ల‌కు ప‌రాకాష్ట అని ప్ర‌త్య‌ర్థులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర జ‌నాభాకు త‌గినంత‌గా  వ్యాక్సిన్‌లు  స‌ర‌ఫ‌రా చేయ‌ని కేంద్రంపై ఒక్క విమ‌ర్శ చేయ‌డానికి కూడా టీడీపీ నేత‌ల‌కు ద‌మ్ము లేదు. అలాగే క‌రోనా సెకెండ్ వేవ్ హెచ్చ‌రిక‌ల విష‌యం తెలిసి కూడా అప్ర‌మ‌త్తం కాని మోదీ స‌ర్కార్‌పై వ్య‌తిరేక క‌థ‌నాలు రాసే ధైర్యం ఈనాడుకు లేదు. కానీ ఏ సంబంధం లేని జ‌గ‌న్ స‌ర్కార్‌పై మాత్రం ఒంటికాలిపై లేవ‌డానికి ఎల్లో బ్యాచ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటోంది.

ఈ రోజు ఈనాడు పత్రిక‌లో “ప్ర‌తి ఒక్క‌రికీ టీకా వేయాలి” శీర్షిక‌తో ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించారు. ఇందులోని అభిప్రాయాలు చ‌దివితే ఎల్లో బ్యాచ్ ఎంత ప‌క‌డ్బందీగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త పెంచ‌డానికి కుట్ర ప‌న్నిందో స్ప‌ష్టంగా తెలుస్తుంది. కేంద్ర ప్ర‌భుత్వ వైఫల్యాన్ని విమ‌ర్శించిన ఒకే ఒక్క‌డిగా సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి మ‌ధు ఒక్క‌రే క‌నిపించారు.

టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు, అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి, టీడీపీ అన‌ధికార ప్ర‌తినిధి సీపీఐ రామ‌కృష్ణ‌, కాంగ్రెస్ నేత‌లు తుల‌సిరెడ్డి, శైల‌జానాథ్‌ల అభిప్రాయాల్లో మాట వ‌రుస‌కైనా కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

జ‌గ‌న్ స‌ర్కార్‌పై వ్య‌తిరేక‌త పెంచ‌డానికి క‌రోనా సెకెండ్ వేవ్ ఉధృతికి మించిన మంచి త‌రుణం లేద‌ని ఎల్లో బ్యాచ్ బ‌లంగా న‌మ్మిన‌ట్టుంది. అందుకే ఈ విప‌రీత పోక‌డ‌లు. ఇంత‌కూ ఎల్లో వైరస్ క‌ట్ట‌వికి వ్యాక్సిన్ క‌నుగొనేదెప్పుడు?

సొదుం ర‌మ‌ణ‌