కరోనా నియంత్రణలో భాగంగా మున్సిపల్ సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకోమంటే కుదరదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు తాజాగా ఆదేశాలు కూడా ఇచ్చింది. మున్సిపల్ సిబ్బంది తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకుని తీరాల్సిందేనని ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఒకవేళ ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకోడానికి నిరాకరిస్తే …అందుకు తగ్గ కారణాలను వివరించడంతో పాటు మెడికల్ సర్టిఫికెట్‌ను సమర్పించాలని ప్రభుత్వ ఆదేశాల్లో స్పష్టం చేశారు.
కొన్ని చోట్ల వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మరణించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో సహజంగానే భయాందోళనలు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు మున్సిపల్, అంగన్వాడీ, సచివాలయ, ఆరోగ్య సిబ్బందితో పాటు వాలంటీర్లు కూడా వ్యాక్సిన్ వేయించుకోడానికి నిరాకరిస్తున్నారు. దీంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
ప్రభుత్వ లేదా ప్రభుత్వ అనుబంధ సిబ్బందికి వయస్సుతో నిమిత్తం లేకుండా వ్యాక్సిన్ వేయించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.
ప్రభుత్వ సిబ్బందే అనుమానంతో వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రాకపోతే, ఇక సాధారణ ప్రజానీకానికి ఏ విధంగా నమ్మకం కలుగుతుందని అధికారులు వాదిస్తున్నట్టు సమాచారం. మరోవైపు నిర్బంధ వ్యాక్సినేషన్‌పై కొంత మంది సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.