కుప్పం కూసాలు కదిలే వేళాయె..!

గతంలో కుప్పంలో ఎమ్మెల్యే సీటుకి నామినేషన్ వేసేందుకు కూడా చంద్రబాబు వచ్చేవారు కాదు. ఆయన తరపున కుటుంబ సభ్యులు నామినేషన్ వేసేవారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు తానే స్వయంగా కుప్పం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.…

గతంలో కుప్పంలో ఎమ్మెల్యే సీటుకి నామినేషన్ వేసేందుకు కూడా చంద్రబాబు వచ్చేవారు కాదు. ఆయన తరపున కుటుంబ సభ్యులు నామినేషన్ వేసేవారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు తానే స్వయంగా కుప్పం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మూడు నెలలకోసారి వస్తానని నాయకులకు చెబుతున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటానని అంటున్నారు. 

చంద్రబాబులో ఇంత మార్పు ఎలా వచ్చింది. 30ఏళ్లకు పైగా కుప్పంని పట్టుకుని వేలాడుతున్న బాబులో అంత భయం ఎందుకొచ్చింది.

ఇల్లు కట్టుకున్నా, ఇంటికో బంగారు నాణెం పంచినా కుప్పంలో చంద్రబాబుకి ఓటమి తప్పదు అనే ధైర్యం వైసీపీలో ఎందుకొచ్చింది. 2024లో కుప్పం రిజల్ట్ చారిత్రాత్మకంగా ఉంటుందా..? 2019లో పార్టీ, 2024లో బాబు శకం ముగిసినట్టేనా..?

కుప్పంలో వైసీపీ హవా..

వైఎస్ఆర్ ఫ్యామిలీకి కడప జిల్లా కంచుకోట. పార్టీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా.. అక్కడ మెజార్టీ సీట్లు రాకపోయినా, మెజార్టీలో తేడా వచ్చినా జగన్ కి అవమానం. ప్రస్తుతం జగన్ హవాతో ప్రతి జిల్లా కూడా కడప జిల్లాలాగే ఉందనుకోండి. 

కడపతో సహా మరికొన్ని జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 2024లో మిగతా జిల్లాలలో కూడా టీడీపీని తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉంది. ఆ మాటకొస్తే టీడీపీకి సొంత జిల్లా అంటూ లేదు కానీ, కుప్పం నియోజకవర్గం గురించి చంద్రబాబు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అది టీడీపీకి కంచుకోట అనుకుంటారు. కానీ ఆ కంచుకోటకు రెండు పర్యాయాలుగా బీటలు మొదలయ్యాయి. 

ఇక స్థానిక ఎన్నికల్లో ఏకంగా కుప్పం ఎంపీటీసీ సీటు కూడా వైసీపీ ఎగరేసుకుపోయింది. దీంతో చంద్రబాబులో టెన్షన్ మొదలైంది. తన సీటు కిందకు నీళ్లొస్తున్నాయనే భయం మొదలైంది.

పెద్దిరెడ్డి టార్గెట్ కుప్పం..

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుప్పం నియోజకవర్గాన్ని, చంద్రబాబుని బాగా టార్గెట్ చేశారు. స్థానిక ఎన్నికల్లో కూడా ఆయన వ్యూహ రచన వల్లే టీడీపీ ఓడిపోయింది. ఇప్పుడు ఆయన నెక్ట్స్ టార్గెట్ 2024 ఎన్నికలు. 

అప్పటిలోగా టీడీపీని మరింత బలహీనపరచాలని, ఏకంగా చంద్రబాబుని కుప్పం నుంచి తరిమేయాలని టార్గెట్ పెట్టుకున్నారు పెద్దిరెడ్డి. ఇప్పటినుంచే అక్కడ ప్రణాళిక రచిస్తున్నారు.

బాబు పాట్లు..

ఓవైపు లోకేష్ కి నమ్మకమైన నియోజకవర్గం వెదికే పనిలో బాబు కిందామీద అవుతున్నారు. కొడుకు మాత్రం మంగళగిరికే ఫిక్స్ అవుతానని చెబుతున్నా, బాబు మనసు ఏదో కీడు శంకిస్తోంది. ఇప్పుడు ఆయనకు కొత్త అనుమానాలు మొదలయ్యాయి. అసలు కుప్పంలో తాను గెలుస్తానో లేదోననే భయం పట్టుకుంది.

వరుసగా ఏడు దఫాలు కుప్పం నుంచి చంద్రబాబు ఎన్నికయ్యారు. 2024లో మాత్రం గెలుపు అంత ఈజీ కాదని అర్థమవుతోంది. స్థానికంగా పట్టు కోల్పోయారు, జూనియర్ ఎన్టీఆర్ వర్గం ఓవైపు పార్టీలో చీలికలు తెచ్చేలా కనిపిస్తోంది. దీంతో బాబు పదే పదే కుప్పం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇంటికి పునాదులు తీశారు. పెద్దిరెడ్డి చెప్పినట్టు వచ్చే ఎన్నికల్లో ఇంటికో బంగారునాణెం కూడా పంచే ఛాన్స్ ఉంది.

బాబు ఎంత భయపడుతున్నారో, వైసీపీ కుప్పాన్ని అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మొత్తానికి 2024 టీడీపీకే కాదు, చంద్రబాబు రాజకీయ జీవితానికి కూడా చరమగీతం పలికే అవకాశాలున్నాయని అర్థమవుతోంది.