ఏపీ బీజేపీ నేతలు ఒక ప్రణాళికంటూ లేకుండా నడుచుకుంటున్నారు. అసలు తమ లక్ష్యం ఏంటో తెలియకుండా ఏదేదో చేసేస్తున్నారు. ఏదేదో మాట్లాడుతున్నారు. మిత్రులెవరో, శత్రువులెవరో ఆ పార్టీ నేతలకు అర్థం కావడం లేదు.
ప్రత్యర్థుల కంటే సొంత పార్టీలోని కోవర్టులతోనే బీజేపీకి ప్రమాదం పొంచి వుంది. అలాగని వారిని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. తెలంగాణలో ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్‌కు ఇస్తున్న ప్రాధాన్యం కూడా, ఏపీలో బీజేపీ నేతలకు ఎల్లో మీడియా ఇవ్వడం లేదంటే ఏ స్థాయిలో కుట్ర జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో టీడీపీ ట్రాప్‌లో బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పడినట్టు కనిపిస్తోంది. ఆకస్మాత్తుగా ఆయన రాజధాని గ్రామాల్లో పర్యటించడం చర్చకు దారి తీసింది. రాజధానిపై అనుకూల వైఖరి తీసుకున్నంత మాత్రాన బీజేపీని ఆ ప్రాంత వాసులు ఆదరించరనేది వాస్తవం. అలాంటప్పుడు మిగిలిన ప్రాంతాలకు బీజేపీ చెడ్డ కావాలని ఎందుకు కోరుకుంటున్నదో కనీసం ఆ పార్టీ వాళ్లకైనా అర్థమవుతోందా?
మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో పనులను పట్టించుకోలేదని విమర్శించారు. గతంలోనే 80, 90 శాతం పనులు అయిపోయినా ఇప్పుడు 10శాతం పనులు కూడా పూర్తి కాలేదని జీవీఎల్ విమర్శించారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చిందని ఎంపీ చెప్పడం విశేషం.
రవాణా మార్గం లేక కేంద్ర సంస్థలు కొన్ని నిర్మాణాలు చేపట్టలేదని ఆయన అన్నారు. అమరావతి రాజధానిగా.. రైతులకు అండగా ఉంటామని జీవీఎల్ స్పష్టం చేయడం విశేషం. మరి రాయలసీమలో హైకోర్టు, రెండో రాజధాని ఏర్పాటు చేయాలని గతంలో బీజేపీ చేసిన సీమ డిక్లరేషన్ సంగతేంటని ప్రశ్నలకు జీవీఎల్ సమాధానం? ఏ మాత్రం ఆలోచన లేకుండా రాజకీయ అడుగులు వేస్తే… రెంటికీ చెడ్డ రేవడిలా బీజేపీ పరిస్థితి తయారవుతుందని గుర్తిస్తే మంచిది.