విశాఖకు ఐటి లేనట్లేనా?

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో అన్నీ విజయవాడ, గుంటూరుకు చేరుస్తూనే, పైకి మాత్రం అన్ని జిల్లాలకు అన్నీ అంటూ సాధ్యంకాని మాటలు ఎన్నో చెప్పారు. ఆ మధ్య అయితే విశాఖలో చిన్న భవనంలో…

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో అన్నీ విజయవాడ, గుంటూరుకు చేరుస్తూనే, పైకి మాత్రం అన్ని జిల్లాలకు అన్నీ అంటూ సాధ్యంకాని మాటలు ఎన్నో చెప్పారు. ఆ మధ్య అయితే విశాఖలో చిన్న భవనంలో బొలెడు ఐటి ఆఫీసులకు రిబ్బన్ కటింగ్ చేసేసి, ఇదిగో ఐటి మొత్తం విశాఖ వచ్చేసింది, ఇంకేంలేదు అంతా డెవలప్ మెంటే అంటూ నానా హడావుడి చేసారు. విశాఖలో ఐటి పేరు చెప్పి కొంత మంది స్థలాలు కూడా తీసేసుకున్నారు హాయిగా.

అయితే లోకేష్ మంత్రి కాగానే సీన్ మారిపోయింది. విశాఖలో చేసిన హడావుడి లాంటిదే, గన్నవరం మేథాటవర్స్ లో చేసారు. హెచ్ సి ఎల్ కు ఆఘమేఘాల మీద ఏకంగా 50 ఎకరాలు, అది కూడా కాస్త దూరంగానో, పల్లెటూళ్ల మధ్యనో కాదు, విజయవాడ శివార్లలో, గన్నవరం దగ్గర ఇచ్చేసారు. ఇదే వందల కోట్ల విలువ. హెచ్ సి ఎల్ ఆనందంగా తీసేసుకుంది. పైగా అమరావతి దగ్గర మరి కొన్ని ఎకరాలు ఇస్తామంటున్నారు. మరి కొన్ని సంస్థలను కూడా అమరావతికి తీసుకొస్తామంటున్నారు. మరి ఐటిని ఇలా అమరావతి, విజయవాడ దారి పట్టిస్తే, విశాఖ పరిస్థితి ఏమిటి?

ఇప్పటికే విశాఖకు ఏవీ లేకుండా చేసారు. రాజధాని లేదు. రైల్వే జోన్ రాలేదు. సినిమా ఇండస్ట్రీ నో. తెలుగుదేశం హయాంలో విశాఖకు బ్యూటిఫికేషన్ తప్ప వేరే ఒరిగింది లేదు. ఇదిలా వుంటే అసలు దేశ వ్యాప్తంగా ఐటి ఢమాల్ అంటోంది. సిబ్బందిని నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాలు పీకి ఇళ్లకు పంపిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత విలువైన యాభై ఎకరాలు తీసుకెళ్లి ఐటి కంపెనీ చేతిలో పెట్టడం ఏమిటొ? ఇలాగే గతంలో విశాఖ నడిబొడ్డున విప్రోకు ప్రభుత్వ ఆసుపత్రిని తీసేసి మరీ స్థలం అప్పగించారు చంద్రబాబు. కానీ అక్కడ ఇప్పటికీ పట్టుమని పది మంది పనిచేస్తున్న జాడ లేదు. అది కూడా ప్రభుత్వాలు ఎన్నోసార్లు, భవనం స్వాధీనం చేసేసుకుంటామని హెచ్చరికలు జారీ చేసిన తరువాత.

లోకేష్ ఐటి మంత్రి అయ్యారు. ఏదో చేద్దాం అనుకుంటే, దేశంలోనే ఐటి కుదేలు అవుతోంది. అయినా కూడా ప్రాజెక్టులు రప్పించుకోవడానికి ఇలా భూములు ఎర వేస్తున్నట్లు వుంది. అయినా హెచ్ సి ఎల్ లాంటి పెద్ద కంపెనీలకు కూడా భూములు ఇవ్వడం ఏమిటో? వాళ్లకు నిజంగా ఆంధ్రకు రావాలని వుంటే, భూములు కొనుక్కని రాలేరా? మొత్తం మీద ఐటి కోసం విశాఖను వదిలేసారు. స్థలాల పంపకం ప్రారంభించినట్లున్నారు.