మిస్టర్ సినిమా విడుదలైంది. సినిమాకు అంతగా పాజిటివ్ టాక్ రాలేదు. ఫస్ట్ హాఫ్ ఓకె అని అందరూ అంటున్నారు. కానీ సెకండాఫ్ దగ్గరకు వచ్చేసరికే దర్శకుడు శ్రీనువైట్ల శృతిమించి, చాదస్తానికి పోయి, ఏదేదో చేసాడు. సినిమా విడుదలకు ముందే రెండున్నర గంటల సినిమా చూసే ఓపిక ఇప్పటి జనాలకు లేదు మగడా అని ఎందరు చెప్పినా వినలేదని టాక్. తా తీసిన సినిమాకు ఇంటర్వెల్ నే అక్కర్లేదనే మోడరన్ సామెతలా, అలాగే జనం మీదకు వదిలాడు. దాంతో సెకండాఫ్ ను చూసి జనం గోల పెట్టారు.
దాంతో శ్రీను వైట్ల చాదస్తాన్ని చెత్తబుట్టలో వేసే పనికి శ్రీకారం చుట్టారు నిర్మాతలు అని గుసగుస. సెకండాఫ్ లో వచ్చే ఓ పాటను, కొన్ని సీన్లను శుభ్రంగా కత్తిరించి పారేసారని తెలుస్తోంది. దీంతో సినిమా పది నుంచి పన్నెండు నిమషాల నిడివి తగ్గింది. ఈ తగ్గించిన వెర్షన్ ను వీలయినంత త్వరగా థియేటర్లలోకి పంపే ఏర్పాటు చేస్తున్నారట. శ్రీనువైట్లను ఇలా కట్టడి చేయగలగడం అన్నిది స్క్రిప్ట్ దశ నుంచి చేసి వుంటే సినిమా ఇలా వుండి వుండేది కాదేమో ?