మలయాళ నటి భావనను లైంగిక వేధింపులకు గురి చేసిన వారిని విచారిస్తున్న పోలీసులు దీని వెనుక పెద్ద గూడుపుఠానీనే ఉందనే భావనను వ్యక్తం చేస్తున్నారు. ముందుగా దీన్ని ఆకతాయి చేష్టగా, బ్లాక్ మెయిలింగ్ వ్యవహారంగా చూసినా.. దీని వెనుక కొంతమంది పరిశ్రమ పెద్దలే ఉన్నట్టుగా వార్తలొస్తున్నాయిప్పుడు. ఆ పెద్దలే భావనపై ఈ అఘాయిత్యాన్ని చేయించారనే మాట వినిపిస్తోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో భావనను తీరును ఇష్టపడని వారు ఈ చేష్ట చేయించారని, కారు డ్రైవర్లను ఉపయోగించుకుని, వారికి కొంతమంది రౌడీలను జత చేసి.. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడేలా చేశారని తెలుస్తోంది.
ఈ పని చేసిన దుండగుల కాల్ డేటాను పరిశీలించి చూడగా.. భావనను వేధించిన తర్వాత వీళ్లు మలయాళ చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతలకు కాల్ చేశారని పరిశీలకు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ పని వెనుక వారి హస్తం ఉందనే మాట వినిపిస్తోంది.
భావనకు కొంతమంది హీరోలతో కూడా విబేధాలున్నాయనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకించి మలయాళీ స్టార్ హీరో దిలీప్ తో కూడా భావనకు పడదంటారు. దిలీప్ మజీ భార్య మంజూ వారియర్- భావనలు మంచి స్నేహితులు. మంజూ వారియర్ ను వివాహం చేసుకున్న దిలీప్ కొంత కాలానికే ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఆ సమయంలో భావన మంజు తరపున నిలిచింది. ఆ కక్షతోనే భావనకు మల్లూవుడ్ లో అవకాశాలు రాకుండా చూశాడట దిలీప్. ఇలాంటి వేధింపులతో భావన చివరకు పక్క భాష ఇండస్ట్రీలను చూసుకోవాల్సి వచ్చిందట.
ఇదంతా చూస్తుంటే.. భావనపై దాడి వెనుక కేరళ చిత్ర పరిశ్రమలోని కొంతమంది వ్యక్తులు ఉన్నారనే అభిప్రాయం బలపడుతోంది. అది ఎవరు.. ఇంతకు తెగించడం వెనుక ఇంకా కారణాలున్నాయా? అనే విషయాలు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.