ఆయనో పెద్ద నిర్మాత. పైగా మాంచి టేస్టున్న నిర్మాత. థియేటర్లు, డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు ఇలా ఒకటి అని కాదు. చాలా వున్నాయి. ఆయన ఈ మధ్య ఓ ఫామ్ లో వున్న డైరక్టర్ తో ముచ్చటేసారు. త్వరలో ఆ డైరక్టర్ ఓ పెద్ద హీరోతో చేసిన సినిమా విడుదలకు రెడీ అయింది. సో తరువాతి సిన్మా ప్లానింగ్ లో వుంది. ఆ తరువాత సినిమా తనకే చేయాలి ఎలాగైనా అని వత్తిడి చేసారు సరదాగా. దానికి ఆ డైరక్టర్ అలాగే చేద్దాం..తరువాతి సినిమా ఫలానా హీరోతో చేద్దాం అనుకుంటున్నా అంటూ వెల్లడించారట.
మాంచి వారసత్వం వున్నా, సరైన సినిమాలు పడక, ఆ వారసత్వాన్ని మిగిలిన వారు వాడేసుకుంటుంటే కిందా మీదా అవుతూ, సరైన సినిమాల కోసం చూస్తున్నాడా హీరో. అలాంటి హీరోతో సినిమా చేద్దాం అనుకుంటున్నా అన్నాడు ఈ డైరక్టర్. ఈయన ఆ హీరో క్యాంప్ కు దగ్గరే కానీ, ఆ క్యాంప్ లో పెద్ద సినిమా ఒక్కటీ చేయలేదు. అందుకే అలా. అయితే సదరు నిర్మాత మాత్రం అదే హీరోతో గతంలో ఓ సినిమా చేసి వున్నారు.
అందువల్ల మరోసారి ఆ కాంబినేషన్ తను చేసినట్లు అవుతుంది అని ఆ డైరక్టర్ అనుకున్నారు. కానీ వెంటనే ఆ నిర్మాత, ఆ హీరోతోనా..అంత పెద్ద సినిమా ఇఫ్పుడు చేయలేనులే అని సైలెంట్ గా తప్పుకున్నారట. గతంలో ఆ హీరోతో సినిమా చేసినపుడు కలిగిన అనుభవాలే ఇందుకు కారణమని తెలుస్తోంది.