విజయవాడలో ప్రభుత్వాసుపత్రి నుంచి ఓ శిశువు అపహరణకు గురైన వ్యవహారం ఆంధ్రప్రదేశ్ అంతటా కలకలం సృష్టించింది. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రి నుంచి శిశువు అపహరణకు గురైన మాట వాస్తవం. తమ శిశువు మాయవడంతో శిశువు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ప్రజా సంఘాలు ఆసుపత్రియెదుట ఆందోళనలు చేపట్టాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
ఇది నిన్నటి కథ. జరిగిన ఘటనలో ప్రభుత్వాసుపత్రి వైఫల్యం నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించింది. శిశువు అపహరణ కేసుని ఛేదించేందుకు ప్రత్యేక పోలీసు బృందాల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడే పోలీసుల అత్యుత్సాహం బయటపడింది. విజయవాడ బస్ స్టేషన్‌లో ఓ మహిళ చేతిలో వున్న శిశువుని సీసీ టీవీ కెమెరాల ద్వారా కనుగొన్న పోలీసులు, ఆమె ఫొటోలతో కూడిన పోస్టర్లను విడుదల చేసేశారు.
ఇంకేముంది, పోస్టర్లలో వున్న మహిళ తన చేతిలోని శిశువు తమదేననీ గత ఫిబ్రవరిలో గుంటూరులో ఆ బిడ్డ జన్మించిందని, నిజాలు తెలుసుకోకుండా తమను కిడ్నాపర్లుగా చిత్రీకరించారంటూ పోలీసులను ఆశ్రయించారు. అంతే, పోలీసులు షాక్‌కి గురయ్యారు. పోస్టర్లలోని మహిళ పోలీసులపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించడంతో పరిస్థితి ముదిరి పాకాన పడింది.
ప్రభుత్వాసుపత్రుల నుంచి శిశువులు మాయమవడం ఇదే కొత్త కాదు. గోతికాడి నక్కల్లా ఆసుపత్రుల్లో శిశువుల్ని ఎత్తుకెళ్ళే ముఠాలు ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాల్సి వున్నా, ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. విజయవాడ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రభుత్వాసుపత్రి సిబ్బంది వైఫల్యం, అన్నిటికీ మించి పోలీసుల అత్యుత్సాహం.. వెరసి, ఆంధ్రప్రదేశ్ పరువు బజార్న పడిందిప్పుడు.
సాక్షాత్తూ ముఖ్యమంత్రి కొలువు దీరిన విజయవాడలో ఈ పరిస్థితి అత్యంత దారుణం. ఆ మధ్య గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో శిశువు ఎలుకలకు ఆహారంగా మారిపోవడం, ఇప్పుడిలా ప్రభుత్వాసుపత్రి నుంచి శిశువు కిడ్నాప్ అవడం.. అసలేం జరుగుతోందక్కడ?