సినీ మాయ: ‘ఫ్లాట్‌’గా దోచేశారు.!

ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. అందులో పక్కా మాస్‌ సినిమా 'డిక్టేటర్‌'. పక్కా క్లాస్‌ మూవీ 'నాన్నకు ప్రేమతో'. చిన్న సినిమా 'ఎక్స్‌ప్రెస్‌ రాజా'. మిగతా సినిమాలతో పోల్చితే లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా…

ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. అందులో పక్కా మాస్‌ సినిమా 'డిక్టేటర్‌'. పక్కా క్లాస్‌ మూవీ 'నాన్నకు ప్రేమతో'. చిన్న సినిమా 'ఎక్స్‌ప్రెస్‌ రాజా'. మిగతా సినిమాలతో పోల్చితే లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా హిట్‌ కొట్టేశాడు 'సోగ్గాడు'. మొత్తానికి నాలుగు సినిమాలూ ఈ సంక్రాంతికి పండగ చేసుకున్నాయి టాక్‌తో సంబంధం లేకుండా. 

అంతా హ్యాపీయేనా.? అంటే, ఇక్కడో మతలబు కూడా వుంది. అది ప్రేక్షకుడికి సంబంధించినది. గత కొన్నాళ్ళుగా 'ఫ్లాట్‌' టిక్కెట్‌ రేట్‌ అమలవుతోంది. ప్రధానంగా పండగల టైమ్‌లో ఏ సినిమా వచ్చినాసరే, ఈ ఫ్లాట్‌ రేట్‌ సినీ ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెడ్తోంది. పాత రోజుల్లో బ్లాక్‌ మార్కెటింగ్‌ కోసం కొందరు ప్రత్యేకంగా వుండేవారు. ఇప్పుడలాంటోళ్ళు ఎక్కడా కన్పించడంలేదు. థియేటర్ల యాజమాన్యాలే తమ సిబ్బందితో టిక్కెట్లను బ్లాక్‌లో అమ్మేలా చేస్తున్నాయి. ఇక్కడే పుట్టింది ఫ్లాట్‌ రేట్‌. 

'నాన్నకు ప్రేమతో' సినిమాకి తొలి రోజు ఫ్లాట్‌ రేట్‌ మూడొందల దాకా పలికింది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు జిల్లాల్లో చాలా చోట్ల ఈ ఫ్లాట్‌ రేట్‌ సినీ ప్రేక్షకులకు షాకిచ్చింది. 'డిక్టేటర్‌' కూడా ఆ స్థాయిలోనే ఫ్లాట్‌ రేట్‌ పలికినట్లు తెలుస్తోంది. 'డిక్టేటర్‌' వచ్చాక 'నాన్నకు ప్రేమతో' ఫ్లాట్‌ రేట్‌ని 200కి తగ్గించారట. చిన్న సినిమా అయినా 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' కూడా ఫ్లాట్‌ రేట్‌ 150తో కొన్ని చోట్ల హడలెత్తించింది. అయితే 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' ఫ్లాట్‌ రేట్‌ చాలా తక్కువ చోట్ల మాత్రమే కన్పించింది. మేజర్‌ టౌన్స్‌లో మాత్రమే 'ఎక్స్ ప్రెస్ రాజా’ కి ఫ్లాట్‌ రేట్‌ పలకగా, 'సోగ్గాడే చిన్ని నాయనా' అన్ని చోట్లా 200కి పైనే ఫ్లాట్‌ రేట్‌ నడిచింది. 

సంక్రాంతికి హైద్రాబాద్‌ చాలావరకు ఖాళీ అయినా, హైద్రాబాద్‌లోని థియేటర్లన్నీ ఐదు రోజులపాటు ఫ్లాట్‌ రేట్లను అమల్లో పెట్టాయి. మల్టీప్లెక్స్‌ టిక్కెట్లను మించి ఫ్లాట్‌ రేట్లు సినీ ప్రేక్షకుల్ని దోచేస్తున్నా, ఎక్కడా వీటి నియంత్రణకు చర్యలు తీసుకున్న దాఖాల్లేకపోవడం గమనార్హం. పైరసీ గురించి గట్టిగా మాట్లాడే టాలీవుడ్‌, ప్రేక్షకుల్ని దోచేస్తోన్న 'ఫ్లాట్‌ రేట్‌' మాఫియా మీద మాత్రం పెదవి విప్పదుగాక విప్పదు. 

అన్నట్టు, కొన్ని హిట్‌ సినిమాల విషయంలో ఈ ఫ్లాట్‌ రేట్‌ వారం పది రోజులపాటు.. ఒక్కోసారి పదిహేను రోజులకు పైనే పలికిన సందర్భాలనేకం. అనుమతి తీసుకుని రేట్లు పెంచడం కాదిది.. అనధికారిక దోపిడీ ఇది. థియేటర్ యాజమాన్యాలనే ఈ దోపిడీకి పాల్పడుతున్నాయా? తెరవెనుక సినీ సహాకారం ఏమన్నా ఉందా? ఏమో మరి, టాలీవుడ్ ప్రముఖులు ఈ వ్యవహారంపై పెదవి విప్పాల్సి వుంది.