సూత్రధారులు బాంబులు పెట్టడానికి ఎంచుకున్న వాళ్లందరూ చదువురాని, బీద ముస్లిములే. పదివేల రూపాయలకు ఆశపడి వాళ్లు యీ ఘాతుకానికి ఒప్పుకున్నారు. యాకూబ్ తన పక్షాన వాదించడానికి లాయర్లను పెట్టుకోగలిగాడు కానీ వీళ్లకా స్తోమత లేదు. (యాకూబ్‌కు రాజకీయ పలుకుబడి లేదని వాపోతున్న ఒవైసీ యీ విషయాన్ని గుర్తించాలి) వీళ్ల తరఫున వాదించడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏ సామాజిక సేవా సంస్థ సహకరించలేదు. సుప్రీం కోర్టు యీ విషయాన్ని గుర్తించింది. వీళ్లు వట్టి బాణాలు మాత్రమే, అసలైన ధనుర్దారులు వేరే వున్నారు అనుకుని, టాడా కోర్టు వీళ్లకు ఉరిశిక్ష వేసినా, దాన్ని యావజ్జీవంగా మార్చింది. ఈ కేసులో మతపరమైన కోణాన్ని ప్రస్తావించేవాళ్లు యింకో విషయాన్ని కూడా గమనించాలి. శిక్ష పడినవారిలో హిందూ అధికారులు కూడా వున్నారు. సోమనాథ్ థాపా అనే కస్టమ్స్ అధికారికి, విజయ్ పాటిల్ అనే పోలీసు అధికారికి యావజ్జీవ శిక్ష పడింది. ఆయుధాలు, మందుగుండు సామగ్రి చేరవేతలో సహకరించిన అధికారులు ఆర్ కె సింగ్, జయవంత్ గౌరవ్, ఎస్ఎస్ తల్వాడేకర్లకు 6-8 ఏళ్ల జైలుశిక్ష పడింది.
నేనైతే విచారణ పూర్తిగా ఫాలో కాలేదు. కేసును క్షుణ్ణంగా అధ్యయనమూ చేయలేదు. పైకి కనబడినది తీసుకున్నా యాకూబ్ ఆ ధనుర్ధారుల్లో ఒకడనీ శిక్షార్హుడేననీ అనిపిస్తుంది నాకు. ఇంట్లో అంతంత కుట్ర జరుగుతూ వుంటే, ఇంటి సభ్యులందరూ కుట్రలో పాల్గొంటూ వుంటే నాకేమీ తెలియదు అంటే ఎలా నమ్మగలం? ఇతనేమీ శుంఠ కాదు. చార్టెర్డ్ ఎకౌంటెంట్. లాయర్లు, ఆడిటర్లు తాతకే దగ్గులు నేర్పగలిగిన ఘనులు. 'పేలుళ్లు కొన్ని గంటల్లో జరుగుతాయనగా మా అన్నయ్య పాకిస్తాన్ వచ్చేయమన్నాడు, దాంతో నేనూ, మా కుటుంబసభ్యులు వెళ్లిపోయాం' అన్నాడు. 'ఎందుకు దేశం విడిచి వెళ్లాలి? ఏం జరగబోతోంది? వెళ్లినా పాకిస్తాన్‌కు ఎందుకు? అమెరికాయో, ఆస్ట్రేలియానో వెళ్లవచ్చుగా' అని అన్నగార్ని అడగాలిగా. అతను సరైన సమాధానాలు చెప్పకపోతే అనుమానం తగిలి బాధ్యతాయుతమైన పౌరుడిగా వెంటనే పోలీసులకు చెప్పి వుండాలిగా! ఈ దేశం నీకెంతో యిచ్చిందే! ఇక్కడే పుట్టి, యిక్కడే పెరిగి చాలా పెద్దవాడి వయ్యావు కదా. ప్రాణం మీద తీపితో వూరుకున్నాడు అంటే ఏం చచ్చిపోయినవాళ్లకు మాత్రం ప్రాణాల మీద తీపి వుండదా? నీదొక్కడిదే ప్రాణమా?
'టైగర్ చేష్టలతో నాకు సంబంధం లేదు, అతను నాకేమీ చెప్పలేదు' అని యాకూబ్ బుకాయిస్తున్నాడు. కుటుంబగాథ గమనించండి – వీళ్ల తండ్రి సింగిల్ రూమ్ ఎపార్ట్మెంటులో వుండేవాడు. డబ్బు లేదు. అయినా పిల్లల్ని ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో చదివించాడు. ఆరుగురు అన్నదమ్ముల్లో మూడోవాడైన యాకూబ్ అందరి కంటె తెలివైనవాడు. గబగబా చదువుకుని చకచకా ఎదిగిపోయి చార్టెర్డ్ ఎకౌంటెంట్ అయిపోయి బోల్డు గడించేసి స్వార్థంతో విడిగా వెళ్లిపోకుండా జాయింటు ఫ్యామిలీలో వుంటూ కుటుంబసభ్యులందరికీ సర్వసౌఖ్యాలు సమకూర్చాడు. పెద్ద బిల్డింగులో ఓ మంచి ఎపార్ట్మెంటుకు మారడమే కాదు, దాన్ని కొనేసి, దానితో బాటు ఆ బిల్డింగులో యింకా కొన్ని ఫ్లాట్లు కూడా కొనేశాడు. ట్రావెల్ ఏజన్సీ వంటి వేరే వ్యాపారాలు కూడా మొదలుపెట్టించాడు. ఇతనిలా సంపాదిస్తూ వుంటే వాళ్ల అన్న దావూద్ ఇబ్రహీం అనుచరుడై అండర్‌వరల్డ్ డాన్ అయిపోయి స్మగ్లింగులో చెలరేగిపోతున్నాడు. యాకూబ్ ధనబలం, బుద్ధిబలానికి టైగర్ భుజబలం, నేరగుణం తోడై వాళ్లు అతి త్వరగా కుటుంబమంతా మోతుబరులై పోయారు. ఇలాటి పరిస్థితుల్లో యాకూబ్‌కు చెప్పకుండా టైగర్ యింత పెద్ద ఆపరేషన్స్ తలపెడతాడా? నాన్సెన్స్! 'అబ్బే నాకేం తెలియదు' అని అంటున్న యాకూబ్ బ్యాంకు ఖాతాల్లో యీ పేలుళ్లకు ముందు అనేక నిధులు వచ్చిపడ్డాయి. ఆ ట్రాన్సాక్షన్సన్నీ డూబియస్ అని విచారణలో తేలింది. వాటికి యాకూబ్ వద్ద సమాధానం లేదు. అందుకే యీ ఆపరేషన్స్ నిధుల వ్యవహారం యాకూబ్ చూశాడని కోర్టు నమ్మింది.
తాడిచెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడగడ్డి కోసం అన్నాట్ట వెనకటి కెవడో. నీకు పేలుళ్లతో సంబంధం లేకపోతే పాకిస్తాన్‌కు ఎందుకు వెళ్లావ్ అని అడిగితే ఐయస్ఐ గుట్టుమట్లు తెలుసుకోవడానికి అక్కడకి వెళ్లానని చెప్తున్నాడు. తెలుసుకుని ఏం చేశాడు? వెంటనే భారతీయ అధికారులకో, మీడియాకో ఉప్పందించాడా? లేదే! ఆ తర్వాత దావూద్ ఇబ్రహీం, ఐయస్ఐలు కొత్త పెళ్లికొడుకులా చూస్తూంటే అప్పుడైనా గిల్ట్ ఫీలింగ్ కలిగిందా? తన కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు – పోనీ వారిలో ముస్లిం కుటుంబాలకు – నష్టపరిహారం ఏర్పాటు చేశాడా? లేదే! అసలీ మేధావి, బాంబులు, మనుష్యులు, పేల్చాల్సిన చోట్లు అన్నీ ఏర్పాట్లు చేసేసి పేలుళ్ల ముహూర్తానికి కొన్ని గంటల ముందే కుటుంబంతో సహా పాకిస్తాన్ చెక్కేశాడు. తమకు నేరచరిత్ర ఏమీ లేదు కాబట్టి, పేలుళ్లలో తమ పాత్రను ఎవరూ వూహించలేరని లెక్కవేస్తూనే ఎందుకైనా మంచిదని వూళ్లో లేకుండా జాగ్రత్తపడ్డాడు. అయితే ఇక్కడ విధి చిన్న నాటకం ఆడింది.
లెక్క ప్రకారం వీళ్లు 1993 మార్చి నెల చివర్లో యీ కార్యక్రమం పెట్టుకున్నారు. అయితే యీ ఆపరేషన్స్‌లో రిక్రూట్ చేసుకున్న గుల్ మొహమ్మద్ అనే చిన్న స్థాయి నేరస్తుడు (స్మాల్టైమ్ క్రూక్ అంటారు) ఏదో చిన్న కేసులో పట్టుబడ్డాడు. పోలీసులు గట్టిగా తంతే వాడెక్కడ దీని గురించి చెప్పేస్తాడేమోనని టైగర్ భయపడి పేలుళ్ల ముహూర్తాన్ని మార్చి 12కి జరిపేశాడు. మధ్యాహ్నం 1.30కు మొదలుపెట్టి వరుసగా రెండు గంటల పది నిమిషాల్లో 10 చోట్ల పేల్చారు. పది చోట్లే, 140 నిమిషాలే అని యిప్పుడనుకుంటున్నాం కానీ పేలుతున్న సమయంలో తెలియదు కదా, జనం భీతావహులై పరుగులు పెట్టారు. పైగా దేశంలో తొలిసారి ఆర్డిఎక్స్ వంటి శక్తిమంతమైనదాన్ని ప్రయోగించారు. ఒక చోట పేలగానే, మరో పది చోట్ల పేలాయట అనే పుకార్లు వ్యాపిస్తాయి సహజంగా. నగరమంతా గందరగోళం. భయం. ఆఖరి పేలుడు తర్వాత కూడా మనసు కుదుటపడదు కదా, ఇంకా ఎక్కడ పేలుతుందో అని బిక్కుబిక్కుమంటూనే వున్నారు. పైగా ఆ స్థలాల్లో కూడా ఒక పద్ధతి లేదు. సినిమా హాళ్లలో బాంబులు పెడుతున్నారట అంటే హాళ్లకు వెళ్లడం మానేస్తారు, అవేళ రకరకాలైన స్థలాల్లో పేల్చారు. 10 చోట్లే పేలాయి కానీ వాళ్లు ప్లాన్ చేసినవి యింకా అంతకంటె ఎక్కువ వున్నాయి. దాదర్‌లో బాంబులు కుక్కిన స్కూటర్ ఒకటి పేలలేదు. అది మర్నాటికి బయటపడింది. పేలుళ్ల తర్వాత కుట్రదారులు ఎందుకు, ఎలా కంగారుపడ్డారో తెలియదు కానీ వాళ్లు పారిపోవడానికి ఉపయోగించవలసిన వ్యాన్‌ను వోర్లి వద్ద విడిచి పెట్టేశారు. రాజీవ్ హత్యలో నాశనం కాకుండా మిగిలిపోయిన కెమెరా హంతకులను పట్టించినట్లే యీ వాహనాలు రెండూ హంతకుల వైపు వేలెత్తి చూపించాయి.
బొంబాయి కమీషనర్‌గా వున్న రాకేశ్ మారియా ఆ వ్యాన్ గురించి విచారించారు. దాని సొంతదారులో, ప్రయాణికులో అక్కడ పార్కు చేసి వెళ్లి పేలుళ్లలో చనిపోయారేమో, గాయపడ్డారేమో తెలియదు కదా. ముందు ఓనర్లు ఎవరో నుక్కున్నారు. సులేమాన్ మేమన్ భార్య రూబినా పేర వుంది. వాళ్ల యింటికి వెళ్లారు. చూస్తే మేమన్లు సకుటుంబసపరివార సమేతంగా ఎక్కడికో వెళ్లిపోయారని తెలిసింది. ఇంట్లో వుండేవాళ్లలో టైగర్ మేమన్ ఒకడని తెలియగానే, రాకేశ్‌కు దావూద్ కనక్షన్ గుర్తుకు వచ్చింది. వెంటనే యింటిపై దాడి చేసి సోదా చేయించాడు. అక్కడ స్కూటర్ల తాళంచెవుల గుత్తి ఒకటి కనబడింది. దాదర్‌లో దొరికిన స్కూటర్‌కు యీ తాళం చెవుల్లో ఏదైనా పడుతుందేమో చూడండి అంటే పట్టింది. మేమన్ల పాత్ర నిర్ధారణ అయిపోయింది. ఇక వాళ్ల అనుచరుల కోసం వేట సాగింది. ఇద్దరు కీలకమైన వ్యక్తులు దొరికారు. వాళ్లు కుట్ర మొత్తం చెప్పేశారు. వాళ్లెవరో, పేర్లు ఏమిటో ఎప్పటికీ వెల్లడించమని పోలీసులు మాట యిచ్చి నిలబెట్టుకున్నారు.
యాకూబ్ తిరిగి రావడానికి కారణం – భారత చట్టాలపై అతని అచంచల విశ్వాసం అని కొందరు ఉద్ఘాటిస్తున్నారు. చట్టం మీద గౌరవం, చట్టుబండలు ఏదీ కాదు. ఈ రకంగా ఆలోచించి చూడండి – బొంబాయి పేలుళ్ల తర్వాత దేశంలో తిరుగుబాటు వచ్చేసి, అల్లకల్లోలమై పోయి, దేశం విచ్ఛిన్నమవుతుందని, తమకు అనుకూల ప్రభుత్వం ఏర్పడుతుందని ఐయస్ఐ, దావూద్ ప్లాన్లు వేసి వుంటారు. కానీ యీ దేశంలో అలాటి పరిస్థితి ఏర్పడలేదు. అంతా మామూలుగా సాగిపోతోంది. బొంబాయి పేలుళ్లు తిరుగుబాటును తెచ్చిపెట్టలేదన్న నిరాశ ఐయస్ఐను కూడా ఆవహించి వుంటుంది. అనుకున్నది జరగలేదు కానీ, యీ మేమన్లను ఎంతకాలం మేపాలన్న చికాకు వాళ్లలో కనబడసాగింది. తమ ప్లాను విఫలమైందని గ్రహించాక చూసిచూసి ఇండియాకు వచ్చేసి, నేరం మొత్తం దావూద్, టైగర్లపై తోసేసి తక్కినవారిపై కేసు పడకుండా తప్పించుకుని మామూలు జీవితం గడిపితే ఎలా వుంటుందాన్న ఆలోచన వచ్చింది యాకూబ్‌కు. ఎందుకంటే పాకిస్తాన్లో అతని ప్రతిభకు తగ్గ గుర్తింపు దొరకటం లేదు. పైగా తమ ఆస్తిపాస్తులన్నీ యిండియాలోనే వున్నాయి. తమ అజమాయిషీ లేకపోతే అన్యాక్రాంతం కావచ్చు. టైగర్ తప్ప తామెవ్వరికీ సంబంధం లేదని చెపితే ఇండియాలో నమ్ముతారా లేదా అని కనుక్కోవడానికి నేపాల్‌కు పాకిస్తానీ పాస్పోర్టుతో, మారుపేరుతో వెళ్లాడు. తన కజిన్‌ను అక్కడకి రప్పించి అక్కడ మంతనాలు సాగించాడు. 'మీకు సంబంధం లేదని దేశంలో ఎవరూ అనుకోవటం లేదు, కుటుంబసభ్యులందరూ కుట్రదారులే' అనుకుంటున్నారని కజిన్ చెప్పాడు.
దాంతో దుబాయి మీదుగా కరాచీకి తిరిగి వెళ్లిపోదామనుకుని ఎయిర్‌పోర్టుకి వెళ్లాడు. మళ్లీ విధి తమాషా చేసింది. అతని బ్రీఫ్ కేసులో తాళాల గుత్తి అటూయిటూ చెదిరి, స్కానింగులో తుపాకీ ఆకారంలో కనబడింది. ఎయిర్‌పోర్టు అధికారులు పెట్టె తెరిపించారు. ఇండియన్ పాస్‌పోర్టు, తక్కిన మేమన్ల కాగితాలు బయటపడ్డాయి. మారుపేరుతో పాకిస్తానీ పాస్పోర్టుతో వచ్చినవాడి అసలు పేరు తెలియగానే పోలీసులకు అప్పగించారు. వాళ్లు సిబిఐకి అప్పగించారు. ఈ విషయం నేపాల్ పోలీసు అధికారి (యిప్పుడు రిటైరై పోయారు) కూడా యిటీవల కన్ఫమ్ చేశారు. యాకూబ్ తనంతట తాను లొంగి పోలేదని చెప్పారు. ఏదైనా ప్రొటోకాల్ యిబ్బందులున్నాయేమో, ఇండియన్ పోలీసులు ఢిల్లీలో పట్టుబడినట్టు రికార్డు తయారుచేసుకున్నారు. అది చిన్న సాంకేతిక విషయం మాత్రమే. అయితే యాకూబ్ సమర్థకులు 'అతను లొంగిపోదామని వస్తే భారతపోలీసులు పట్టేసుకున్నారు. కేసు విచారణలో సహకరిస్తే వదిలేస్తామని ఆశ చూపించి, మోసగించారు.' అంటున్నారు. అలా అనడానికి ఆధారం ఏమిటో వాళ్లు చెప్పటం లేదు. యాకూబ్ ఢిల్లీకి టిక్కెట్టు కొనుక్కోలేదు. మారుపేరు, పాకిస్తాన్ పాస్‌పోర్టు వినియోగిస్తున్నాడు. నేపాల్ పోలీసులకు తనంతట తను లొంగిపోలేదు. పట్టుబడ్డాడు. ఉరేస్తే టైగర్‌ను వేయాలి కానీ యాకూబ్‌కు ఉరేమిటి అనే విసుర్లు ఒకటి. ఇతన్ని ఉరితీసి టైగర్‌ను వదిలేస్తామని ఎవరైనా చెప్పారా? ఇతన్నిలా ఉరి తీస్తే అతను ఎప్పటికీ లొంగిపోడు అని శాపనార్థాలు ఒకటి. తీయకపోయినా అతనూ, దావూద్ లొంగరు. దశాబ్దాలుగా లొంగనివాళ్లు యితనికి క్షమాభిక్ష పెట్టగానే వచ్చి లొంగిపోతారా? వాళ్లు కలలు కంటున్న అరాచకం, కల్లోలరాజ్యం భారతదేశంలో నెలకొనేవరకూ వాళ్లు అక్కడే వుంటారు. దానికి యితని ఉరితో సంబంధం లేదు.
యాకూబ్ బండబారిన అండర్‌వరల్డ్ గూండా కాదు. టార్చర్‌లో తర్ఫీదు పొందలేదు. పోలీసు దెబ్బలకి తాళలేడు. వాళ్లు చెయ్యెత్తగానే నోరిప్పేశాడు. అదీ గొప్పేనా? గొప్పే అనుకున్న ఒక పోలీసు అధికారి 'అతను విచారణలో సహకరించాడు కాబట్టి, ఉరి శిక్ష వేయనక్కరలేదు' అన్నారట. వాళ్ల పని తేలిక చేశాడు కదాని పోలీసులకు జాలి వుండవచ్చు కానీ యిలాటి సందర్భాల్లో న్యాయస్థానం అనుసరించవలసిన నియమనిబంధావళి అంటూ ఒకటి వుంటుంది కదా. దాన్ని విస్మరించమంటూ మధ్యలో వీళ్ల సిఫార్సులు ఎందుకు? పోలీసులు తమ పని తాము సవ్యంగా చేస్తే చాలు, కోర్టు తీర్పులు ఎలా వుండాలో జడ్జిలకు సలహాలు యివ్వకుండా వుంటే మేలు. అసలే మహారాష్ట్ర పోలీసులు మతపరమైన వివక్షత చూపిస్తున్నారని ప్రతీతి. ఈ పేలుళ్లను ప్రేరేపించిన 1992 డిసెంబరు-1993 జనవరి మతకలహాల్లో పోలీసుల పాత్ర ఘోరంగా వుందని జస్టిస్ శ్రీకృష్ణ స్పష్టంగా చెప్పారు. ఆ నివేదికను ప్రభుత్వం పక్కన పడేసింది, లేకపోతే శివసేన నాయకులందరూ జైళ్లల్లో వుండవలసినవారు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2015)