రివ్యూ: ఐ
రేటింగ్: 2.5/5
బ్యానర్: మెగా సూపర్‌గుడ్ ఫిలింస్, ఆస్కార్ ఫిలిం ప్రై.లి.
తారాగణం: విక్రమ్, ఎమీ జాక్సన్, సురేష్‌గోపి, ఉపేన్ పటేల్, సంతానం, ఓజస్ ఎం. రజని తదితరులు
మాటలు: శ్రీరామకృష్ణ
సంగీతం: ఏ.ఆర్. రెహమాన్
కూర్పు: ఆంటోని
ఛాయాగ్రహణం: పి.సి. శ్రీరామ్
నిర్మాత: ఆస్కార్ రవిచంద్రన్
రచన, దర్శకత్వం: శంకర్
విడుదల తేదీ: జనవరి 14, 2015
శంకర్ సినిమా వస్తుందంటే సినీ ప్రియులంతా ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తూ అంచనాలు పెంచేసుకుంటారు. ఇంతవరకు బ్యాడ్ మూవీ తీసి ఎరుగని శంకర్ నుంచి ఆమాత్రం ఎక్స్‌పెక్ట్ చేయడంలో తప్పు లేదు. విక్రమ్‌తో ‘అపరిచితుడు’లాంటి ఒక మెమరబుల్ మూవీ తీసిన శంకర్ ‘ఐ’ కోసం మూడేళ్లు కష్టపడడం, ఈ చిత్రంలోని పాత్రని రక్తి కట్టించడానికి విక్రమ్ తన శరీరాన్ని వివిధ రకాలుగా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోవడం చూసి… అపరిచితుడుని మించిన అద్భుతమేదో వస్తుందని అనుకున్నారు. మరి ఐ ‘అంతకు మించి’ ఉందా లేక.. అనూహ్యంగా అంచనాల్ని తల్లకిందులు చేసిందా?
కథేంటి?
లింగేశ (విక్రమ్) అనే బాడీ బిల్డర్ మిస్టర్ ఆంధ్రాగా టైటిల్ గెలుస్తాడు. మోడల్ దియా (ఎమీ) అంటే లింగేశకి తగని పిచ్చి. ఆమె ప్రోద్బలంపై అతను మోడల్ కూడా అవుతాడు. లింగేశ కాస్తా ‘లీ’గా మారి చాలా సక్సెస్ అవుతాడు. కానీ లీ కెరీర్ ఎండ్ చేయాలని అతని శరీరంలోకి ‘ఐ’ అనే వైరస్ పంపిస్తారు. లీ శరీరంలో, ముఖంలో కొద్దికొద్దిగా మార్పులు వచ్చి… వికృత రూపం వచ్చేస్తుంది. తనకి ఏదో వ్యాధి సోకిందని అనుకున్న లీకి అదంతా కుట్ర అని తెలిసాక.. తనని అలా చేసిన వారిపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. తనని అలా చేసిన వారికి చావుని మించిన శిక్ష వేయాలని భావిస్తాడు.
కళాకారుల పనితీరు!
విక్రమ్ ఈ పాత్ర కోసం కష్టపడ్డ వైనాన్ని ఎలా వర్ణించినా తక్కువే. పాత్రకి అనుగుణంగా తన శరీరంలో అతను చూపించిన మార్పులు చూస్తే ఎవరైనా అతడి అంకితభావానికి సలామ్ చేయాల్సిందే. ఒక మొరటు బాడీ బిల్డర్ నుంచి ఒక స్టయిలిష్ మోడల్‌గా అతను చూపించిన వేరియేషన్ సూపర్బ్. ఇక కురూపి అవతారం కోసమైతే విక్రమ్ ప్రాణం పెట్టేసాడు. తన శరీరంలో మార్పులు వస్తున్నాయని తెలిసినపుడు ఆ బాధని అతను వ్యక్తం చేసిన తీరు అద్భుతం. మామూలుగా శంకర్ సినిమాల్లో దర్శకుడే డామినేట్ చేస్తుంటాడు. కానీ ఈసారి శంకర్ బలహీనతల్ని కూడా కొంతవరకు విక్రమ్ తన అభినయంతో, అంకిత భావంతో కవర్ చేసాడు.
హాట్ మోడల్ పాత్రకి ఎమీ జాక్సన్ పర్‌ఫెక్ట్‌గా సూట్ అయింది. ఆమె మునుపటి చిత్రాలతో పోలిస్తే ఇందులో కాస్త నటించగలిగింది. బాలీవుడ్ నటుడు ఉపేన్ పటేల్ నటన అంతంత మాత్రంగానే ఉంది. సురేష్ గోపి క్యారెక్టర్‌లో ఏదో పెద్ద ట్విస్ట్ ఉన్నట్టు ఫీలయ్యారు కానీ ఆ పాత్ర పరిచయం అయినపుడే దాని ఆంతర్యం ఏంటనేది అర్థమైపోతుంది. కథానాయకుడితో సమానమైన బలమున్న విలన్ పాత్రల్ని తీర్చిదిద్దడం శంకర్ స్పెషాలిటీ. ఇందులో నలుగురైదుగురు విలన్స్ ఉన్నా కానీ ఒక్క బలమైన పాత్ర కూడా లేకపోవడంతో కథనం మరీ నాసిరకంగా తయారైంది. సంతానం ఉన్నప్పటికీ చెప్పుకోతగ్గ కామెడీ ఏమీ లేదు… వికృత రూపాలపై వెకిలి సెటైర్లు మినహా!
సాంకేతిక వర్గం పనితీరు:
పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మూడు షేడ్స్ ఉన్న కథానాయక పాత్రకి తగ్గట్టుగా డిఫరెంట్ టోన్స్‌తో సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. చైనా ఎపిసోడ్‌లోని విజువల్స్, పూలనే పాటలో ఛాయాగ్రహణం చాలా బాగున్నాయి. ఏ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన పాటల మాధుర్యాన్ని అనువాద సాహిత్యం దెబ్బ తీసింది కానీ లేదంటే పాటలు కూడా ఈ చిత్రానికి పాజిటివ్‌గానే నిలుస్తాయి. నేపథ్య సంగీతం కూడా రెహమాన్ స్థాయికి తగ్గట్టు ఉంది. శంకర్ తను తీసిన ప్రతి సీన్‌ని పూర్తిగా ఉంచేయాలని అనుకున్నప్పుడు ఎడిటర్ ఆంటోనీ కూడా చేయడానికి ఏమీ ఉండదు. ఎడిటర్‌కి పూర్తి స్వేఛ్ఛనిస్తే గంటకి పైగా కత్తిరించాల్సిన స్టఫ్ ఉందిందులో. ఈ చిత్రంపై నిర్మాతలు విపరీతంగా ఖర్చు పెట్టారు. విజువల్స్‌లో ఆ గ్రాండియర్ కొట్టొచ్చినట్టే కనిపించింది.
శంకర్ సినిమాలో సాంకేతిక విలువలు గొప్పగా ఉండడంలో విశేషం ఏమీ లేదు. అన్నేళ్ల పాటు చిత్రీకరించి, అన్ని కోట్లు ధారపోసినపుడు టెక్నికల్‌గా క్వాలిటీ అవుట్‌పుట్ ఖచ్చితంగా వస్తుంది. అయితే టెక్నికల్‌గా ఎంత ఉన్నతంగా ఉన్నా కానీ శంకర్ సినిమాలకి కథ, కథనాలే అతి పెద్ద బలంగా నిలిచాయి. ఈసారి శంకర్ తన స్ట్రెంగ్త్ చూపించలేక.. విజువల్ గ్రాండియర్, లీడ్ యాక్టర్ డెడికేషన్‌పై డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. సినిమాలో ఎక్కడా ‘ఇది శంకర్ సినిమా’ అనే ముద్ర కనిపించదు. ఎలాంటి కథ తీసుకున్నా, హీరో ఎవరైనా కానీ తన ముద్రని బలంగా వేసే శంకర్ నుంచి ఇలాంటి అవుట్‌పుట్ షాకిస్తుంది. దర్శకుడిగా, రచయితగా శంకర్ పూర్తి స్థాయిలో ఫెయిలైన ఫస్ట్ మూవీ ఇది.
హైలైట్స్:
- విక్రమ్ పర్‌ఫార్మెన్స్
- సాంగ్స్ పిక్చరైజేషన్
- విజువల్స్
డ్రాబ్యాక్స్:
- బలహీనమైన కథనం
- జుగుప్స కలిగించే సన్నివేశాలు
- మేటర్ లేకుండా మూడు గంటల సొద
విశ్లేషణ:
లీక్ అయిన ఐ స్టోరీ తెలియకపోయినా కానీ సినిమా మొదలైన కాసేపటికి విషయం ఏమిటనేది బోధ పడిపోతుంది. విలన్ల వల్ల విక్రమ్ రూపం అలా మారిపోయిందనేది అర్థమయ్యాక విషయం లేని ఫ్లాష్‌బ్యాక్‌ని గంటల కొద్దీ సాగదీయడం విసిగిస్తుంది. ‘అపరిచితుడు’ మాదిరిగా వింత వింత పద్ధతుల్లో విలన్లని హీరో శిక్షిస్తుంటాడు… అయితే ఆ సీన్లలో ఒక్కటి కూడా ‘ఔరా’ అనిపించదు సరి కదా.. ‘శంకర్ సర్‌కి ఏమైంది?’ అనుకునేలా చేస్తాయి. ఎక్కడో ఓ చోట అయినా శంకర్ మార్కు మ్యాజిక్ ఉంటుందని ఆశిస్తూ కూర్చుంటే… ఎండ్ టైటిల్స్ అన్నీ రోల్ అయిపోయి, ఎదురు చూపులే మిగిలిపోతాయి.
సురేష్ గోపి క్యారెక్టర్ పరిచయం అయినప్పుడే… దాని గురించి మొత్తం బోధ పడిపోతుంది. ఇలాంటి వీక్ స్క్రీన్‌ప్లేతో, బలహీనమైన సీన్స్‌తో శంకర్ సినిమా తెరకెక్కగలదని ‘ఐ’ రాక ముందు ఎవరైనా చెప్పి ఉంటే, వారి పిచ్చితనానికి నవ్వుకునేవాళ్లం. కానీ తననుంచి కూడా ఇలాంటి నాసి రకం సినిమా వస్తుందని, కోట్లు ఖర్చు పెట్టించి ఒక మేటర్‌లెస్ సినిమాని రీళ్లకి రీళ్లు చుట్టేయగలనని శంకర్ ఐతో క్లారిఫై చేసాడు. కట్టె, కొట్టె, తెచ్చె… అన్నట్టు తేల్చేయదగ్గ ఫ్లాష్‌బ్యాక్‌ని అన్ని గంటల పాటు సాగదీయడం వల్ల ఏం ఒరిగిందో ఆయనకి అయినా తెలుసో, లేదో?
ప్రథమార్థంలో అయితే కనీసం ఒక్క సీన్ అయినా హైప్‌ని జస్టిఫై చెయ్యలేదు. చైనా ఎపిసోడ్ అయితే దీనినుంచి ఇక ఏం ఆశించవద్దనే మెసేజ్‌ని బలంగా పాస్ చేస్తుంది. ద్వితీయార్థంలో విక్రమ్ తన అభినయంతో కొన్ని మెమరబుల్ మూమెంట్స్ ఇచ్చాడు కానీ శంకర్ మాత్రం స్టార్ట్ టు ఎండ్ డిజప్పాయింట్ చేసాడు. విక్రమ్ కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరైపోయింది. శంకర్ చేసిన కాస్ట్‌లీ మిస్టేక్‌గా ‘ఐ’ చరిత్రలో నిలిచిపోతుంది. ఇలాంటి రివ్యూలు చదివి, టాక్ విని ఎంత తక్కువ ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్లినా కానీ ‘ఐ’ తీవ్రంగా నిరాశ పరుస్తుంది.
బోటమ్ లైన్: ‘ఐ’య్యో పాపం విక్రమ్!
-గణేష్ రావూరి