క్లాసిక్స్ లా నిలిచిపోయిన సినిమాల పేర్లు వాడుకుని, సినిమాలు తేయడం తప్పులేదు. కానీ దానికి కథలో తగినంత రీజనింగ్ వుండాలి. మిస్సమ్మ, మల్లీశ్వరి సినిమాలు కథానాయిక పేరు కారణంగా మళ్లీ మరోసారి జనం ముందుకు వేరే కథలతో వచ్చాయి.
అయితే అవి కూడా మంచి విజయాన్ని సాధించాయి..పాత పేరును ఏ మాత్రం చెడగొట్టలేదు. గీతాంజలి సినిమాను కోనవెంకట్ కామెడీ హర్రర్ గా తీస్తున్నపుడు కూడా జనం ఏమీ అనుకోలేదు..కారణం అందులో అంజలి హీరోయిన్ కావడంతో..అలా పెట్టి వుంటారు అనుకున్నారు.
కానీ శంకరాభరణం పేరు ప్రకటించినపుడు మాత్రం కాస్త డిస్కషన్ తప్పలేదు. ఎందుకంటే శంకరాభరణం టైటిల్ కు సూటయ్యే కథను అల్లడం అంత సులవు కాదు. కేవలం ఏదో టైటిల్ పెట్టేశాం అంటే కాదు. దానికి జస్టిఫికేషన్ వుండాలి.
పక్క రాష్ట్రంలో మన శంకరాభరణం సినిమాను ఇప్పటికీ నెత్తిన పెట్టకుని పూజిస్తున్నారు. అలాంటపుడు మనం తుపాకులు, గడ్డం బూచాళ్లు, చూపిస్తూ, శంకరాభరణం అని పేరు పెడితే ప్రేక్షకుల సెంటిమెంట్ కాస్త దెబ్బతింటుంది. ఓ ప్యాలెస్ కు శంకరాభరణం అని పేరు పెట్టి, అందుకే టైటిల్ అంటే జనం జీర్ణించుకోవడం కష్టం. సినిమాను చాలా టేకిట్ ఈజీగా తీసుకుని, ఈ పేరు డిసైడ్ చేసినట్లు ఇప్పుడు సినిమా చూసాక అర్థం అవుతోంది.
ఇక తరువాయి ప్రాజెక్టుకు పాతాళ భైరవి పేరు డిసైడ్ చేసినట్లు గతంలో కోన వెంకట్ ఒకటి రెండు సార్లు అన్నారు. మరి ఇప్పుడు మరో క్లాసిక్ టైటిల్ వాడుకునేందుకు తగిన కథ లేకుండా అదే పని చేస్తారో, ఈసారైనా టైటిల్ దొరికిందని, ఇలాంటి అర కొర కథ అల్లి అభాసు అవుతారో చూడాలి.