Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌ : పానుగంటి వారి ''సాక్షి'' - 2

నేను ప్రస్తావించబోయే ''సాక్షి'' లో రెండో వ్యాసంకూడా నాటకాల గురించే. నాటకాలు మాకు తెలియవు బాబోయ్‌ అని యువపాఠకులు అంటే జాలి పడతాను. గత 50 ఏళ్లగా తెలుగువారికి తెలిసిన ఏకైక కళారూపం సినిమా మాత్రమే. ఒక సంగీత కచ్చేరీ పెట్టినా, భరతనాట్య కార్యక్రమం పెట్టినా, నాటకం వేసినా హాలు ఖాళీగా వుంటుంది. మనవాళ్లకు శాస్త్రీయసంగీతం గురించి చెప్పాలన్నా, చరిత్ర గురించి చెప్పాలన్నా సినిమాల ద్వారానే చెప్పాలి. 25,30 ఏళ్ల క్రితం దాకా కనీసం స్కూలు ఫంక్షన్లలోనైనా స్కిట్స్‌, నాటికలు వేసేవారు. ఇప్పుడు ఎక్కడా చూసినా రికార్డింగ్‌ డాన్సులే. చిన్నపిల్లల నుండి, నడివయసు గృహిణులదాకా సినిమాపాటలకు స్టెప్పులు వేసేవారే. తక్కిన ప్రాంతాల్లో పరిస్థితి యింత ఘోరంగా లేదు. చాలా రాష్ట్రాలలో నాటకరంగం యింకా సజీవంగానే వుంది. ఇలాటి పరిస్థితి రావటానికి యువత బాధ్యులు కారు. కానీ వారు గతాన్ని ప్రస్తుతానికి రిలేట్‌ చేసి చూడగల శక్తి సంతరించుకోవాలి. సైన్సు ప్యూర్‌ ఫార్మ్‌లోనే వుంటే ఉపయోగపడదు. అప్లయిడ్‌ సైన్సెసే మనకు జీవితానికి బాట చూపుతాయి. ''సారంగధర'' నాటకంలో రాజరాజ నరేంద్రుడు తను పెళ్లి చేసుకోబోయే యువతి అందచందాలను మంత్రి ఎదుట పాడడం అసహజం, ఔచిత్యభంగం అని పానుగంటి విమర్శించారు. ఈనాడు సినిమాల్లో కూడా యిలాటివి వున్నాయి కదా! నీ మెడ చూసి మెచ్చా, నీ నడుం చూసి వచ్చా, అంటూ వెనక్కాల ముప్ఫయి మంది ఆడా, మగా వేసుకుని కథానాయకుడు కథానాయికతో అనడం వింత కాదా! అలాగే నన్ను ఎత్తుకుపోరా, ఏదేదో చేయరా, కొరకరా, నలిపేయరా అంటూ కథానాయిక అందరి ఎదుటా హీరోని వేడుకోవడం విడ్డూరం కాదా! ఇలా ప్రస్తుతానికి అన్వయించుకుంటే పాతవి కూడా ఎంజాయ్‌ చేయగలం.

ఈ వ్యాసం మగవాళ్లు ఆడవేషం వేయడం గురించి. అప్పట్లో నాటకాలే వుండేవి కాబట్టి, వాటి గురించి పానుగంటి రాశారు. ఇప్పుడు సినిమాల్లో కూడా ఎందరో హాస్యనటులే కాదు, కథానాయకులు కూడా ఆడవేషం వేస్తూ వుంటారు, చుట్టుపక్కన వున్నవాళ్లు గుర్తించలేక పోతూ వుంటారు. అసలు మగవాళ్లను ఆడవేషంలో భరించడం మహా కష్టం. అత్యంత అసహజంగా వుంటుంది. అయినా హీరోలకు అదో మోజు, అన్ని రకాల పాత్రలూ వేయగలిగామని చెప్పుకోవడానికి! ఆడవారికి వుండే సహజమైన ఒంపుసొంపులు, సొగసు, వగలు పురుషుడికి రానేరావు. ఏదో ప్రయోగం కోసం అంటే కాస్సేపు భరించవచ్చంతే. ఆ పాయింటు మీదే యీ వ్యాసం! 

మగవారూ -  ఆడవేషాలూ - ఒక మహిళా సంఘంలో ఉపన్యాసం ఇవ్వడానికి ఒకామె  రాసుకున్న ప్రసంగ వ్యాసం సాక్షి సంఘానికి  చేరింది. ఆ ఉత్తరంలో విషయం యిది - 'మగవాడు మొదటినుండి మన అభివృద్ధికి అడ్డుపడున్నాడని తెలిసి కూడా  అతని పాపాన అతడే  పోతాడని ఊరుకున్నాం చాలా కాలం. ఇప్పుడు వాళ్ల కెదురు తిరిగి అన్నిరంగాలలో పైకి వస్తున్నాము కాబట్టి అసూయతో కొన్ని ఆరోపణలు  చేస్తున్నాడు. వారికి సమానం కావాలనే దురాశతో  మనం వారిని అనుకరిస్తున్నామని వెక్కిరిస్తున్నాడు. మనకి అవసరమైనది మనం చేస్తున్నాము కానీ తనను అనుకరించే ఉద్దేశ్యం ఎంత మాత్రం లేదని అతనికెందుకు తెలియదు? తాను మాత్రం ఎవరిని ఇమిటేట్‌  చేసి యిన్ని వేషాలు  తెచ్చుకున్నాడు? తను మనను కాపీ కొట్టవచ్చా? కానీ మనం మాత్రం అతన్ని కాపీ కొట్టకూడదా? 

నాటకాలలో స్త్రీ పాత్రలు మగవాళ్లు ఎందుకు వెయ్యాలి? సొగసుగా ఉంటుందని మనం ముంగురు ఈ చెంపా, ఈ చెంపా, ఒక్క అంగుళం వెడల్పున  కత్తిరించుకుంటే ఎంత అల్లరి పెట్టాడు. అలాంటిది తను మీసాలు పూర్తిగా  గొరిగించుకుని  నాటకం స్టేజి మీద పోతుపేరంటాలులా నిలబడినపుడు మనం  చెంపలు వాయిస్తే తప్పేముంది? రైకకు బొత్తాలు అంటించి చేతులు రవంత  పొడుగు చేసుకుంటే కళ్లల్లో మేకులు కొట్టుకున్నాడే ! అలాంటిది అతనిప్పుడు మన రైక తొడుక్కుని మరేవో తగలబెట్టుకుని సిగ్గులేక  ఉభయభ్రష్టత్వపు  ఆడరూపంతో మగముత్తెదవులా నిలబడితే  మనని అవమానించినట్లే కదా! చుట్ట కాల్చి మాడ్చుకున్న పెదాల మీద లత్తుక  పూస్తాడు. అసలే మన తల కంటే అతని తల పెద్దది. అది చాలదన్నట్టు  దానిమీద సవరాలు పెట్టడం!  మొత్తం  మీద రాకాసి తలలా అనిపిస్తుంది. ఇలా తయారయ్యి తనేదో జగన్మోహినీ అవతారం అనుకుంటాడు.

ఆడదానిని అనుకరించడం తన తరమా? అసలు ఆడదాని చూపును అలవర్చుకోగలడా మగవాడు? సూటిగా ఒక్క క్షణం చూసి తక్షణం చూపు మరల్చుకోగల లావణ్యం మగవాడికుందా? మంగళహారతి ఇచ్చినట్టు ఒక్క చూపుతో పరిసరాలన్నీ తిప్పి చూడగల ఆడదాని నేర్పు, కళ్ళల్లో ఒక్కసారి మెరుపు చూపించి అంతలోనే ఆర్పేయగల ఒడుపు మగవాడు స్వంతం చేసుకోగలడా? పెదాలపై పండు వెన్నెల్లా కనబడవలసిన మందహాసాన్ని పెదాల మీదనే నొక్కేసి కంటికొనలో ఓ మూల దాచేయడం ఆడదానికే తగుతుందా? ఈ నపుంసక రూపానికా?

అసలు  ఆడదానిలా నిలబడగలడా మగవాడు ? చనువు, ప్రేమ కనబరచవలసిన భర్త ఎదుట ఎలా నిలబడాలో, కాసంత మాత్రమే  గౌరవం చూపాల్సిన  పెద్ద బావగారి వద్ధ ఎలా నిలవాలో,  భయగౌరవాలు రెండూ కనబరచవలసిన  మామగారి వద్ద  ఎలా నిలబడాలో ఆ తేడా మగవాడు చూపగలడా? ఒక ఉదాహరణ చెప్తాను. నా భర్త  శాకుంతలం నాటకంలో  ప్రియంవద వేషం  వేస్తున్నాడంటే  చూడడానికి వెళ్లాను.  మొక్కలకు  నీళ్లు  పోయడానికి  శకుంతలతో  కలిసి చేతిలో  చెంబు పట్టుకుని  మా ఆయన స్టేజి ఎక్కాడు. ఎలా  నిలబడ్డాడో  తెలుసా? ఎడమ చేయి నడుము మీదికి జారి పోయింది. కుడి చేతిలో ఇత్తడి  చెంబు  పట్టుకుని  ప్రాప్టింగు  చెప్పేవాడి వైపు చూస్తున్నాడు. అదెలా వుందో తెలుసా? టాయిలెట్‌  క్యూలో నిలబడినట్టుంది! నడుము మీద చేయి వేసుకుంటే, బుగ్గ మీద వేలు పెట్టుకుంటే, మాటిమాటికి పైట సవరించుకుంటే ఆడదానిని అనుకరించినట్లేనా? వెర్రివెర్రి పక్క చూపులు చూసి, ముసిముసి నవ్వులు నవ్వితే మనం ఆడదనుకోవాలా? అసలు ఆడదాని  వేషం  మగవాడికి  ఎలా అబ్బుతుంది?

ఒకసారి 'ద్రౌపది వస్త్రాపహరణం' నాటకానికి  వెళ్లాను. దుశ్శాసనుడు ద్రౌపది చీరలు ఒలిచే  దృశ్యం. చీరలు ఎంత మట్టుకు లాగాలో  దుశ్శాసనుడికి తెలియదు.  ఎంతవరకూ లాగించుకోవాలో  ద్రౌపదికీ తెలియదు. ఇద్దరూ కూడా చెడ తాగి ఉన్నారు. ద్రౌపది వేషం స్త్రీ వేసి ఉంటే జాగ్రత్త పడి వుండేది. కాని వేషం  కట్టినది పురుషుడు కదా!  'వద్దు వద్దు' అని తెరచాటు నుండి కేకలు వేసినా దుశ్శాసనుడు ఆగలేదు - ద్రౌపది ఆపలేదు. చివరికి ద్రౌపది వేషధారికి పైన 'రైక', క్రింద గావంచా మిగిలింది. నెత్తిపైన బోర్లించిన బుట్టలా సవరం ఒకటి! సృష్టికంతకు ఒక్కటే  దిష్టిపిడతలా ద్రౌపది  మిగిలింది. పుట్టు గుడ్డి వేషం వేస్తున్న  ధృతరాష్ట్రుడు కూడా ఆ దృశ్యం చూడలేక ఎవరి సహాయం లేకుండానే తెరచాటుకి పారిపోయాడు. తెర దించబోతే పడలేదు.  ద్రౌపదికి నాటకం  కాంట్రాక్టరుకి  భయం వేసింది కాబోలు  కిందకు ఉరికాడు.  ద్రౌపది వేషధారి తను ఆడో, మగో మర్చిపోయి పురుషుల వైపుకు పరిగెట్టాలో, స్త్రీల వైపుకు పరిగెట్టాలో అర్థం కాక  చివరికి స్త్రీల వైపు పరిగెట్టి వాళ్ల మధ్యన కూచున్నాడు. ఆడవాళ్లంతా తటాలున లేచిపోయి పాక కాలినంత హడావుడి చేసి కేకలు వేశారు. చివరకు కొందరు మగవాళ్లు వచ్చి ఆ వేషధారిని చావగొట్టారు. కొంతకాలం పాటు ఆడవేషాలు వేస్తే పాత్రధారి ఇలాగే అవుతాడు.

ఇంకొక స్త్రీ పాత్రధారి గురించి చెప్తాను - ఆయన ఓ రోజు మార్కెట్లో కూరలు కొంటున్నాడు. పైన ఉత్తరీయంలో కూరలు మూట కట్టుకుని  వెళ్తున్నాడు. జన్మతః ఆడంగివాడు కాదు కానీ పది సంవత్సరాలుగా ఓ నాటకం  కంపెనీలో ఆడ వేషం వేస్తున్నాడు. ఇంతలో ఆ కంపెనీ యజమాని అలా వచ్చాడు. అతన్ని  చూడగానే యితను సిగ్గుపడి, ముడుచుకుపోయి మూట కట్టగా మిగిలిన ఉత్తరీయంతో పైట వేసుకోబోయి, అది చాలకపోవడంతో రెండు చేతులను కత్తెరలాగా ఛాతీపై వేసుకుని తలవంచుకుని నిలబడ్డాడు. ఒక్క నిమిషంలో తన మగతనాన్ని మసి చేసుకున్నాడు, అలా అని ఆడదీ కాలేకపోయాడు.

బాహ్యలక్షణాలే అనుకరించలేనివాడు స్త్రీ అంతరంగ లక్షణాలు అనుకరించగలడా? మనను అనుకరించడానికి ప్రయత్నించి భంగపడిన మగవాడు మనం అతన్ని అనుకరిస్తున్నా మనడం హాస్యాస్పదం కదూ! అసలు మగతత్వానికి ఆడతనానికి ఎంతో భేదం ఉంది. ఒకటి కఠినం, మరొకటి మార్దవం,  ఒకటి  హేతుబద్ధం మరొకటి రసప్లుతం. ఇంత విభిన్నత ఉంది కాబట్టే  స్త్రీ పురుషులకు ఒకరంటే మరొకరికి ఆకర్షణ ఉంది. ఇద్దరి మధ్య ఆ గీత చెరిపి వేయబోతే  ఇలాగే  ఉంటుంది.'

ఇదీ ఆ వ్యాసం. దీన్ని ప్రస్తుతానికి అన్వయించే ఉదంతం చెప్తాను వినండి - జమునగారు సత్యభామ వేషంలో ఎంత పేరు తెచ్చుకున్నారో అందరికీ తెలుసు. చాలా ఏళ్ల గ్యాప్‌ తర్వాత ''శ్రీకృష్ణ తులాభారం'' సినిమాలో వేసేటప్పుడు సీనియర్‌ నటి ఋష్యేంద్రమణి ''అమ్మాయ్‌, రంగస్థలంపై స్థానంవారు వేసి ఎంతో పేరు తెచ్చుకున్న పాత్ర వేస్తున్నావు. ఆయన ఎలా చేసేవారో చేసి చూపిస్తాను. అలా చెయ్యి'' అంటూ స్థానం వారిలా మాటిమాటికీ పైట సర్దుకోవడం, తొడ మీద నుంచి చేయి తిప్పుకోవడం చేసి చూపించింది. జమున మాత్రం ఆ షాట్‌లో జస్ట్‌ నడుం మీద చెయ్యి పెట్టుకుని నిలబడ్డారు. ''అదేమిటి? నేను చెప్పినా అలా సింపుల్‌గా చేసేశావ్‌?'' అని ఋష్యేంద్రమణి కోప్పడబోతే జమున లాజిక్‌ చెప్పారు - ''స్థానం వారు మగవారు, ఆడ కారెక్టరు వేస్తున్నారు కాబట్టి కొంచెం అతిగా నటించాలి. లేని వయ్యారం తెచ్చిపెట్టుకోవాలి. రంగస్థలం కాబట్టి దూరంగా వున్నవారు కూడా నోటీసు చేసేట్లా కాస్త విగరస్‌గా చేయాలి. నేనూ ఆయనలాగే పైట మాటిమాటికీ సర్దుకుంటే ఓవర్‌గా చేశానంటారు, సెక్సప్పీలు కోసం పాత్రను పాడు చేశానని విమర్శిస్తారు'' అని. జమునగారి మాటలు అక్షరాలా నిజం. ఆవిడకు సహజమైన వయ్యారం, లావణ్యం వున్నాయి. మగవాడైతే తెచ్చిపెట్టుకోవాలి. కానీ ఎంత తెచ్చిపెట్టుకున్నా ఆ హొయలు రానే రావు. (సశేషం) 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015)

[email protected]

Click Here For Part-1

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?