ఎమ్బీయస్‌: నిర్మాత పదానికి నిర్వచనం- రామానాయుడు – 1

రామానాయుడుగారికి ఘననివాళి లభించింది. ఆయనా, ఆయన వారసులు పరిశ్రమలో యింకా ప్రముఖులు కాబట్టే.. అనడానికి లేదు. ఆయన వలన మేలు కలిగినవారు ఎందరో వున్నారు. మంచిమనిషిగా, హుందాతనాన్ని కాపాడుకుంటూ చివరి వరకూ ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ…

రామానాయుడుగారికి ఘననివాళి లభించింది. ఆయనా, ఆయన వారసులు పరిశ్రమలో యింకా ప్రముఖులు కాబట్టే.. అనడానికి లేదు. ఆయన వలన మేలు కలిగినవారు ఎందరో వున్నారు. మంచిమనిషిగా, హుందాతనాన్ని కాపాడుకుంటూ చివరి వరకూ ఉజ్జ్వలంగా ప్రకాశిస్తూ లైమ్‌లైట్‌లోనే వున్నారు కాబట్టి అనుకోవాలి. ఆయన గురించిన విషయాలు చాలాకాలంగా అందరూ చెప్పుకునేవే. ఆయన జీవితచరిత్రలు వచ్చాయి. వ్యాసాలు వచ్చాయి, అనేక టీవీ యింటర్వ్యూలు వచ్చాయి. ఆయన ఏ విషయాన్నీ దాచుకోలేదు. తన బలమేమిటో, బలహీనత ఏమిటో, ఎప్పుడు ఏ సినిమాకు ఎంత ఖర్చు పెట్టారో, ఎంత వచ్చిందో, ఎంత పోయిందో, ఎక్కడ సక్సెసయారో, ఎందుకు బోర్లా పడ్డారో అన్ని వివరాలూ స్పష్టంగా చెప్పారు. మనం కొత్తగా చెప్పేదేమీ లేదు – కొన్ని పరిశీలనలు చేయడం తప్ప!

ఈ రోజు ఆయనకు నీరాజనాలు అర్పించిన నిర్మాతలు రామానాయుడుగారి అంశ తమలో ఏ కొంచెమైనా వుందా లేదా అన్నది వారంతట వారే తరచి చూసుకోవాలి. రేపు మనం వెళ్లిపోయిన తర్వాత మన గురించి యిలా చెప్పుకుంటారా మరోలా చెప్పుకుంటారా అన్నది కూడా ఆలోచించుకోవాలి. ఆయన రోజులు వేరు, మా రోజులు వేరు అనే వాదన నప్పదు. రామానాయుడు గారే చెప్తూ వుండేవారు – 'పరిస్థితులు ఏం మారాయి? సక్సెస్‌ రేటు ఎప్పుడూ పదిశాతమే అని. ప్రణాళికాబద్ధంగా వెళ్లినవారు నిలదొక్కుకున్నారు, లేనివారు లేదు' అని. ఆయన గొప్పతనం ఏమిటంటే – సినిమాను ఆయన వ్యాపారంగా చూశారు. చాలామంది దాన్ని జూదంగా చూస్తారు. వేరే చోట డబ్బు మిగిలితే యిక్కడ పెడదామని కొందరు, దీనిలో అర్జంటుగా గడించేసి వేరే చోట పెడదామని కొందరూ అనుకుంటారు. ఏ వ్యాపారానికైనా పెట్టుబడిదారుడు ముఖ్యం. ఎంత గొప్ప నటుడికైనా, దర్శకుడికైనా, రచయితకైనా, గాయకుడికైనా, కళాకారుడికైనా – తన ప్రతిభ చూపించాలంటే ఒక వేదిక కావాలి. అది కల్పించేవాడికి శక్తి, ఆసక్తి రెండూ వుండాలి. నిర్మాతకు టేస్టు లేకపోతే ఎంత గొప్ప సినిమాయైనా రూపొందదు. అందువలన నిర్మాతే తొలిగౌరవాన్ని అందుకోవాలి. కానీ సినిమారంగంలో ఆ పరిస్థితి లేదు. డివి నరసరాజుగారి మిత్రులు కొందరు యీ రంగంలోకి రాబోయి మానేశారట. ఏమంటే 'ఎక్కడైనా డబ్బిచ్చినవాడికి అందరూ దండాలు పెడతారు. ఇక్కడేమిటండీ బాబూ, డబ్బూ మనమే యిచ్చుకోవాలి, దండాలూ మనమే పెట్టుకోవాలి' అన్నారట. 

కథ చూసుకోవడం, సరైన వాళ్లను ఎంచుకుని బాధ్యతలు అప్పగించడం, ప్లానింగ్‌ చేసుకుని, దగ్గరుండి అన్నీ అమలయ్యేట్లు చూసుకోవడం – యివే నిర్మాత పనులు. ఈ రోజు నిర్మాత కథ చుట్టూ కాకుండా హీరోల కాల్షీట్ల కోసం వెతుకుతున్నారు. డైరక్టరు తనకు కథ చెప్పకపోయినా, బజెట్‌ ఎంతవుతుందో చెప్పకపోయినా డబ్బులు అప్పు తెచ్చి అతని చేతిలో పోస్తున్నాడు. ఎందుకు? అతను దాన్ని రెట్టింపు చేసి మళ్లీ తన చేతిలో పోస్తాడన్న దురాశతో! ప్రాక్టికల్‌ థింకింగ్‌ లేదు. ఏదో అద్భుతం జరిగిపోయి, మన సినిమాను హీరో, డైరక్టరు ఆడించేస్తారు అని ఆశ పెట్టుకుని తక్కినవాటిని పట్టించుకోవడం లేదు. రామానాయుడుగారు ఎప్పుడూ చెప్పేవారు – 'ఏట్లో పారేసినా ఎంచి పారేయాలి' అని. సెట్లో నిర్మాత వుంటే ఖర్చులో కనీసం 30% ఆదా అవుతుంది అని. సినిమాను  యిండస్ట్రీగా చూసినవారే బాగుపడతారు, పద్ధతీపాడూ లేకుండా, పబ్లిసిటీ కోసం విచ్చురూపాయలను విచ్చలవిడిగా విరజిమ్మేవారు ఖర్చయిపోతారు. 

రామానాయుడి గారి జీవితం మనకు స్ఫూర్తిదాయకం అంటూ పైకి చెప్పడం కాదు, ఏ వ్యాపారం చేసినా ఎంత శ్రద్ధగా చేయాలో ఆయనను చూసి కొంతైనా నేర్చుకోవాలి. డబ్బుంది కదాని ఆస్తులన్నీ అమ్మేసి సినిమా వ్యాపారంలోకి ఒక్కసారిగా దూకలేదు. డబ్బింగ్‌ సినిమా తీద్దామనుకుని, రామినీడుగారి సలహాతో చిన్న బజెట్‌ సినిమాలో భాగస్వామిగా దిగారు. రామినీడు వద్ద సినిమా రంగంలోని మెళకువలతో బాటు ప్రవర్తన విషయంలో జాగ్రత్తలు కూడా తెలుసుకున్నారు. మార్కెటింగ్‌లో వున్నవారికి ప్రెజెన్స్‌, పర్శనాలిటీ ఎలా అవసరమో, నిర్మాతకు కూడా మాటమంచితనం, ఎవరినైనా ఒప్పించగల నేర్పు వుండాలి. ''అనురాగం'' సినిమాలో తన కిచ్చిన పాత్ర చిన్నదని ఫీలైన షావుకారు జానకి వేషం వేయనన్నారు. దర్శకనిర్మాతలు చెప్పినా వినలేదు. అప్పుడు యీయన వెళ్లి 'ఇది నా ప్రథమ ప్రయత్నం, సహకరించండి' అని అడిగితే ఆవిడ 'మీకోసం చేస్తా' అంటూ ఒప్పుకున్నారు. 'కావాలంటే పారితోషికం ఎక్కువడగండి, యిస్తాం' అని పొగరుగా మాట్లాడి వుంటే పని అయివుండేది కాదు. 

నిర్మాతకు విజన్‌ వుండాలి. ''రాముడు-భీముడు'' లాటి కథను ఎందరో పెద్దలు తిరస్కరించారు. కానీ యీయన దానిలో బంగారుగనిని చూడగలిగాడు. దానిపై భారీగా పెట్టుబడి పెట్టాడు. అదే ఆయన్ను నిలబెట్టింది. ఆ సినిమా ఎన్ని భాషల్లో, ఎన్ని రకాలుగా వచ్చిందో అందరికీ తెలుసు. కథకు ఆయన ఎప్పుడూ ప్రాధాన్యత యిచ్చాడు. తమిళంలో నుంచి చాలా కథలు తీసుకున్నారు, రీమేక్‌లు చేశారు, తమిళ రచయితల కథలు తీసుకున్నారు, తెలుగు నవలలను సినిమాలుగా తీశారు, చివరిదాకా ఆయన కొత్త కథలు వింటూనే వున్నారు. కథలు నచ్చితే స్క్రిప్టు తయారుచేసి దాచి వుంచుకుని అవసరమైనపుడు బయటకు తీసిన సందర్భాలూ వున్నాయి. ఆయన అంచనాలు అన్ని వేళలా కరక్టు కాలేదు, కెరియర్‌లో చాలా ఫెయిల్యూర్లు వున్నాయి. ఏ వ్యాపారంలోనైనా అది సహజం. ఎక్కడా ఆగకుండా వరుసగా తీసుకుంటూ పోవడంతో టర్నోవర్‌ కారణంగా ఆయన సంస్థ నిలబడింది. వరుసగా ఫ్లాపులు వచ్చి దుకాణం కట్టేస్తారేమోననుకుంటే ఒక హిట్‌ వచ్చి నిలబెట్టేది. 1979-82 మధ్య ''ఒక చల్లని రాత్రి'', ''కక్ష'', ''అగ్నిపూలు'', ''ప్రేమమందిరం'' వచ్చి కోటి రూపాయల డెఫిసిట్‌లోకి వెళితే ''దేవత'' (1982) వచ్చి మళ్లీ వూపిరి పోసింది. (సశేషం) –

 ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015)

[email protected]