ఎమ్బీయస్‌ : సూత్రధారి కాబోయిన పాత్రధారి

బిహార్‌ ముఖ్యమంత్రి మాంఝీ విశ్వాసతీర్మానం జోలికి పోకుండానే రాజీనామా సమర్పించేశారు. ఇలాటి బలహీనుడికి బిజెపి తన మద్దతు ప్రకటించి పప్పులో కాలేసిందా? పరిశీలిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. బిహార్‌లో కులరాజకీయాలు ప్రాధాన్యత వహిస్తాయని అందరికీ…

బిహార్‌ ముఖ్యమంత్రి మాంఝీ విశ్వాసతీర్మానం జోలికి పోకుండానే రాజీనామా సమర్పించేశారు. ఇలాటి బలహీనుడికి బిజెపి తన మద్దతు ప్రకటించి పప్పులో కాలేసిందా? పరిశీలిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. బిహార్‌లో కులరాజకీయాలు ప్రాధాన్యత వహిస్తాయని అందరికీ తెలుసు. జనాభాలో 14% వున్న యాదవులు లాలూ ఎన్ని కుంభకోణాల్లో యిరుక్కున్నా సరే అతనికే మద్దతు యిస్తున్నారు. 22 కులాల దళితులు పాశ్వాన్‌ కులానికి చెందిన రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌కు మద్దతిస్తున్నారు. నితీశ్‌ కూర్మీ కులానికి చెందినవాడు. వారి జనాభా 3% మాత్రమే. అందుకే కొంతకాలం లాలూతో, మరి కొంతకాలం బిజెపితో అంటకాగుతూ బండి లాక్కుని వస్తున్నాడు. తను అధికారంలోకి వచ్చాక 2007లో దళితులను పాశ్వాన్‌లు-యితరులుగా విడగొట్టడానికి జనాభాలో 15% వున్న 21 కులాలకు విడిగా మహాదళితులనే గుర్తింపు యిచ్చి పాశ్వాన్‌ బలం తగ్గించాడు. ఆ వర్గానికి చెందిన మాంఝీకి ప్రాధాన్యత యిచ్చాడు. ప్రభుత్వ పథకాలు వారికి అందేట్లు చేశాడు. బిజెపిలో ఉదారవాద నాయకత్వం వున్నంతకాలం నితీశ్‌కి దిలాసాగానే వున్నాడు – తనను బలపరిచే ముస్లిములు తనతోనే వుంటారని. కానీ ఎప్పుడైతే మోదీ బిజెపిని హస్తగతం చేసుకుని ప్రధాని అభ్యర్థిగా ముందుకు వచ్చాడో నితీశ్‌కు గత్యంతరం లేకపోయింది. 

మోదీ మొహం చూస్తే ముస్లిములు జెడియును కూడా దూరం పెట్టేస్తారని భయపడి, 2013 జూన్‌లో బిజెపితో తెగతెంపులు చేసుకున్నాడు. ఓడిపోయాడు. పార్లమెంటు ఎన్నికలలో వైఫల్యం తర్వాత నైతిక బాధ్యత వహిస్తూ తను దిగిపోయి చెప్పిన మాట వింటాడు కదాని మాంఝీ­ని తన స్థానంలో కూర్చోబెట్టాడు. మాంఝీ ఆ ఎన్నికలలో బిజెపి అభ్యర్థి చేతిలో డిపాజిట్‌ కూడా పోగొట్టుకున్నా కులం కారణంగా యీ పదవి దక్కింది. అయితే కొద్ది రోజుల్లోనే మాంఝీ­కి ఆశ పుట్టింది. తన కులానికి ఎక్కువ ఓట్లు వున్నపుడు తను నితీశ్‌ మాట వినవలసిన అవసరం ఏముంది, విడిగానే నాయకుడిగా ఎదగవచ్చు కదా అని. దళిత కార్డును విస్తారంగా వాడడం మొదలుపెట్టాడు. తన తర్వాత దళితుడే ముఖ్యమంత్రి కావాలని ప్రకటనలు చేయసాగాడు. శాసనసభ్యులందరికీ జీతాలు పెంచి వాళ్లను ఆకట్టుకున్నాడు. కానీ అధికారగణం అతన్ని సీరియస్‌గా తీసుకోలేదు. అతని జనతా దర్బార్‌లకు హాజరు కాలేదు. దాంతో ఆమె నితీశ్‌ సెలక్టు చేసిన అధికారులందరినీ వేరే చోట్లకు బదిలీ చేసేశాడు. 

నితీశ్‌ అంటే మోదీ భగ్గుమంటాడని తెలుసు కాబట్టి మాంఝీ మోదీతో స్నేహం చేశాడు. అతని ప్రమాణస్వీకారానికి హాజరయ్యాడు. విడిగా కలవనారంభించాడు. ఇదంతా నితీశ్‌కు నచ్చలేదు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు తన క్యాడర్‌ను సిద్ధం చేయాలని సంపర్క్‌ యాత్ర అని పార్టీ తరఫున మొదలుపెడితే మాంఝీ వాటికి రాలేదు సరికదా, అదే సమయంలో వివాదాస్పద ప్రకటనలు చేసి, యాత్ర సఫలం కాకుండా చేశాడు. ఇతన్ని కొనసాగించిన కొద్దీ తమకు ఎప్పణ్నుంచో ఓట్లేస్తున్న వారందరూ దూరమవుతారని, యిటీవలే జట్టుకట్టిన లాలూని సమర్థించే యాదవులు కూడా వ్యతిరేకులవుతారనీ జెడియు నాయకులు శరద్‌ యాదవ్‌, నితీశ్‌లకు భయం పట్టుకుంది. నువ్వు దిగిపో, నీకు పార్టీలో మంచి పదవి యిస్తాం, మీ అబ్బాయికి మంత్రి పదవి యిస్తాం అని ఆశపెట్టారు. మాంఝీ లొంగలేదు. బిజెపి మద్దతుతో తను ముఖ్యమంత్రిగా కొనసాగగలననుకున్నాడు. ఆ విషయం తెలియగానే అప్పటిదాకా అతన్ని సమర్థించిన లాలూ వూరుకున్నాడు. మాంఝీ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళదామనుకున్నాడు. తన వద్ద దళిత ఓట్లు వున్నాయని, బిసి నాయకుడు పప్పూ యాదవ్‌ తనకు మద్దతు యిస్తున్నాడు కాబట్టి బిసి ఓట్లు కూడా కలుస్తాయని, బిజెపి కారణంగా అగ్రవర్ణాల ఓట్లు కూడా చేరి తను ఎన్నికలలో నెగ్గడం ఖాయమని అతను అంచనా వేశాడు. రద్దు చేయడానికి కాబినెట్‌ సమావేశంలో అందరూ ఒప్పుకున్నారని బొంకాడు. కానీ వెంటనే మంత్రులు ఆ ప్రకటనతో విభేదించి, బయటకు వచ్చి నితీశ్‌తో చేరారు. 

జెడియు పార్టీ చీలి అత్యధికులు తనను సమర్థించడంతో నితీశ్‌ వారిని, ఆర్‌జెడి, కాంగ్రెస్‌, సిపిఐ శాసనసభ్యులు 130 మందిని వెంటపెట్టుకుని రాష్ట్రపతి వద్దకు వెళ్లి  243 మంది వున్న శాసనసభలో తనకే బలం వుందని యావద్దేశానికి నిరూపించాడు. అయినా మాంఝీ వెనక్కి తగ్గలేదు. ఆర్‌జెడిని చీల్చబోయాడు. తన వద్ద 42 మంది జెడియు, 12 ఆర్‌జెడి సభ్యులున్నారని క్లెయిమ్‌ చేశాడు. అసెంబ్లీ ఏర్పాటు చేసి, తనకే బలం వుందని నిరూపించుకుంటా నన్నాడు. ఎందుకంటే బుధవారం నాడు బిజెపి సమావేశమై మాంఝీకి ఓటేయాలని తన 87 ఎమ్మెల్యేలకు విప్‌ జారీ చేసింది. పార్టీలో నితీశ్‌ బలం పెరగసాగింది. తనకు 128 ఎమ్మెల్యేల మద్దతు వుంది కాబట్టి తనను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని నితీశ్‌ స్పీకరును కోరాడు. ఆ అభ్యర్థనపై నిర్ణయించడానికి స్పీకరు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే బిజెపి వాకౌట్‌ చేసింది. అయినా స్పీకరు నితిశ్‌ను గుర్తించాడు. మాంఝీ పక్షాన 12 మంది ఎమ్మెల్యేలు మాత్రమే నిలిచారు. వారిలో నలుగురి సభ్యత్వాన్ని స్పీకరు రద్దు చేస్తే పట్నా హైకోర్టులో సింగిల్‌ బెంచ్‌ దాన్ని నిలిపింది. కానీ గురువారం నాడు డివిజన్‌ బెంచ్‌ విచారణ జరిపి ఆ తీర్పుపై స్టే యిచ్చింది. దాని కారణంగా యిప్పుడు ఆ నలుగురు ఓట్లేయలేరు. అందుచేత అతని పార్టీలో 8 మందే మిగిలారు. మాంఝీకి మద్దతిస్తే డబ్బిస్తానని, మంత్రిపదవి యిస్తానని పప్పూ యాదవ్‌ తనకు ఫోన్‌ చేశాడని ఆరోపిస్తూ నితీశ్‌ అనుచరుడు సాక్ష్యంగా ఆడియో క్లిప్పింగ్‌ విడుదల చేశాడు. 

ఇవన్నీ తట్టుకోవడానికి తమకు 140 మంది మద్దతు వుందని చెప్పుకుంటున్న మాంఝీ ''దళిత చేతనా ర్యాలీ'' అని పట్నాలో ఓ కార్యక్రమం నిర్వహించి, తను చేస్తున్న అభివృద్ధి సహించలేక దళితేతరులు తనను కూలదోస్తున్నారని చెప్పుకున్నాడు. జెడియు పార్టీలోంచి తనను ఫిబ్రవరి 7 న బహిష్కరించగానే అతను రూ. 1 కోటి పరిమితిలోని ప్రభుత్వ కాంట్రాక్టులన్నిటిలో ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకే ప్రాధాన్యత యిస్తానని ప్రకటించాడు. అంతకుముందే ఎస్సీ, ఎస్టీ మహిళలకు పిజి వరకు ఉచిత విద్య కూడా ప్రకటించాడు. ఇవి చాలలేదనుకున్నాడేమో ఫిబ్రవరి 12 న 'ఐదెకరాల లోపు రైతులకు ఉచిత విద్యుత్‌ యిస్తా, నేను ముఖ్యమంత్రిగా కొనసాగితే దాన్ని 10 ఎకరాలు చేస్తా' అన్నాడు. గురువారం రాత్రి పొద్దుపోయేదాకా మాంఝీ వూగిసలాడుతూనే వున్నాడు. ఎలాగోలా గట్టెక్కేస్తే తర్వాతి సంగతి తర్వాత చూసుకోవచ్చనుకున్నాడు. తన ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించి బిజెపి కూటమిలోనుంచి బయటకు వెళ్లిపోయిన నితీశ్‌కు బుద్ధి చెప్పాలన్న గట్టి పట్టుదలతో వున్న మోదీ బిజెపి చేత విప్‌ కూడా జారీ చేయించాడు కాబట్టి అంతా తన చేతిలోనే వుందనుకున్నాడు. కానీ ఏం జరిగిందో ఏమో శుక్రవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభం కావడానికి ముందే గవర్నరు వద్దకు వెళ్లి రాజీనామా చేతిలో పెట్టాడు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015)

[email protected]