ఎమ్బీయస్‍: నూర్జహాన్ – లతా

లతా గొంతు విప్పడానికి ముందే నూర్జహాన్ ప్రసిద్ధికెక్కిన నటగాయని. ఆమె లతాకు ఐడాల్, ఆరాధ్యమూర్తి. నూర్జహాన్‌ను కొద్దికాలం అనుకరించి, తర్వాత తర్వాత స్వంత బాణీ అలవర్చుకుంది.

నూర్జహాన్ పాకిస్తాన్ తరలిపోకపోతే లతా పైకి వచ్చేదా? అనే ప్రశ్న చాలామంది చాలాకాలం పాటు వేసేవారు. లతా గొంతు విప్పడానికి ముందే నూర్జహాన్ ప్రసిద్ధికెక్కిన నటగాయని. ఆమె లతాకు ఐడాల్, ఆరాధ్యమూర్తి. నూర్జహాన్‌ను కొద్దికాలం అనుకరించి, తర్వాత తర్వాత స్వంత బాణీ అలవర్చుకుంది. దేశవిభజనానంతరం నూర్జహాన్ పాకిస్తాన్ తరలి వెళ్లిపోయింది. అక్కడ తన పాటలతో, నటనతో కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని ‘మలికా-ఎ-తరన్నుమ్’గా పేరు సంపాదించుకుంది. కళారంగంలోనే కాదు, రాజకీయరంగంలో కూడా ఓ వెలుగు వెలిగింది. 1947 తర్వాత నూర్జహాన్ భారతీయ సినిమాల్లో నటించ లేదు కాబట్టి చాలామందికి ఆమె గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు.

1926లో పుట్టిన నూర్జహాన్ ఆరేళ్ల ప్రాయం నుంచి పాడటంలో ప్రావీణ్యం కనబరచడం గమనించి ఆమె తండ్రి హిందూస్తానీ శాస్త్రీయ సంగీతంలో తర్ఫీదు యిప్పించాడు. 9 ఏళ్ల వయసులో ఆమె తన అక్కలతో కలిసి ఒక పంజాబీ సినిమాలో పాడింది, 11 ఏళ్ల వయసు నుంచి రంగస్థలంపై ప్రదర్శనలు యివ్వసాగింది. 16 ఏళ్ల వయసులో ప్రాణ్ (తర్వాతి రోజుల్లో విలన్‌గా పేరు తెచ్చుకున్నాడు) సరసన ‘‘ఖాన్‌దాన్’’ (1942) హీరోయిన్‌గా వేస్తే అది పెద్ద హిట్ అయింది. దాంతో ఆమె కుటుంబం బొంబాయికి తరలి వెళ్లింది. ఆ సినిమా డైరక్టరు షౌకత్ రిజ్వీని మరుసటి ఏడే పెళ్లాడింది. నటిగా, గాయనిగా ఆమె చాలా పేరు తెచ్చుకుంది. ‘‘బడీ మా’’, ‘‘జీనత్’’ (1945), ‘‘అన్‌మోల్ ఘడీ’’ (1946), ‘‘జుగ్నూ’’ (1947) యిలా ఆమె సినిమాలన్నీ హిట్సే. 1947లో దేశవిభజన తర్వాత ఆమె పాకిస్తాన్‌లోని కరాచీకి తరలి వెళ్లిపోయింది. .

నూర్జహాన్ నిష్క్రమణతో లతాకు ఎదురు లేకపోయింది. క్రమంగా శిఖరాల నధిరోహిస్తూ ‘భారతీయ స్వరసామ్రాజ్ఞి’ అనిపించుకుంది. నూర్జహాన్ దేశం విడిచి వెళ్లి వుండకపోతే పరిస్థితి ఎలా వుండేది అన్న విషయంపై ఊహాగానకచేరీలు సాగుతూనే ఉన్నాయి. లతా పోటీని నూర్జహాన్ తట్టుకో గలిగేదా? లేదా నూర్జహాన్‌ను దాటుకుని లత నంబర్ వన్‌గా ఎదగ గలిగేదా? లతా, నూర్జహాన్‌లకు కొన్ని పోలికలున్నాయి, కొన్ని తేడాలున్నాయి. ఇద్దరూ సెప్టెంబరు మాసంలోనే పుట్టారు. (నూర్జహాన్ 21న, లతా 28న) ఇద్దరికీ మధ్య మంచి స్నేహం ఉంది. వేర్వేరు దేశాలలో ఉన్నా ఉత్తరాలు రాసుకోవడం, ఫోన్‌లో మాట్లాడుకోవడం ఉంది. నూర్జహాన్‌కు పాన్ అలవాటు ఉంటే లతకు చూయింగ్ గమ్ నమిలే అలవాటుంది.

వాయిస్ విషయంలో ఇద్దరికీ తేడాలున్నాయి. ఇద్దరికీ అభిమాన సంగీత దర్శకుడైన నౌషాద్ మాటల్లో చెప్పాలంటే “లతా నూర్జహాన్ స్కూల్‌కి చెందినదే! అయినా నూర్జహాన్ వాయిస్ భారీ వాయిస్. మంచి బ్రైట్‌గా, వెయిటీగా ఉంటుంది. మూడ్‌కి తగ్గ విధంగా కంఠంలో ఎక్స్‌ప్రెషన్ పలికించగలదు – అదీ స్వరసహితంగా. లతాది నాజూకు వాయిస్ అయినా నూర్జహాన్ వద్ద ఆ కళను పట్టుకుంది.” లతాచే ముందులో పాడించిన సంగీతదర్శకులు – అనిల్ బిశ్వాస్, ఖేమ్‌చంద్ ప్రకాష్, నౌషాద్, ఘులాం మొహమ్మద్, శ్యామ్‌సుందర్, సజ్జాద్, హన్స్‌రాజ్ బెహల్, సి. రామచంద్ర – వీరందరూ నూర్జహాన్ చేత పాడించినవారే. లతా తొలి రోజుల్లో వారు ఆమె చేత నూర్జహాన్‌లా పాడించడానికి ప్రయత్నించారు. కానీ శంకర్-జైకిషన్‌లు నూర్జహాన్‌తో కలిసి పనిచేయలేదు. అందువల్ల “బర్సాత్” (1949)లో లతాచే పాడించినప్పుడు నూర్జహాన్ మోల్డ్‌లో పాడించకుండా స్వతంత్ర శైలిలో పాడించారు.

హిందీ సినీరంగంలో పంజాబీ స్టయిల్ కాస్త వెనుకబడి, మహారాష్ట్ర, బెంగాలీ ధోరణులు ప్రాచుర్యం పొందుతున్న కొద్దీ మాధుర్యం పాలు ఎక్కువయిన లతా స్టయిలే జనాలకి బాగా నచ్చింది. అది గమనించిన కంపోజర్స్ అందరూ ఆమె వైపే మొగ్గు చూపనారంభించారు. షంషాద్ బేగం చేత ఎన్నో మంచి పాటలు పాడించిన నౌషాద్, సి. రామచంద్ర, సచిన్‌ దేవ్ బర్మన్ క్రమంగా లతాకే ఛాన్సివ్వసాగారు. గాయనిగా నూర్జహాన్ కంటే లతా ప్రగతి బాగుండడానికి కారణాలు విశ్లేషిస్తూ నౌషాద్ అన్నారు – “పాకిస్తాన్ వెళ్లడంతో నూర్జహాన్ పరిధి చిన్నదయిపోయింది. అక్కడ పంజాబీ, సింధీ, ఉర్దూ భాషలలో తప్ప పాడలేదు కదా. కానీ లతాకు భారతీయ భాషలన్నిటిలోనూ పాడే అవకాశం ఉంది. పలు భాషలు, పలు కంపోజర్స్, పలు సన్నివేశాలు. వైవిధ్యం పెరిగిన కొద్దీ ఎదిగే అవకాశాలు మరింత వచ్చిపడతాయి.”

రాజూ భరతన్ అనే విఖ్యాత జర్నలిస్టు లతామంగేష్కర్‌ని డైరక్టుగా అడిగేశారు – “నూర్జహాన్ వలస పోకుండా ఉంటే మీరీ ఉన్నత స్థానాన్ని పొందగలిగే వారా?” అని. దానికి లతా చెప్పిన సమాధానం – “మీరో విషయం విస్మరిస్తున్నారు. నూర్జహాన్ నటీమణి, గాయని. తెరపై ఆవిడ నటించిన పాటలు మాత్రమే ఆవిడ పాడేది. మరి నేను అందరికీ పాడతాను. అందుచేత ఆవిడ నాకు రైవల్ అనడానికి వీలులేదు. పైగా నూర్జహాన్ టాప్‌లో ఉన్న పీరియడ్‌లో కాస్త ఇటూ అటూగా సురయ్యా కూడా ఉండేది. షంషాద్ బేగమ్ మాట సరేసరి. వీరే కాకుండా జోహ్రాబాయి అమీర్ బాయీ, గీతా రాయ్, రాజ్‌కుమారి, మోహన్‌తారా తల్‌పడే, లలితా దేవూల్‌కర్, సురీందర్ కౌర్ వంటి ఎంతో మంది గాయనీమణులు ఉండేవారు. ఎవరి స్థానం వారిదే! అందువల్ల నూర్జహాన్ ఇక్కడే ఉండిపోయినా నా స్థానానికి నేను వచ్చేదాన్ని. ఉన్నతస్థానాన్ని నిలుపుకోవాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. సిగరెట్టు, మద్యం, ఫాస్ట్ లైఫ్ వంటి వాటికి దూరంగా ఉండాలి.”

లతా చాలా జాగ్రత్తగా మాట్లాడుతూనే, నూర్జహాన్‌ అలవాట్ల కేసి, ఆమె వ్యక్తిగత జీవితంలోని లోటుపాట్ల కేసి మన ఆలోచన వెళ్లేట్లు చేసింది. భావోద్రేకాలకు సులభంగా లోనయ్యే కళాకారులకు వైవాహిక జీవితం సవ్యంగా ఉండటం అభిలషణీయం. కానీ అందరికీ ఆ అదృష్టం దక్కదు. లతాకు వివాహమే కాలేదు. ఆశా భోంస్లే భర్తతో విడిపోయింది. ఒపి నయ్యర్‌తో చాలాకాలం సన్నిహితంగా ఉండి, తర్వాత ఆర్‌డి బర్మన్‌ను చేసుకుంది. గీతాదత్ గురుదత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, వహీదా కారణంగా అతనితో విడిపోయి, మద్యానికి బానిస అయిపోయింది. నూర్జహాన్ విషయానికి వస్తే ఆమె వైవాహిక జీవితం సవ్యంగా సాగలేదు. తన భర్త రిజ్వీతో కలిసి పాకిస్తాన్ వెళ్లాక 1954లో అతనితో విడిపోయింది. వాళ్లకు కలిగిన ముగ్గురు పిల్లల్ని తన వద్దే ఉంచుకుంది. 1959లో తన కంటె 9 ఏళ్లు చిన్నవాడైన నటుడు ఎజాజ్ దుర్రానీని పెళ్లాడింది. కానీ 1971లో అతనికి విడాకులు యిచ్చింది. దానికి కారణం ఆమెకు పాకిస్తాన్ నియంత యాహ్యా ఖాన్‌తో ఉన్న సంబంధం ఉందనే ప్రచారం!

ఆమె వ్యక్తిగత సమస్యలు యిలా ఉన్నా నూర్జహాన్ వృత్తిపరంగా ఎంతో సాధించిన విషయం మనం గమనించాలి. రిజ్వితో కలిసి పాకిస్తాన్ వెళ్లిపోయాక నూర్జహాన్ ‘‘చాన్ వే’’ (1951) అనే సినిమాలో నటించడం, పాడడం మాత్రమే కాక భర్తతో కలిసి దర్శకత్వం కూడా వహించింది. పాకిస్తాన్ తొలి మహిళా దర్శకురాలు ఆమెయే. ఆ సినిమా హిట్ అయింది. వెంటనే వచ్చిన ‘‘దుపట్టా’’ (1952) సినిమా కూడా హిట్ అయింది. 1959లో ద్వితీయ వివాహం చేసుకున్నాక ఆమె భర్త యికపై నటించ వద్దన్నాడు. 1960 నుంచి నేపథ్య గాయనిగా మారింది. ‘‘గాలిబ్’’ (1961) హీరోయిన్‌గా ఆమె ఆఖరి చిత్రం. ‘‘బాజీ’’ (1963)లో నటించింది కానీ హీరోయిన్‌గా కాదు. అప్పటికి ఆమె వయసు 37 ఏళ్లు. ఇక ఆపై నేపథ్య గాయనిగా వెలిగింది. ఆరు దశాబ్దాల కెరియర్‌లో 10 వేల పాటలు పాడింది. 1148 సినిమాల్లో 2422 పాటలు పాడింది. తక్కినవి ప్రైవేటుగా యిచ్చిన గజల్స్. ‘‘మలికా ఎ తరన్నుమ్’’ (క్వీన్ ఆఫ్ మెలడీ) బిరుదు తెచ్చుకుంది.

అయితే ఆమె జీవితంలో మచ్చ పడడానికి కారణం, పాకిస్తాన్ అధ్యక్షుడు, సైనిక నియంత యాహ్యాఖాన్‌తో చనువుగా ఉండి దేశ వ్యవహారాలలో చక్రం తిప్పేదని పాకిస్తాన్ పత్రికలు ఆరోపించడం. అప్పటి తూర్పు పాకిస్తాన్ (దరిమిలా బంగ్లాదేశ్) ప్రజలను ఊచకోత కోసి, 1971లో భారత్‌తో యుద్ధానికి కాలు దువ్వి, పరాజయం పాలై పాకిస్తాన్ రెండు ముక్కలు కావడానికి కారణభూతుడైన వాడు జనరల్ యాహ్యాఖాన్. స్త్రీలోలుడయిన యాహ్యా పాలించే రోజుల్లో అతని చుట్టూ ఉన్న స్త్రీలు రాజ్యాన్ని ఏలేవారు. ఇందిరా గాంధీకి ‘కిచెన్ కాబినెట్’ ఉన్నట్టు ‘యాహ్యాకు హారెమ్ (అంతఃపురం) కాబినెట్’ ఉందనేవారు. ఆ సన్నిహితురాళ్లల్లో నూర్జహాన్ కూడా ఒకరని అంటారు. ఈ విధంగా పాలకులకు చేరువై చక్రం తిప్పిన గాయనీమణులు అరుదు. నూర్జహాన్‌కి ఆ (అ) గౌరవం దక్కింది.

యాహ్యా ‘హారెమ్’ కాబినెట్లో తరానా అనే ఆమెను ‘మినిస్టర్ ఆఫ్ సప్లయిస్ అండ్ స్టోర్స్’ (అంటే యాహ్యాకు మందు, మగువలు సప్లయి చేయడమని అర్థంట) అని, నూర్జహాన్‌ను ‘మినిస్టర్ ఆఫ్ ఫారిన్ అండ్ కల్చరల్ ఎఫయిర్స్’ అనీ వ్యవహరించేవారు. యాహ్యాఖాన్ 1971లో గద్దె దిగి భుట్టో పదవిలోకి వచ్చాక ‘పాకిస్తాన్‌ను నాశనం చేసిన స్త్రీలు వీరే’ అంటూ 1973లో పార్లమెంటులో చర్చ జరిగింది. పత్రికల్లో వార్తలు ప్రచురించబడ్డాయి. యాహ్యాకు అతి సన్నితంగా మెలిగిన బేగం అక్లీం అఖ్తర్ రాణి (ఆమె నిక్‌నేమ్ ‘జనరల్ రాణి’) ఒక ఏడాది పాటు యాహ్యాను కంట్రోలు పెట్టానని చెప్పుకుంది. “ఇండియాతో యుద్ధం వద్దని, భుట్టోకు ప్రభుత్వం అప్పగించమనీ యాహ్యాకు చెప్పాను. కానీ అప్పటికే అతను నూర్జహాన్ మత్తులో పడ్డాడు. నా మాట వినలేదు.’’ అని ప్రకటించింది.

‘‘అసలు నూర్జహాన్‌ను అతనికి పరిచయం చేసింది నేనే. నూర్జహాన్ పాటలు విని యాహ్యా ముగ్ధుడై ఆ అమ్మాయిని చూస్తానన్నాడు. ‘అది ఆడది కాదు. అరడజను మంది మగాళ్లను హరాయించుకున్న మహమ్మారి’ అని చెప్పాను నేను. కానీ అతను వినలేదు. మిలటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ జనరల్ ఉమ్మర్ ఇంట్లో పార్టీకి నూర్జహాన్ పాట కచ్చేరీ ఏర్పాటు చేశాను. 5,000/- రొక్కంగా ఇచ్చి మరో 5,000/- నగల రూపంలో ముట్ట చెప్పాను. పాట విని యాహ్యా మైమరచి పోయాడు. ఇద్దరూ ఓ గదిలోకి వెళ్లి 5 గంటల తర్వాత గానీ బయటకు రాలేదు. ఇక అప్పణ్నుంచి నూర్జహాన్‌ను పట్టుకోలేక పోయాం.” అని పత్రికలకు చెప్పింది జనరల్ రాణి. నూర్జహాన్ నడిగితే “గదిలోకి లాక్కెళ్లిన మాట నిజం. ఆ పైన ఏమీ జరగలేదు. అతను తప్పతాగి ఉన్నాడు. పైగా నేను అలాటి దాన్ని కాను” అని ప్రకటన ఇచ్చింది.

నూర్జహాన్ ఏం చెప్పుకున్నా, ఆమె యాహ్యాను వేళ్లపై ఆడించిందని పాక్ రేడియో న్యూస్ బ్రాడ్‌కాస్టర్ తన ఆత్మకథలో రాశాడు. 1971లో భారత్‌తో యుద్ధం జరిగే సమయంలో కరాచీ రేడియో స్టేషన్ దేశభక్తి గీతాలు ప్రసారం చేస్తూండేది. లండన్ నుంచి లాహోర్ వెళుతున్న నూర్జహాన్ కరాచీలో ఆగుతోందని విని, కరాచీ రేడియో స్టేషన్ డైరక్టర్ ఆమెను పిలిపించి మూడు పాటలు పాడించాడు. రికార్డింగు అయిపోయాక నూర్జహాన్ స్టేషన్ డైరక్టరుతో ‘యాహ్యా ఖాన్‌కి లైను కలుపు’ అంది. యాహ్యా దేశాధ్యక్షుడు. ఆయనకి డైరక్టుగా ఫోన్ చేయడమంటే మాటలా? అతను నీళ్లు నమిలితే, నూర్జహాన్ తనే ఫోన్ చేసి అవతల యాహ్యా లైనులోకి రాగానే ‘డార్లింగ్, నేను మూడు పాటలు పాడాను. రాత్రి 8 గంటలకు బ్రాడ్‌కాస్ట్ చేస్తారు. విను.’ అని చెప్పి, ఫోన్ పెట్టేసింది.

బ్రాడ్‌కాస్ట్ ఎప్పుడు చేయాలో రేడియో వాళ్లు యింకా ఆలోచించు కోలేదు. నూర్జహానే డిసైడ్ చేసేసింది. పైగా రాత్రి 8 గంటలంటే వార్తలు వినిపించే సమయం. కుదరదంటే యీవిడ ఏం చేస్తుందో, ఏం చేయిస్తుందో తెలియదు. వెంటనే నూర్జహాన్‌ను పక్క రూముకి పంపించి, డైరక్టరు జనరల్‌తో మాట్లాడాడు. ఆయన నేను చూసుకుంటానులే అని హామీ యిచ్చి, యాహ్యా సెక్రటరీతో మాట్లాడి, అవేళ రాత్రి 8 గం.ల న్యూస్ కాగానే యీమె పాటలు బ్రాడ్‌కాస్ట్ అయ్యేలా ఏర్పాటు చేశాడు. నూర్జహాన్ డిక్లేర్ చేసిన సమయం 15 ని.లు తప్పిందంతే! ఇదీ యాహ్యా హయాంలో నూర్జహాన్ మాట చెల్లించుకున్న తీరు! ఇలాటివన్నీ అంతర్గతంగానే ఉండిపోయేవేమో. కానీ జనరల్ రాణి బహిరంగ ప్రచారం వల్ల నూర్జహాన్ విహహం భగ్నమయింది. రెండో వివాహం ద్వారా ముగ్గురు పిల్లలు పుట్టినా భర్త విడాకులు కోరాడు. ఈ విధంగా రాజుతో స్నేహం మొగుణ్ని దూరం చేసింది.

ఇన్ని వివాదాల్లో చిక్కుకుని, అప్రదిష్ఠ పాలయినా నూర్జహాన్ గాయనిగా తన స్థానాన్ని కాపాడుకోగలిగింది. అదీ నూర్జహాన్ టేలంట్! భారతీయ సినిమా స్వర్ణోత్సవాల సందర్భంగా 1982లో భారత్ వస్తే ఆమెకు సినీ అభిమానులు జేజేలు పలికారు. ప్రధాని ఇందిరా గాంధీని కలిశాక, బొంబాయిలో తన సత్కారసభకు హాజరైంది. తన పాత మిత్రులందరినీ కలిసి, కన్నీళ్లు పెట్టుకుంది. తన స్నేహితురాలు లతాను కలిసి ముచ్చట్లాడింది. మళ్లీ పాకిస్తాన్ వెళ్లి పాటలు పాడడం కొనసాగించింది. అనారోగ్యంతో తన 74వ ఏట 2000 సం.రం.లో మరణించింది. ఇక లతా నూర్జహాన్ గురించి చెప్పిన విషయానికి వస్తే, నూర్జహాన్ నటగాయని, నేను నేపథ్యగాయనిని కాబట్టి నాతో పోల్చడానికి వీల్లేదని ఆమె అన్నది 1947 నాటికి యథార్థం. కానీ 1961 నుంచి నూర్జహాన్ నేపథ్యగాయనిగా మారిందని మనం గుర్తిస్తే, ఆమె భారతదేశంలోనే ఉండి ఉంటే లతాకు గట్టి పోటీ యిచ్చేదని కచ్చితంగా చెప్పవచ్చు. (ఫోటో – నూర్జహాన్, యాహ్యాతో ఒక విందులో, లతాతో)

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2024)

[email protected]

 

11 Replies to “ఎమ్బీయస్‍: నూర్జహాన్ – లతా”

  1. ఆమె ఇక్కడే ఉండిఉంటే లతాజీ కి పోటీ ఇచ్చేదో లేదో కానీ, గ్యారంటి గా ఇక్కడే ఆనాటి రాజకీయాల్లో ప్రముఖులైన ఎవరో ఒక పెద్ద తలకాయని పడేసి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేసేది.

  2. ప్రసాద్ గారూ – మీరు లతా గురించి ఒక సిరీస్ రాస్తానని సి. రామచంద్ర అర్టికల్ లో ఒకసారి అన్నారు. దయచేసి మొదలుపెట్టండి. I remember you mentioning that article as a curtain raiser for Lata’s series.

Comments are closed.