బెట్టింగ్ యాప్… గొంగ‌ట్లో కూర్చుని వెంట్రుక‌లు ఏర‌డ‌మా?

ఇప్పుడు ఇల్లీగ‌ల్ బెట్టింగ్ యాప్స్ పై చ‌ర్య‌లు అంటే అభినందిస్తూ.. మ‌రి లీగ‌ల్ బెట్టింగ్ యాప్స్ దేశం కోసం, ధ‌ర్మం కోసం ప‌నిచేస్తున్నాయా లేక దేశంలో సంప‌ద‌ను సృష్టిస్తున్నాయా?

ఇల్లీగ‌ల్ బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోట‌ర్స్ పై చ‌ర్య‌లు అని ఒక‌వైపు వార్త‌లు వ‌స్తూ ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ అనేక మంది జీవితాల‌ను ఛిద్రం చేశాయ‌ని.. వాటిని ప్ర‌మోట్ చేస్తున్న యూట్యూబ‌ర్లు, మినీ సైజ్ సెల‌బ్రిటీల‌పై చ‌ర్య‌లు, కేసులు అనే వార్త‌లు వ‌స్తూ ఉన్నాయి. మ‌రి ఇవి ఎంత వ‌ర‌కూ వెళ్తాయ‌నే సంగ‌తిని ప‌క్క‌న పెడితే, అస‌లు బెట్టింగ్ యాప్స్ ఇప్ప‌టికే చొచ్చుకుని పోయిన వైనం గురించి జ‌ర‌గాల్సిన అస‌లు చ‌ర్చ ఎందుకు జ‌ర‌గ‌డం లేద‌నేది ప్ర‌శ్న‌! ఈ అంశంపై ఆరు సంవ‌త్స‌రాల క్రిత‌మే గ్రేట్ ఆంధ్ర ఒక కూలంక‌ష‌మైన క‌థ‌నాన్ని ఇచ్చింది. బెట్టింగ్ యాప్స్ యువ‌కుల జీవితాల‌ను ఎలా ఛిద్రం చేస్తున్నాయో అప్ప‌ట్లోనే చ‌ర్చించింది. ఫ్యాంట‌సీ లీగ్ లు, డ్రీమ్ లీగ్ ల పేర్ల‌తో వ‌చ్చిన మొబైల్ అప్లికేష‌న్లు యువ‌కుల‌ను బెట్టింగ్ కూపంలోకి ఎలా లాగుతున్నాయో, అవి ఎలాంటి ప‌ర్య‌వ‌స‌నాల‌కు కార‌ణం అవుతున్నాయో గ్రేట్ ఆంధ్ర మొట్ట మొద‌టే విశ్లేషించింది.

చాలా గ్లామ‌ర‌స్ గా యువ‌త‌ను బెట్టింగ్ వైపుకు తీసుకెళ్తున్నాయి ఈ యాప్స్ అన్నీ. అవి ఇన్ స్టాల్ చేసుకోగానే.. మీ క్రికెట్ ప్రావీణ్యానికి ప‌రీక్ష అన్న‌ట్టుగా మొద‌ల‌వుతుంది వ్య‌వ‌హారం. ఇండియాలో క్రికెట్ పిచ్చి ఎంత ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ క్రికెట్ ను కొన్ని సంవ‌త్స‌రాల పాటు చూసినా ఏ యువ‌కుడిని అడిగినా.. చాలా విశ్లేష‌ణ‌ల‌ను చెబుతాడు. ఏ ఆట‌గాడి సామ‌ర్థ్యం ఎంత‌, ఏ జ‌ట్టు సామ‌ర్థ్యం ఎంత‌, అంటూ మొద‌లుపెడితే.. ఏ క్రికెట్ స్టేడియంలో పిచ్ ల‌క్ష‌ణాలు ఏమో కూడా ఇట్టే చెప్పేస్తారు! ఆ ప్రావీణ్యంలో ఒక‌రిని మించిన వారు మ‌రొక‌రు అన్న‌ట్టుగానే ఉంటుంది క్రికెట్ ఫ్యాన్స్ ప‌రిస్థితి. ఇలా క్రికెట్ ను విప‌రీతంగా ఆరాధించే వాళ్ల‌ను ఫాంట‌సీ లీగ్ లు, డ్రీమ్ లీగ్ లు బాగా ఆక‌ర్షిస్తాయి.

తమ‌కు క్రికెట్ గురించి ఎంతో తెలుసు కాబ‌ట్టి.. మ్యాచ్ జ‌రిగే ముందు ఒక జ‌ట్టును ఎంపిక చేసేసి, డ‌బ్బులు పెడితే.. అయాచితంగా డ‌బ్బులు వ‌చ్చి ప‌డ‌తాయ‌ని యువ‌త ఆలోచించ‌డం, అలా జ‌ట్టును ఎంపిక‌లు చేసేసి డ‌బ్బులు పెట్ట‌డం.. దాంట్లో సంపాదించినా, పోగొట్టుకున్నా.. ఆ పిచ్చి ముదిరిపోయి ఐపీఎల్ సీజ‌న్లో ఈ ఆన్ లైన్ బెట్టింగ్ ల‌తో మొద‌లుపెడితే, ఈ పిచ్చి ముదిరి ఆఫ్ లైన్ బెట్టింగ్ లో కూరుకుపోయి.. అప్పుల పాలైపోయి, సొంతిళ్ల‌లోనే దొంగ‌త‌నాలు చేసి, త‌ల్లిదండ్రుల‌ను మోసం చేసి, చివ‌ర‌కు అన్ని ర‌కాలుగానూ ప‌రువు పోగొట్టుకుని ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారు తెలుగునాట‌. ఈ ప‌రిస్థితి గురించి.. బెట్టింగ్ యాప్స్ ఎలా యువ‌త‌ను నాశ‌నం చేస్తున్నాయో వివ‌రిస్తూ ఆరేళ్ల కింద‌టే గ్రేట్ ఆంధ్ర క‌థ‌నాన్ని ఇచ్చింది.

వ‌ర్త‌మానంలోకి వ‌స్తే..ఇప్పుడు లీగ‌ల్ బెట్టింగ్ యాప్స్, ఇల్లీగ‌ల్ బెట్టింగ్ యాప్స్ అంటూ మాట్లాడుతున్నారు! బెట్టింగ్ అన్నాకా లీగ‌ల్ ఏమిటో, ఇల్లీగ‌ల్ ఏమిటో.. అర్థం కావ‌డం లేదు. అంటే బెట్టింగ్ పై ఉన్న జీఎస్టీల‌ను ప‌క్క‌గా చెల్లించేవి లీగ‌ల్ బెట్టింగ్ యాప్ లు, జీఎస్టీల పరిధిని త‌ప్పించుకునేవి ఇల్లీగ‌ల్ బెట్టింగ్ యాప్స్ కాబోలు! అయితే.. అస‌లు లీగ‌ల్ అనుకునేవే పెద్ద కూపం! లీగ‌ల్ బెట్టింగ్ యాప్ లే స‌మాజాన్ని నాశ‌నం చేస్తూ ఉన్నాయి. యువ‌త‌ను ప‌క్క‌దోవ ప‌ట్టిస్తూ ఉన్నాయి. మిమ్మ‌ల్ని కోటీశ్వ‌రులు చేస్తామ‌ని అవి యువ‌త చేత బెట్టింగులు ఆడిస్తూ ఉన్నాయి. ఏదో ఒక‌రోజు కోటి కొట్ట‌క‌పోమా.. అంటూ ల‌క్ష‌ల‌మంది వాటిల్లో డబ్బులు పెడుతున్నారు. ఉద్యోగాలు చేసే వాళ్లు, నిరుద్యోగులు, విద్యార్థులు తేడా లేకుండా.. ఈ యాప్స్ లో డబ్బులు పెడుతున్నారు. ఐపీఎల్ సీజ‌న్ల‌లో అయితే.. ఉద‌యం నుంచి ఇదే గోల‌. ఒక జిల్లా కేంద్రం, ప‌ట్ట‌ణ కేంద్రం .. ఏదైనా షాపుల్లోకి వెళ్లి చూస్తే.. అక్క‌డ ప‌ని చేసే చిరుజీత‌గాళ్లు ఈ రోజు ఏ టీమ్ గెలుస్తుందంటావ్.. అంటూ విశ్లేష‌ణ‌లు ఇదేం ఆట‌పై ప్రేమ‌తో కాదు, డ‌బ్బులు పెట్ట‌డానికి జ‌రిగే చ‌ర్చ ఇది! ఈ లీగ‌ల్ బెట్టింగ్ యాప్స్ గురించి ఎంతైనా చెప్పుకోవ‌చ్చు. వీటికి మ‌హామ‌హులు ప్ర‌మోట‌ర్లుగా ఉన్నారు.

అస‌లు టీమిండియా అఫిషియ‌ల్ స్పాన్స‌రే డ్రీమ్ లెవ‌న్. ఇది ఒక బెట్టింగ్ త‌ర‌హా యాపే అని, ఇది ఎలా ఐపీఎల్ కో, టీమిండియాకో స్పాన్స‌ర్ అవుతుందంటూ ఒక వ్య‌క్తి కొన్ని సంవ‌త్స‌రాల క్రిత‌మే బాంబే హైకోర్టులో ఒక పిల్ దాఖ‌లు చేశాడు. అయితే ఆ పిల్ కొట్టివేత‌కు గురైంది. డ్రీమ్ లెవ‌న్ వ్య‌వ‌హారాన్ని న‌డిపించే తీరును బ‌ట్టి ఇది ఒక బెట్టింగ్ యాప్ కింద‌ట రాద‌ట‌! ఒక జ‌ట్టు గెలుస్తుందంటూ బెట్ కడితే అది బెట్టింగ్ అవుతుంది కానీ, యూజ‌రే ఇరు జ‌ట్ల‌లోని 11 మంది ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసి.. ఒక వ‌ర్చువ‌ల్ జ‌ట్టును తయారు చేసుకుంటే అది బెట్టింగ్ కాద‌ట‌! ఇది స్కిల్ గేమ్ అవుతుంద‌ట‌! అలాగంటే పేక‌ట కూడా స్కిల్ -లాజిక్ ల‌లో కూడిన గేమే కదా! అదెందుకు చ‌ట్ట వ్య‌తిరేకం అయ్యిందో మ‌రి. ఏ రాయి అయితే ప‌ళ్లూడ‌గొట్టుకోవ‌డానికి అన్న‌ట్టుగా.. ఒక జ‌ట్టుపై బెట్ క‌డితే ఏముంది? ఇలా ఆట‌గాళ్ల‌ను క‌ల‌గ‌లిపి డ‌బ్బులు క‌డితే ఏముంది? పోయేదైతే డ‌బ్బులే క‌దా!

అయితే బెట్టింగ్ యాప్స్ కేంద్ర ప్ర‌భుత్వానికి కావాల్సినంత జీఎస్టీని క‌డుతూ ఉన్నాయి. దేశ ప్ర‌గ‌తికి ఇంత‌క‌న్నా ఏం కావాలి? అందులోనూ.. బెట్టింగ్ ల‌పై ట్యాక్స్ ఎక్కువ‌! ఒక లెక్క ప్ర‌కారం.. ప్ర‌స్తుతం దేశంలో ఈ ఫ్యాంటసీ లీగ్, డ్రీమ్ టీమ్ ల యాప్ ల ద్వారా వేల కోట్ల రూపాయ‌లు చేతులు మారుతూ ఉన్నాయి. ఒక ఏడాదిలో వీటి ద్వారా జ‌రుగుతున్న ట్రాన్సాక్ష‌న్లు ఏకంగా 11 వేల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఉన్నాయ‌ట‌! ఇవ‌న్నీ అధికారిక బెట్టింగ్ యాప్స్.. అదే, డ్రీమ్ లీగ్ లు, ఫ్యాంట‌సీ లీగ్ ల యాప్ ల ద్వారా జ‌రుగుతున్న‌వే! 11 వేల కోట్ల రూపాయ‌లు అంటే.. ఈ మొత్తంలో అటు పెట్టిన వాడికి, ఇటు గెలిచిన వాడికి ఇద్ద‌రి నుంచి ప్ర‌భుత్వానికి ట్యాక్సుల ద్వారా ఆదాయం స‌మ‌కూరుతున్న‌ట్టే! జీఎస్టీ క‌డితే.. ఏం చేసుకున్నా ఫ‌ర్వాలేదు క‌దా!

ఈ యాప్ ల ప్ర‌మోష‌న్ కు పెద్ద పెద్ద వాళ్లు ఉన్నారు. క‌పిల్ దేవ్ తో మొద‌లుపెడితే, సౌర‌వ్ గంగూలీ, ధోనీ… ఇలా మాజీ లెజెండ‌రీ ప్లేయ‌ర్లు కూడా త‌లా ఒక డ్రీమ్ లీగ్, ఫ్యాంట‌సీ లీగ్ యాప్ ల‌ను ప్ర‌మోట్ చేస్తూ ఉన్నారు. అందేమంటే అంతా చ‌ట్ట‌రీత్య‌మైన వ్యాపార‌మే క‌దా! అస‌లు బీసీసీఐ కే ఒక ఫ్యాంట‌సీ లీగ్ ప్ర‌మోట‌ర్ అయిన‌ప్పుడు
ఇక మాజీ ఆట‌గాళ్ల‌ది ఏముంది?

2023 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌రుగుతున్న‌ప్పుడు ఒక అమెరిక‌న్ నాతో క్రికెట్ గురించి చ‌ర్చిస్తూ.. టీమిండియా జెర్సీపై డ్రీమ్ 11 అని రాసుండ‌టాన్ని ప్ర‌స్తావిస్తూ.. మీ వాళ్లు చాలా గ్రేట్ 2011లో ఇండియా క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచింది కాబ‌ట్టి.. ఆ డ్రీమ్ మ‌రోసారి ఫుల్ ఫిల్ కావ‌డానికి డ్రీమ్ 11 అని రాసుకుని బ‌రిలోకి దిగింది క‌దా! అంటూ చెప్పుకుపోయాడు! అయ్యా బాబూ.. అంత సీనేమీ లేదు. డ్రీమ్ 11 అనేది ఒక ఫ్యాంట‌సీ లీగ్ అప్లికేష‌ను, అది టీమిండియా కు స్పాన్స‌రు.. అందులో ఆర్థిక లావాదేవీలే ఉన్నాయి త‌ప్ప 2011 విజ‌యానికీ ఈ డ్రీమ్ 11కూ సంబంధం లేద‌ని వివ‌రించాల్సి వ‌చ్చింది! అమెరిక‌న్ల‌కు క్రికెట్ గురించి తెలిసింది అంతంత‌మాత్రం కాబ‌ట్టి… ఏదో డ్రీమ్ 11 అని చూసి 2011లో ఇండియా గెలిచేయ‌డం వ‌ల్ల డ్రీమ్ 11 అంటూ బీసీసీఐ స్ఫూర్తిని తీసుకుంది కాబోలు, అదో నినాదం అనుకుని ఆ అమెరిక‌న్ పొర‌బ‌డ్డాడు! అయితే బీసీసీఐ వ్యాపారం ఎలా ఉంటుందో వారికి అంత తేలిక‌గా అర్థం ఎలా అవుతుంది!

పేరెత్తితే మ‌న‌ది జాతీయ వాదం, స‌నాత‌న వాదం. రాజ‌కీయ ప్ర‌యోజనాల కోసం ఎన్నో ముచ్చ‌ట్లు, వాట్సాప్ యూనివ‌ర్సిటీలో అయితే వీటికి హ‌ద్దే లేదు! నైతిక‌త‌, స‌నాత‌నం, దేశం, ధ‌ర్మం అంటూ ఇలాంటి టైంపాస్ ముచ్చ‌ట్లు వీటితో పొలిటిక‌ల్ ఎమోష‌న్లు వీటికి లోటు ఉండ‌దు! అయితే మ‌న దేశ అధికారిక జ‌ట్టును, మ‌నం ఎన్నో భావోద్వేగాల‌ను ముడిపెట్టుకున్న జ‌ట్టును స్పాన్స‌ర్ చేసేది ఒక ఫ్యాంట‌సీ లీగ్ యాప్! అయితే ఇలాంటి విష‌యాల్లో స‌నాత‌నం గుర్తుకు రాదు, ధ‌ర్మం వంటివి రావు! మ‌ళ్లీ బీసీసీఐ ఎవ‌రి అదుపాజ్ఞాన‌ల్లో ఉన్న‌దీ అంద‌రికీ ఎరుకే!

ఫ్యాంట‌సీ లీగ్ ల్లోనూ, డ్రీమ్ లీగుల్లోనూ డ‌బ్బులు పెడుతూ కొన్ని ల‌క్ష‌ల మంది డ‌బ్బులు పొగొట్టుకుని ఒళ్లు గుళ్ల చేసుకుంటున్నారు. అదో వ్య‌స‌నం. స‌ర్వ వ్య‌స‌నాలూ స‌నాత‌నం ప్ర‌కారం త‌ప్పుకాదా? యువ‌త‌రాన్ని ఇలాంటి అప్లికేష‌న్లు బెట్టింగ్ ల వైపు దారి మ‌ళ్లిస్తున్నాయి. ఫ్యాంట‌సీ లీగ్ ల‌తో మొద‌ల‌య్యే బెట్టింగులు అక్క‌డితో ఆగ‌డం లేదు, అవి ముదిరి పాకాన ప‌డి జీవితాల‌నే దెబ్బ‌తీస్తున్నాయి.. ఐపీఎల్ సీజ‌న్ అనేది అలాంటి బెట్టింగ్ ఆగ‌డాల‌కు అడ్డాగా మారింది అని ఎవ‌రు నెత్తినోరు మోదుకున్నా ఉప‌యోగం అయితే క‌నప‌డ‌టం లేదు. ఇలా చెబితే, అబ్బే బెట్టింగుల ద్వారా ప్ర‌జ‌ల‌ను ప్ర‌భుత్వాలు కోటీశ్వ‌రుల‌ను చేస్తున్నాయి, ప్ర‌జా ప్ర‌భుత్వాల నిర్వ‌హ‌ణ బెట్టింగుల ద్వారా జీఎస్టీల‌ను స‌మ‌కూర్చుకుంటున్నాయి అని వాదించ‌గ‌ల‌రు వాట్సాప్ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్లు!

15 యేళ్ల‌ కిందటి వ‌ర‌కూ ఏ ఆస్ట్రేలియాలోనో క్రికెట్ మ్యాచ్ లు జ‌రిగితే.. బెట్ 365 వంటి వెబ్ సైట్ లు ఫోర్ లైన్లో ఉండే హోర్డింగుల వ‌ద్ద క‌నిపించేవి. ఇవేం దేశాలు రా బాబూ.. బెట్టింగ్ ను అంత నిర్ల‌జ్జ గా ప్ర‌మోట్ చేస్తూ ఉన్నారు, మ‌న దేశంలో చూడు.. బెట్టింగ్ అలా అఫియ‌ల్ అయ్యే ఛాన్సులు ఉండ‌వు. దాని వ‌ల్ల జ‌రిగే న‌ష్టం ఉండ‌దు అని నాబోటి వాడు మ‌న‌సులోనే అనుకునే వాడు. అయితే అదే త‌ర‌హా కంపెనీలు ఇప్పుడు ఇండియ‌న్ క్రికెట్ ను ఆడిస్తున్నాయి. తామే అఫిషియ‌ల్ అయిపోతున్నాయి. అంతా చ‌ట్ట‌బ‌ద్ధం అయిపోయింది. ఇప్పుడు ఇల్లీగ‌ల్ బెట్టింగ్ యాప్స్ పై చ‌ర్య‌లు అంటే అభినందిస్తూ.. మ‌రి లీగ‌ల్ బెట్టింగ్ యాప్స్ దేశం కోసం, ధ‌ర్మం కోసం ప‌నిచేస్తున్నాయా లేక దేశంలో సంప‌ద‌ను సృష్టిస్తున్నాయా? అనే ప్ర‌శ్న‌కు కూడా ప్ర‌భుత్వాలు స‌మాధానం ఇస్తే సంతోషం!

-జీవ‌న్ రెడ్డి. బి

14 Replies to “బెట్టింగ్ యాప్… గొంగ‌ట్లో కూర్చుని వెంట్రుక‌లు ఏర‌డ‌మా?”

  1. sir ఇవన్ని మనం ఆపలేము ఒక వేల యప్ప్ లో లేక పోతే ఇద్ధ్హరు ఒక దాభ లో కోర్ర్చోని నేను ఇండియా ని ఇంకొకడు ఇంగ్లాండ్ అని లక్ష కాస్తారు ఒక పేపర్ లో అగ్రిమెంట్ ఉంటుంది అప్పుడు ఏమి చేస్తారు ఇక క్రికెట్ ఒకక్తెన కోడి పందేలు రాజకీయ బెట్టింగ్ లు మన ఎన్నికల్లో పసుపు మీద నీలం మీద తుకువ పందేలు కాదు అదొక్కటేనా పవన్ లోకేష్ మెజారిటీ ల మీద కూడా కాశారు అవి ఎవరు ప్రమోట్ చేత్సే చేసారు చెప్పండి .ఒకటి కనీసం కాసే పందెం లో అయిన నిజాయితీ గా చెల్లింపులు చేసి జి ఎస్ టీ లాంటి వి కట్టించు కొని ఆడిస్తే మంచిది .మధ్య నిశేధం అని పెడితే కల్తీ మద్యం తగగుతారు . అవి ఆపలేని మనం కనీసం నాన్య మయిన మదయం అయినా అమ్మాలి మనోలు ఎలాంటి మద్యం ఈ అయిదేళ్ళు అమ్మిన్చారో కళ్ళారా చూసాం సో లేగాలిజే చెయ్యండి అప్పుడే మంచిది సిగరెట్ ఐ టీ సీ అమ్ముతుంది పొగాకు పనడిచ్చి మనవాళ్ళు రీతులు బతుకుతున్నారు మరి సిగరెట్ మదయం ఎంత అమంది జీవితాలు పాడు చస్తాయి లెక్కలు తేల్చండి

  2. Dream 11, ముందు దాని పేరు మార్చాలి, అది మా అన్న కష్టార్జితం and registered trademark.

  3. మరి కోడి పన్దాలు ఊళ్ళో కో తా ఆటలు పేకాట అన్ని ఆపగలమా ?? మధ్య నిషేధం అని అన్నగారు అన్నారు చివరికి ఏమయింది మరి యాప్ లేక పోతే ఒక పాక లో కూర్చొని ఒకడు ముంబయి ఇంకొకడు చెన్నయి కి వేస్తారు అప్పుడు ఎమ్మి చేతసాం దాని నదులు లీగల్ చేసి దేలిచిన వాణ్ణి మోసం చెయ్య కుండ ప్రభుత్వాలు చేత్శే అది బెటర్ మరి సిగరెట్ కూడా అంతే గా దాని వాళ్ళ లక్షల్లో టాక్స్ వస్తాయి అది ఆపరెం మరి . రాజకీయ పార్టీ లా మేధా గెలుపు ఓటమి మీద మెజారిటీ లా మీద అన్నిటి మీద బెత చేత్శారు

  4. ఎక్కువ మంది వినోదం పొందుతారు కొంత మంది హద్దులు లేకుండా వెళతారు వాళ్ళ గురించి చట్టాలు చేయడం అనవసరం వాళ్ళను దృష్టిలో పెట్టుకొని బాన్ చేయడం తప్పు

Comments are closed.