బాబు సింగపూర్‌ టూర్‌ సీక్రెట్‌ ఏంటి?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు సింగపూర్‌ టూర్‌ పెట్టుకున్నారు.? మొన్న సార్వత్రిక ఎన్నికలకు ముందు సింగపూర్‌ పేరు తెలుగునాట మార్మోగిపోయింది ఎందుకు..? చంద్రబాబు ఎక్కడ ఎన్నికల ప్రసంగం చేసినా సింగపూర్‌ సింగపూర్‌ ప్రస్తావన ఎందుకు…

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు సింగపూర్‌ టూర్‌ పెట్టుకున్నారు.? మొన్న సార్వత్రిక ఎన్నికలకు ముందు సింగపూర్‌ పేరు తెలుగునాట మార్మోగిపోయింది ఎందుకు..? చంద్రబాబు ఎక్కడ ఎన్నికల ప్రసంగం చేసినా సింగపూర్‌ సింగపూర్‌ ప్రస్తావన ఎందుకు తెచ్చేవారు? అనాధబిడ్డలా వదిలేసిన ఆంధ్రదేశాన్ని మరో సింగపూర్‌ చేస్తానని ప్రతి ఎన్నికల సభలో బాబు చెప్పడం వెనుక రీజన్‌ ఏంటి.? ఇప్పుడు బాబు సరే, ఇంతకుముందు తెలంగాణ సీయం కేసీఆర్‌ కూడా సింగపూర్‌ వెళ్లొచ్చారు. దేనికోసం ? అసలెందుకు అందరూ సింగపూర్‌ పేరు కలవరిస్తున్నారు..? 

ఇన్ని ప్రశ్నలకు ఆన్సర్‌ చెప్పాలంటే ఒక స్టోరీ చెప్పాలి. అదే సింగపూర్‌ సక్సెస్‌ స్టోరీ. 55 ఏళ్ల నిరంతర శ్రమ, పాలకులు ముందుచూపు, దేశాభివృద్ధి పట్ల కమిట్‌మెంట్‌ ఇవన్నీ ఈ స్టోరీలో వున్నాయి. ఒకనాడు రోగాలతో విలవిలలాడిన దేశం ఇప్పుడు భోగాలతో ఎలా విలసిల్లుతుందో తెలియాలంటే మనం సింగపూర్‌ సంగతేంటో తెలుసుకోవాల్సిందే. ఒకనాడు సామాన్యదేశంగా వున్న దేశం ఇవాళ సంపన్న దేశంగా మారిందంటే సింగపూర్‌ సీక్రెట్‌ ఏంటో కనిపెట్టాల్సిందే. 

ప్రపంచంలో ఇన్ని దేశాలుంటే చంద్రబాబు సింగపూర్‌ పేరే ఎందుకు చెప్పాల్సివచ్చింది. అభివృద్ధి చెందిన దేశాలు మరి లేవా.? బాబుకు, లేదా కేసీఆర్‌కు సింగపూరే ఎందుకు నచ్చిందంటే, సముద్రంలో సౌధాలు నిర్మించిన ఘనత ఆ దేశానిది. 

గ్రేటర్‌ హైదరాబాద్‌ అంత విస్తీర్ణంలో వుండే ఈ సింగపూర్‌ ఇవాళ అనేక ప్రాంతాలకు ఆదర్శంగా మారిందంటే దాని వెనుక అద్భుతమైన కృషి ఉంది. 1959కి ముందు పేదరికంతో సతమతమైన ఈ ప్రాంతం ఇప్పుడు అనేక దేశాలకు ఆర్థిక, సాంకేతిక సహకారం అందించేస్థాయికి  ఎదిగిందంటే దాని వెనుక అక్కడి పాలకుల నిరంతర శ్రమ దాగి వుంది. 

యూకే, ఫ్రాన్స్‌, యూఎస్‌ తదితర పశ్చిమదేశాలలో అభివృద్ధి కొన్ని వందల ఏళ్ల క్రితమే జరిగింది కాబట్టి అవి ముందంజలో వుండటం సహజం. కానీ, నిన్న మొన్నటి వరకూ ఒక వెనుకబడిన దేశంగా వున్న సింగపూర్‌ స్వల్పకాలంలోనే పశ్చిమదేశాలను అధిగమించి అభివృద్ధి సాధించింది. 

వెనుకబడిన దేశాలు ఎప్పటికీ వెనుకబడిన దేశాలుగానే వుండనక్కర్లేదు. సరిగ్గా కృషిచేస్తే వెనుకబడిన దేశాలు కూడా, అభివృద్ధి  చెందిన దేశాలను తలదన్నేలా ముందంజ వేస్తాయనడానికి సింగపూరే ఎగ్జాంపుల్‌. 

ఒకనాడు సామాన్యదేశంగా వున్న సింగపూర్‌ ఇప్పుడు సంపన్న దేశం. 1965లో మలేసియా నుంచి వేరుపడినప్పుడు సింగపూర్‌ తలసరి ఆదాయం కేవలం 516 డాలర్లు. 2010 నాటికి అది 56,532 డాలర్లకు పెరిగింది. 

ఒకప్పుడు బ్రిటీష్‌ వలస ప్రాంతం ఇది. ఇప్పుడు చూస్తే సింగపూర్‌ జీడీపీ 1963 తర్వాత 80రెట్లు పెరిగి ప్రస్తుతం తలసరి ఆదాయంలో బ్రిటన్‌ను మించిపోయింది. 

అంతేకాదు, స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో ఈ సింగపూర్‌ నిరుద్యోగ సమస్యతో అల్లాడేది. 14శాతమే ఉద్యోగ అవకాశాలు వుండేవి. మరిప్పుడు ఈ దేశంలో పౌరులందరికీ సంపూర్ణ ఉపాధి దక్కింది. 

అప్పట్లో ఈ దేశంలో మూడోవంతు జనాభా మురికివాడల్లో దుర్భర పేదరికంలో మగ్గిపోయేది. ఇప్పుడు 80శాతం సింగపూర్‌ ప్రజానీకం ప్రభుత్వ నిర్మిత గృహాల్లో ప్రైవేట్‌ యాజమాన్య హక్కులతో జీవిస్తూ ఎగువ, మధ్యతరగతి స్థాయికి ఎదిగారు. మిగిలిన 20శాతంమంది ఇక్కడ  సంపన్నులు. అంటే నిరుపేదలెవరూ లేరన్నమాట! 

వేల ఎకరాలు మింగేసే భూ బకాసురులు మన దగ్గరుంటే సాగరాన్ని పూడ్చి సౌధాలు నిర్మించిన మేదావులు సింగపూర్‌లో వున్నారు. 640 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన సింగపూర్‌ 50 లక్షల జనాభాతో కిటకిటలాడిపోతోందని సముద్రాన్ని పూడ్చేశారు వాళ్లు. ఆ విధంగా  నగర వైశాల్యాన్ని 700 చదరపు కిలోమీటర్లకు విస్తరించారు. భూమి సరిపోలేదని సముద్రంలోకి దూసుకెళ్లి  దాన్నే భూభాగంగా మార్చారంటే వారి తెలివితేటలకు హ్యాట్సాఫ్‌. 

సింగపూర్‌లో ఇంత అభివృద్ధికి బాటలు వేసినవారెవరూ అంటే లీ క్వాన్‌ యూ అని ఏకగ్రీవంగా ఒప్పుకోవాలి. 1959 నుంచి 1990 వరకూ అంటే మూడు దశాబ్దాలు పైబడి సింగపూర్‌కు ప్రధానమంత్రిగా పనిచేసిన లీ క్వాన్‌ యూ తన దీక్షా దక్షతలతో  ఆ దేశాన్ని భాగ్యసీమగా మార్చేశాడు. అభివృద్ధి అంతా ఏకవ్యక్తి పాలనలో, ఏకపార్టీ ఏలుబడిలోనే జరిగింది. పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీకి చెందిన లీ క్వాన్‌ను దార్శనికుడని ఇప్పుడంటే అనవచ్చు గానీ, అప్పట్లో ఆయన్ని నియంత అని తిట్టినవాళ్లూ వున్నారు. బ్రిటన్‌ పార్లమెంటరీ వ్యవస్థను అనుసరించే సింగపూర్‌ ఎందుకో మొదటి నుంచీ ఒకే ఒక పార్టీకి పగ్గాలప్పగిస్తూ వచ్చింది. బహుపార్టీల వ్యవస్థ వున్న ప్రజాస్వామ్య దేశంలో ఇది సాధ్యం కాకపోయినా నోటు` ఓట్లకు కాకుండా అభివృద్ధికే పట్టం గట్టే అక్కడి ప్రజావళిని చూసి మనం నేర్చుకోవాల్సింది చాలావుంది. 

సింగపూర్‌లోని పీఏపీ ప్రభుత్వం ప్రతిభనే ప్రాతిపదికగా తీసుకుని పనిచేసే అధికారులకే పెత్తనం ఇస్తుంది. నిపుణులైన శ్రామికులకే అవకాశాలు కల్పిస్తోంది. 

అందరికీ సమాన అవకాశాలు అనే లక్ష్యాన్ని ముందు  పెట్టుకుని పనిచేస్తున్న సింగపూర్‌ దేశం ముఖ్యంగా సామాజిక సామరస్యాన్ని కచ్చితంగా పాటిస్తుంది. అందుకే అక్కడ మలయ్‌,  చైనా, యూరోపియన్లు, ఇండియన్లు అందరూ వచ్చి చేరారు.

సింగపూర్‌ మరో విజయరహస్యం అక్కడ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా అత్యంత ఆధునిక మౌలిక వసతులను కల్పించడమే. ముఖ్యంగా చిన్నతరహా పరిశ్రమలకు సింగపూర్‌ సర్కార్‌ బాగా ఊతం ఇస్తోంది. 

అంతేకాదు, అక్కడి ప్రభుత్వం  పెట్టుబడిదారులను ఆకర్షించడానికి సింగిల్‌ విండో సిస్టమ్‌ను విజయవంతంగా అనుసరిస్తోంది. పరిశ్రమల స్థాపనలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఏకగవాక్ష విధానం సింగపూర్‌లో వుందని ప్రపంచబ్యాంక్‌ అభినందించిందంటే సింగపూర్‌ పాలకుల దక్షత అర్థం అవుతూనేవుంది. 

స్వేచ్ఛా వాణిజ్యం, స్వల్ప పన్నుల విధింపు, బిజినెస్‌ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్‌, అవినీతికి ఎక్కడా ఏ స్థాయిలో చోటుకల్పించకపోవడం, మేధోహక్కుల పరిరక్షణ.. ఇవన్నీ సింగపూర్‌ను గొప్ప అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు దోహదపడ్డాయి. ముఖ్యంగా మల్టీనేషనల్‌ కంపెనీలకు సింగపూర్‌ స్వర్గధామం. అమెరికా, ఐరోపా దేశాలకు చెందిన మూడువేలకు పైగా మల్టీనేషనల్‌ కంపెనీలు ఇక్కడున్నాయంటే వాటిని సింగపూర్‌ ఎంతగా ఆకట్టుకున్నదో అర్ధం అవుతుంది. అంతెందుకు ఐదువేలకు పైగా భారతీయ  కంపెనీల బోర్డులు  సింగపూర్‌లో మనకు కనిపిస్తాయి. 

పర్యావరణ హితం, సరళ పన్నుల విధానం సింగపూర్‌ వాసులు గర్వంగా చెప్పుకునే విశేషాంశాలు. ద్వీపాల్లో ఎక్కడ చూసినా వైఫై వంటి ఆధునాతన సదుపాయాల కల్పన, రేవుల అభివృద్ధి, వాన నీటి సంరక్షణ, వ్యర్థ జలాల్ని రీ సైక్లింగ్‌ చేయడం, హరిత భవనాల నిర్మాణం ఇవన్నీ సింగపూర్‌ ప్రతిష్టను శిఖరస్థాయికి తీసుకుపోయాయి. 

ఇన్ని విశేషాంశాలు వున్నాయి కాబట్టే చంద్రబాబు సింగపూర్‌ను ఒక నమూనాగా తీసుకున్నారు. చంద్రబాబే కాదు,  తెలంగాణ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు కూడా సింగపూర్‌లను ఇక్కడ సృష్టించడానికి కంకణం కట్టుకున్నాయి. ఒకరకంగా ఆంధ్రప్రదేశ్‌ను సింగపూర్‌తో పోల్చడానికి వీలయ్యే పరిస్థితులు వున్నాయి. మలేసియా నుంచి వేరయ్యి సింగపూర్‌ ఒంటరిపోరాటం చేసినట్టే తెలంగాణను వదులుకుని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ దిక్కులేని పక్షిగా మారింది. 

ముఖ్యంగా హైదరాబాద్‌లాంటి ప్రధాన ఆదాయ వనరును కోల్పోయి ఆర్థికంగా అయోమయ పరిస్థితుల్లో వున్న ఏపీకి చంద్రబాబుకు  కూడా సింగపూర్‌ తరహా శస్త్ర చికిత్స చేయాలనుకుంటున్నారు. ఏకగవాక్ష విధానం ద్వారా పరిశ్రమలకు ఊతం ఇవ్వడం, రేవు పట్టణాలను ఆధునీకరించి వాణిజ్యాన్ని ప్రోత్సహించడం, సహజసిద్దంగా  వున్న టూరిజం వనరుల ద్వారా ప్రపంచదేశాల్ని ఆకర్షించడం, ఇవన్నీ సింగపూర్‌తో పోల్చినప్పుడు కామన్‌ ప్లాట్‌ఫారాలు. మరీముఖ్యంగా సింగపూర్‌తో పోల్చినప్పుడు మనకున్న సుదీర్ఘమైన తీర ప్రాంతం మనకున్న అదనపు బలం, ఆకర్షణ. రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ పరుగులు తీస్తూ రాష్ట్రాన్ని ప్రగతిపట్టాలెక్కిస్తానని చెబుతున్న చంద్రబాబు సింగపూర్‌ స్ఫూర్తితో ఆ క్రమంలో విజయాన్ని సాధిస్తారని ఆశిద్దాం…

(దేశరాజు శ్రీనివాస్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌)