సినీ ‘పంచ్’ తంత్రం -2

“ఎక్క‌డున్నాం” అని అడిగాడు పాత ర‌చ‌యిత. “మీరు రెండో రౌండ్‌లో, నేను మీ కాళ్ల ద‌గ్గ‌ర” అన్నాడు కొత్త ర‌చ‌యిత‌. “అవ‌త్‌రాలీ క‌థ విను” కాకినాడ ఇసుక వీధిలో నివాసం వుండే అవ‌తారం లింగ‌య్య…

“ఎక్క‌డున్నాం” అని అడిగాడు పాత ర‌చ‌యిత.
“మీరు రెండో రౌండ్‌లో, నేను మీ కాళ్ల ద‌గ్గ‌ర” అన్నాడు కొత్త ర‌చ‌యిత‌.
“అవ‌త్‌రాలీ క‌థ విను”
కాకినాడ ఇసుక వీధిలో నివాసం వుండే అవ‌తారం లింగ‌య్య రోజూ బాధ్య‌త‌గా పేకాట ఆడేవాడు. సాయంత్రం క్వార్ట‌ర్ మందుతాగి ప్ర‌భుత్వానికి ఆర్థిక సాయం చేసేవాడు. డ‌బ్బుల కోసం ర‌క‌ర‌కాల క‌థ‌లు చెప్పేవాడు. లాగ్ , రిపీటేష‌న్ లేకుండా క‌థ చెప్పే విధానానికి ముగ్ధులై ధ‌న స‌మ‌ర్ప‌ణ చేసేవాళ్లు. అత‌ని క‌ల్ప‌నాశ‌క్తికి నిద‌ర్శ‌నం ఏమంటే ఒక‌సారి త‌న అంత్య‌క్రియ‌ల‌కే అడిగాడు. దీన్ని బ‌రియ‌ల్ గ్రౌండ్ రియాల్టీ అంటారు. కాకినాడ‌లో ఎన్నాళ్లున్నా గుడ్డి గువ్వ‌కి వెతుక్కోవాల్సిందే అని ఉప‌దేశించి, సినిమా రంగం స‌రైన క‌థ‌లు లేక ఎండిపోతూ వుంద‌ని ఉద్బోధించి ఖ‌ర్చుల‌కి డ‌బ్బులిచ్చి, ద‌గ్గ‌రుండి శ్రేయోభిలాషులు రైలు ఎక్కించారు.

ఫిల్మ్‌న‌గ‌ర్ పేక ముక్క‌ల్లో క్వీన్‌లా క‌నిపించింది. తాను కింగ్. డీల్ కుదుర్చుకోవాలి. 20 ఏళ్లుగా సినిమా తీస్తాన‌ని చెప్పుకుంటున్న యువ ద‌ర్శ‌కుడి రూమ్‌లో దిగాడు. టైటానిక్ బాగా న‌చ్చి ఆ ద‌ర్శ‌కుడు పేరుని జాక్‌రోజ్‌గా మార్చుకున్నాడు (ఇత‌ని క‌థ మ‌ళ్లీ చెప్పుకుందాం).

లింగ‌య్య‌ని హ‌గ్ చేసుకున్నాడు జాక్‌. వాళ్లిద్ద‌రినీ వాట్స‌ప్ క‌లిసింది. గ‌త ప‌రిచ‌యం లేదు.
“తెలుగు సినిమా ఉలికిప‌డే రోజు. నువ్వు ఇండ‌స్ట్రీలో పాదం మోపావు” అన్నాడు జాక్‌.
లింగ‌య్య సంతోషించి ఇండ‌స్ట్రీని షేక్ చేయ‌డ‌మే త‌న యాంబిష‌న్ అన్నాడు.
“పుస్త‌కాలు ఏమైనా చ‌దివావా?” అడిగాడు జాక్‌.
“టైమ్ లేదు” చెప్పాడు లింగ‌య్య‌.
“సినిమాలు బాగా చూస్తావా”
“టైమ్ లేదు”
“క‌థ‌లు ఏమైనా రాసావా”
“అక్షరాలు రావు”
“అయితే సినిమా క‌థ‌ల‌కి నువ్వే క‌రెక్ట్ మొగుడు” అని జాక్ ఆనంద భాష్పాలు రాల్చాడు.
“డైరెక్ట‌ర్లు నా ద‌గ్గ‌ర‌కి వ‌స్తారా? నేనే వెళ్లాలా?” అడిగాడు లింగ‌య్య‌.
సుడిగాలికి దుమ్ము లేచిన‌ట్టు, జాక్ క‌ళ్ల‌లో భ‌యం, వ‌ణుకు ఒక్క‌సారిగా లేచాయి. త‌మాయించుకున్నాడు.

“కాకినాడ‌లో స‌ముద్రం వుంద‌ని తెలుసుకానీ, నీ లాంటి మ‌హానుభావులు కూడా వుంటార‌ని తెలియ‌దు” అన్నాడు జాక్‌.
“స‌ముద్రాన్ని చూస్తూ బీర్ తాగుతున్న‌ప్పుడు, అల‌లు ఒడ్డును తాకిన‌ట్టు అనేక క‌థ‌లు నా మెద‌డుని తాకుతూ వుంటాయి. ఒక స్టోరీ లైన్ బ‌య‌టికి తీయ‌నా?” అన్నాడు లింగ‌య్య‌.
“వ‌ద్దు ఇండ‌స్ట్రీ అంతా జేబు దొంగ‌ల‌తో నిండిపోయింది. ఎవడి క‌థ‌ని ఎవ‌రు కొట్టేస్తాడో తెలియ‌దు. దొంగిలించిన క‌థ‌తో , దొంగిలించిన సీన్‌తో పెద్ద మ‌నుషులు సినిమా తీస్తారు. మిగ‌తా అంగాలు ప‌ని చేసినా చేయ‌క‌పోయినా చెవులు మాత్రం అధిక శ‌క్తితో ప‌ని చేస్తూ వుంటాయి. అందుకే బార్‌లో కూచుందాం”
“అక్క‌డ మాత్రం చోరులుండ‌రా?”
“వుంటారు కానీ, వారు బీరులై వుంటారు. ఒక‌రు మాట్లాడేది ఇంకోడికి అర్థం కాని ప్లేస్‌ని బార్ అంటారు. గొప్ప క‌థ‌ల‌కి బారే ఓపెన‌ర్‌”
స‌న్న‌టి సంగీతం, పెద్ద‌గా శ‌బ్దిస్తున్న జ‌నం , అర్థ చీక‌టిలో నీడ‌ల్లా తిరుగుతున్న వెయిట‌ర్లు.
ఇద్ద‌రూ కూచున్నారు. బార్‌లో కూచోవ‌డం సుల‌భం. లేవ‌డానికే అటూఇటూ ఊత క‌ర్ర‌లు అవ‌స‌రం.
ఇంత‌లో “వుంగ‌ట్రావులి, శామారావు బిస్టిలీ, క్రోడంబుట్రా స్టాబలి” అనే వాక్యం ప‌క్క టేబుల్ నుంచి వినిపిచ్చింది. కాకినాడ‌లో ఎన్నో స‌ముద్ర‌పు తుపాన్లు చూసిన లింగ‌య్య కూడా ఒక్క క్ష‌ణం జ‌డుసుకున్నాడు.
“ఏమిటా శ‌బ్దం” అనుమానంగా అడిగాడు.
“ఇది బార్‌. ఇక్క‌డి భాష‌ని బార్‌షా అంటారు. దానికి లిపి వుండ‌దు. మూడు రౌండ్లు ప‌డితేనే అర్థ‌మ‌వుతుంది”
“కంగ్‌షాముక్షా మిట్రువాయుం భ‌జం. అనాస్పాహి ష‌బారం” అని ఇంకో సౌండ్‌.
ఈ సారి జాక్ కూడా భ‌య‌ప‌డ్డాడు. సెల్‌ఫోన్ లైట్‌తో ఆ ప్రాణిని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించి స్థిమిత‌ప‌డ్డాడు.
“అత‌నో బ‌తికి చెడ్డ నిర్మాత‌. పాన్ ఇండియా సినిమా అంటూ అన్ని భాష‌ల్లో తీసి చివ‌రికి త‌న భాష‌నే మ‌రిచిపోయాడు. పేరు మిర‌గ‌మ్ బుజ్జి. కాల‌క్ర‌మంలో అత‌ని క‌థ‌ని చెప్పుకుందాం. ముందు నీ క‌థ చెప్పు” ధైర్యం చెప్పాడు జాక్‌.
మందు వ‌చ్చింది. బుడ‌గ‌ల‌తో ఉన్న సోడాని క‌లుపుకుంది. న‌దిలో ప‌డ‌వ‌ల్లా ఐస్ ముక్క‌లు తేలాయి. అగ‌స్త్యుడు స‌ముద్రాన్ని తాగిన‌ట్టు లింగ‌య్య ఒకే గుట‌క‌లో తాగాడు.

“ఈ ప్రావిణ్యానికి ఏమిటి కార‌ణం?” ఆశ్చ‌ర్య‌పోతూ అడిగాడు జాక్‌.
“రోజూ స‌ముద్రం చూసేవాన్ని. ఈ గ్లాస్‌లోని ద్ర‌వం ఒక లెక్కా?” మసాలా పాప‌డ్‌ని తుత్తునియ‌లు చేసాడు లింగ‌య్య‌.
వీడి వ‌ల్ల ఇండ‌స్ట్రీలో చాలా ఉప‌ద్ర‌వాలు వ‌చ్చేలా ఉన్నాయి అనుకున్నాడు జాక్‌.
“నెత్తిమీద బ‌స్తాల కొద్ది క‌థ‌ల బ‌రువు మోస్తున్న కార్మికులు ఉన్న ఈ నేల మీదికి వ‌చ్చిన అవ‌తార పురుషా? మీ క‌థ చెప్పండి” అని అడిగాడు జాక్‌. పేగులు విద్యుత్ తీగ‌లుగా మారుస్తున్న విస్కీని చ‌ప్ప‌రిస్తూ చెవులు నిటారుగా నిల‌బెట్టి విన‌డానికి పూనుకున్నాడు.
“త‌ల్లీతండ్రి, న‌లుగురు కొడుకులు, వాళ్లు అమ్మానాన్నని చూడ‌రు. ఇంట్లో ప‌నివాడు వుంటాడు…”
“ఇది పెద్ద ఎన్టీఆర్ ఆత్మ బంధువు సినిమా” జాక్ అడ్డు త‌గిలాడు.
“ఒక‌డుంటాడు. అన్నీ అబ‌ద్ధాలే చెబుతాడు. చివ‌రికి నిజం చెప్పినా న‌మ్మ‌రు”
“ఇది చిన్న‌ప్పుడు చ‌దువుకున్న నాన్నా పులి క‌థ‌. ఇదే థీమ్‌తో ఎవ‌రికి వారే య‌మునాతీరే అని రాజ‌బాబుతో దాస‌రి తీసేశాడు”
“మ‌రి అన్ని క‌థ‌ల్ని నేను పుట్ట‌క‌ముందే తీసేస్తే నేనేం చేయాలి?”
జాక్‌కి విష‌యం అర్థ‌మైంది.
“నీ ద‌గ్గ‌ర ఎంతుంది?”
“ఇంకా చాలా క‌థ‌లున్నాయి”
“క‌థ‌లు కాదురా అవులే, డ‌బ్బులు”
“ఇంకో ప‌ది రోజులు బార్‌లో తాగొచ్చు”
“అది చాలు, నిన్ను జ్ఞాన‌వంతున్ని చేయ‌డానికి”
“అంటే నాకు జ్ఞానం లేదా?”
“జ్ఞానం వుంద‌నుకోవ‌డ‌మే అస‌లు సిస‌లైన అజ్ఞానం. క‌థ‌లు ఊరికే రావు. సేక‌రించాలి, త‌స్క‌రించాలి. న‌మ్మించాలి, అమ్మించాలి. తేనెటీగ‌ల్లా అక్క‌డా ఇక్కడా కొట్టుకొచ్చి సొంత తేనె బిల్డ‌ప్ ఇవ్వాలి. అందుకే వెర్రి పుష్పాల్ని వెతుక్కునే ట‌మార‌య్య క‌థ విను. ట‌చ్‌లో వుండు అత‌ని ఊత‌ప‌దం” అన్నాడు జాక్‌.
క‌థ ఆపిన పాత ర‌చ‌యిత మీద కొత్త ర‌చ‌యిత‌కి కోపం వ‌చ్చింది.
“మీరు అవ‌త్‌రాలీ క‌థ స్టార్ట్ చేసి ట‌మార‌య్య‌లోకి బండిలాగారు”
“నాది నాన్ లీనియ‌ర్ ప‌ద్ధ‌తి. చుక్క‌ల ముగ్గులా చివ‌రికి అని క్యారెక్ట‌ర్లు క‌లుపుతాను. మూసుకుని విను” అన్నాడు పాత ర‌చ‌యిత గుటుక్‌మ‌నే సౌండ్‌తో. (Next ట‌చ్‌లో వుండే ట‌మార‌య్య‌)

జీఆర్ మ‌హ‌ర్షి

3 Replies to “సినీ ‘పంచ్’ తంత్రం -2”

Comments are closed.