పేరు: అమిత్ షా
దరఖాస్తు చేయు ఉద్యోగం: సంఘ్ (పరివార్) సంస్కర్త. (కాశ్మీరునుంచి కన్యాకుమారి వరకూ దేశం 'పచ్చ'గా వుండకుండా, 'కాషాయీకరణ' చెయ్యటమే నా అంతిమ ధ్యేయం.)
వయసు: నిండు యవ్వనం. (మా పార్టీలో యవ్వనం యాభయి తర్వాతే ప్రారంభమవుతుంది. తొంభయికి చేరువయిన అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వారిది మధ్యవయసు. వాజ్ పేయీది మాత్రమే వృధ్ధాప్యం.)
ముద్దు పేర్లు: 'దళిత్'షా (నిజానికిది ముద్దు పేరు కాదు… 'ముద్ద' పేరు. తెలంగాణ పర్యటన తర్వాతనే ఇది స్థిరపడింది. దళితులతో ఇక్కడ సహపంక్తి భోజనం చేశాను. ఎక్కడ వండారో తెలీదు. పై వర్ణాల వారి తోటలో వండించి తెచ్చారని కిట్టని వాళ్ళ ఆరోపణ) 'భ్రమిత్'షా (ఇది టీఆర్‌ఎస్ వారు నాకు పెట్టిన పేరు. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తున్నట్టు నేను భ్రమిస్తున్నాని వారి ఆరోపణ). 'గో'మిత్ షా (గోవధ- అంటే గోవును ఒక్క సారిగా చంపటం మాత్రమే ననీ, వట్టిపోయిన తిండిలేకుండా మాడ్చి మాడ్చి సులభ వాయిదాల్లో చంపటం మాత్రం కాదనీ లోకానికి ఎలుగెత్తి చాటుతున్నాను.)
విద్యార్హతలు: బ్యాచిలర్ 'ప్యాకేజి'ంగ్ (ఆంధ్రప్రదేశ్ హోదాని అడిగితే, అన్ని రాష్ట్రాలకూ ఇచ్చే సాయాన్నే 'కాషాయ' కవర్‌లో 'ప్యాకేజీ' చేసి ఇవ్వగలిగాం- అందుకే. మోడీజీ 'చెంబుడు నీళ్ళూ, పిడికెడు మట్టీ' విడివిడిగా ఇస్తే రాష్ట్ర ప్రజలు కోపం తెచ్చుకున్నారు. అప్పుడే రెంటినే 'ప్యాకేజీ'లో పెట్టి ఇవ్వాల్సింది. అపార్థానికి తావుండేది కాదు.)
గుర్తింపు చిహ్నాలు: ఒకటి: కథలు అల్లటం. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు (ముజఫర్‌నగర్ అల్లర్ల సాక్షిగా) 'లవ్'స్టోరీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు (అఖ్లాక్ హత్య సాక్షిగా) 'కవ్' స్టోరీ, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు (నోట్ల రద్దు సాక్షిగా) 'క్యాష్' స్టోరీ.
రెండు: వేషాలు వెయ్యటం (సినిమాల్లో కాదు. నిజజీవితంలోనే. తెలంగాణ పర్యటనప్పుడు చేనేత కార్మికుడి వేషం వేసి మగ్గం పట్టి నేత నేసానా..!)
సిధ్ధాంతం: 'పువ్వు'ను 'పువ్వు'తోనే తియ్యటం. తెలంగాణ రాష్ట్రానికి 'గులాబీ' గుచ్చుకుంది. దానిని 'కమలం'తోనే తియ్యగలం. కాంగ్రెస్ వాళ్ళు మొండి 'చేత్తో' తీద్దామని
ప్రయత్నిస్తున్నారు కానీ.. కుదరదు.
వృత్తి: 'మైనారిటీల' చూపి 'మెజారిటీని' భయపెట్టటం. (అద్వానీ అందుకు 'బాబ్రీ'ని చూపిస్తే, నేనూ మోడీజీ 'గోద్రా'నూ 'దాద్రీ'నూ చూపించి ఆ రికార్డు కొట్టేశాం.)
హాబీలు: 1. లెక్కలు వెయ్యటం. (అయితే 'వోట్ల' లెక్కలు ఎంత గొప్పగా వేస్తానో, 'కోట్ల' లెక్కలు అంత బలహీనంగా వేస్తానంటారు. తెలంగాణకు లక్ష కోట్లు కేంద్రం ఇచ్చిందంటే.. బహుశా అందుకేనేమో కేసీఆర్ తప్పు పట్టారు.)
2. మోడీ నామ స్మరణ. (మూల విరాట్టుకు పూజలూ, ఉత్సవ విగ్రహానికి పొగడ్తలూ దక్కుతాయి. ఒక్కొక్క సారి మూల విరాట్టు సైతం, ఉత్సవ విగ్రహాన్ని పొగడాల్సిందే. అందుకే మోడీజీని స్మరిస్తూ, తపిస్తుంటాను.)
అనుభవం: 'రోజు' నీతే రాజనీతి. (ఆ పూటకు ఏ మాట అవసరమో అది మాట్లాడటమే రాజకీయం. నేను మోడీజీ ఈ 'నీతి'నే నమ్ముకున్నాం.)
మిత్రులు: అవసరానికి పనికి వచ్చేవాడే అసలు మిత్రుడు- అని ఊరికే అంటారా..? అప్పుడు సిధ్ధాంతాలూ, రాధ్ధాంతాలూ పక్కన పెట్టాల్సిందే. జమ్ముకాశ్మీర్‌లో పీడీపీతోనూ, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతోనూ అలాంటి పొత్తులే పెట్టుకున్నాం. పైకి పొత్తులే కానీ, లోపల నూరుకునేది కత్తులే. ఆంధ్రప్రదేశ్‌లో నే చూడండి. 'పువ్వే'(కమలమే) కదా నలిపెయ్యవచ్చని చంద్రబాబూ, 'సైకిలే' కదా తొక్కెయ్యొచ్చని నేనూ అనుకుంటాం.
శత్రువులు: కాషాయానికి కాషాయమే శత్రువు. మహరాష్ట్రలో 'శివసేన'ను చూస్తే అర్థం కావటం లేదా..?
మిత్రశత్రువులు: 'పెద్దలు'. వారి తలల మీదనుంచి ఎదుగుతూ నేనూ, మోడీజీ వచ్చేశాం. వారు మమ్మల్ని ఊరుకుంటారా..? అవకాశం దొరికితే దీవిస్తూ ఆణిచెయ్యాలనుకుంటారు.
వేదాంతం: 'సర్వసంగ పరిత్యాగుల'కే సకల భోగభాగ్యాలు. (మొన్న ఒక బ్రహ్మచారి ప్రధాని అయ్యారు; నిన్న ఒక సన్యాసి ముఖ్యమంత్రి అయ్యారు. రేపు ఒక అఘోరా రాష్ట్రపతి కావచ్చు.)
జీవిత ధ్యేయం: దక్షిణ భారతంలోనూ కాషాయాన్ని ఎగుర వేయటం.
-సతీష్ చందర్