సచిన్ టెండూల్కర్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైరవుతుండడం అంటేనే తాను ఏదో కోల్పోతున్నట్లుగా ఉన్నదంటూ మహేంద్ర సింగ్ ధోనీ కితాబులు ఇచ్చి ఉండవచ్చు గాక… కానీ ముంబాయి వాంఖడే మైదానంలో జరుగుతున్న ఓ చారిత్రాత్మకమైన క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా నిరీక్షిస్తూ ఉన్న లక్షలాదిమంది క్రీడాభిమానులలో మాత్రం విపరీతమైన అసంతృప్తిని నింపేశాడు. ముంబాయి వాంఖడే మైదానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన తన చారిత్రాత్మక 200 వ టెస్టు మ్యాచ్‌ను, జీవితంలో చిట్టచివరి క్రికెట్ మ్యాచ్‌ను ఆడుతున్న సంగతి తెలిసిందే. సచిన్ చివరి టెస్టును చూడడం కోసం.. అతణ్ని క్రికెట్ దేవుడిగా కీర్తించే యావత్తు ప్రపంచమూ ఇవాళ టీవీ సెట్‌లకు అతుక్కుపోయి ఎదురుచూస్తోంది. అయితే మ్యాచ్‌లో టాస్ తానే గెలిచినప్పటికీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడం ద్వారా.. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. సచిన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్ని నిరాశపరిచాడని చెప్పాలి.
కోల్ కత టెస్టులో వెస్టిండీస్ జట్టు భారత్ చేతిలో ఎలాంటి పరాభవాన్ని చవిచూసిందో చెప్పనక్కర్లేదు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ చేసిన స్కోరును సెకండిన్నింగ్స్‌లో కూడా అధిగమించలేకపోయింది. అసలు భారత్‌కు సెకండిన్నింగ్స్ చూసే ఛాన్సే లేకుండా పోయింది. మ్యాచ్ పోయినా పర్లేదు.. సచిన్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడితే చాలు అని నిరీక్షించిన ఈడెన్ గార్డెన్స్ మైదానం నిరాశపడింది .
ఇప్పుడు ముంబాయిలోనైనా సచిన్ ఆడుతున్న చివరి టెస్టు మ్యాచ్‌లోనైనా భారత్‌కు మొదట బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే.. రెండు ఇన్నింగ్స్‌లో సచిన్ బ్యాటింగ్‌ను చూడవచ్చునని అనుకున్న అభిమానుల్ని నిరాశ పరుస్తూ.. టాస్ గెలిచిన ధోనీ ఫీల్డింగ్‌ను ఎంచుకున్నాడు. కోల్‌కత మ్యాజిక్ రిపీట్ అయితే.. ఈ మ్యాచ్‌లో కూడా సచిన్ బ్యాటింగ్‌ను ఒక ఇన్నింగ్స్‌లోనే చూడాల్సి వస్తుందేమో అని అభిమానులు అనుకుంటున్నారు. కనీసం టాస్ వెస్టిండీస్ గెలిచినా బాగుండేదని.. ‘తాము కూడా ఫీల్డింగ్ ఎంచుకుని ఉండేవాళ్లమని’ సమీ అన్నమాటల్ని బట్టి.. అభిమానులు కోరుకుంటుండడం విశేషం.