వోల్వో.. ఓలమ్మో.!

వోల్వో.. పది, పదిహేనేళ్ళ క్రితం భారత రవాణా రంగంలోకి వచ్చిన ఈ సరికొత్త బస్సులు అందర్నీ ఇట్టే ఆకర్షించాయి. కొందరేమో ‘వైట్‌ ఎలిఫెట్‌’ అన్నారు, మరికొందరేమో సుఖవంతమైన ప్రయాణానికి కేరాఫ్‌ అడ్రస్‌ అన్నారు.. కానీ,…

వోల్వో.. పది, పదిహేనేళ్ళ క్రితం భారత రవాణా రంగంలోకి వచ్చిన ఈ సరికొత్త బస్సులు అందర్నీ ఇట్టే ఆకర్షించాయి. కొందరేమో ‘వైట్‌ ఎలిఫెట్‌’ అన్నారు, మరికొందరేమో సుఖవంతమైన ప్రయాణానికి కేరాఫ్‌ అడ్రస్‌ అన్నారు.. కానీ, ఇప్పుడవి మృత్యు వాహనాలుగా మారిపోతున్నాయి.

పాపమెవరిది? మితిమీరిన వేగంతో నడుపుతున్న డ్రైవర్లదా? వేగంగా గమ్యస్థానాలు చేరాలి కాబట్టి.. అంటూ ట్రావెల్స్‌ సంస్థలపై ఒత్తిడి పెంచుతున్న ప్రయాణీకులదా? కాసుల కక్కుర్తి కోసం రయ్యిమని రోడ్లపై స్పీడ్‌గా దూసుకెళ్ళమని డ్రైవర్లకు సూచిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ ఆపరేటర్లదా? సుఖవంతమైన ప్రయాణాన్ని, భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందివ్వలేకపోతున్న ప్రభుత్వ రవాణా సంస్థలదా.? అంటే అందరిదీ అని చెప్పాలి.

మహబూబ్‌నగర్‌ జిల్లాలో జబ్బర్‌ ట్రావెల్స్‌కి చెందిన వోల్వో బస్సు ప్రమాదానికి గురై, మంటల్లో పూర్తిగా కాలిపోవడం, ఈ ఘటనలో నలభై ఐదు మంది సజీవ దహనం అవడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. అచ్చం అలాంటిదే ఈసారి కర్నాటకలో జరిగింది. ఇక్కడా, అక్కడా వోల్వో బస్సే ప్రయాణీకుల పాలిట మృత్యు శకటంగా మారింది.

అప్పుడూ ఇప్పుడూ బస్సు వేగం 150 కిలోమీటర్లకు పైగానే వుందని అధికారులు తేల్చారు. అంత వేగానికి తగ్గట్టు బస్సు డిజైన్‌ చేయబడినా, దానికి తగ్గట్టుగా మన దేశంలోని రోడ్లు లేవన్నది నిర్వివాదాంశం. రెండు సందర్భాల్లోనూ డీజిల్‌ ట్యాంక్‌ పగిలింది. ఇప్పుడిక బస్సులపై కొరడాలే జులిపిస్తారో , ప్రైవేటు ట్రావెల్స్‌ సంస్థలపై నిఘా పెడ్తారో గానీ, ప్రయాణమంటే నరకంగా మారిపోయిందన్నది మాత్రం నిర్వివాదాంశం.

రైళ్ళలో టిక్కెట్లు దొరక్క, ప్రభుత్వ రవాణా సంస్థల నిర్వహణ సరిగా లేక.. ప్రయాణీకులు అత్యవసర ప్రయాణాలతో తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.