ఎదుటివాళ్లు మనకి సాయం పేరుతో చేయందిస్తున్నప్పుడు, ఒకటి ఆలోచించాలి. అది నిజంగా సాయమా? లేక ఎర వేస్తున్నారా అని!
తనకు ఉపయోగం లేనిదే ఎవ్వరూ ఎవ్వరికీ పనిగట్టుకుని సాయం చేసే రోజులు కావివి. అయితే సాయంలా కనిపించేవాటిల్లో పొంచి ఉన్న ప్రమాదాలేంటో గుర్తించాలి. డాలర్ల మత్తులో పడి చెయ్యరాని తప్పులు చేస్తే చట్టబద్ధమైన చర్యలకు గురికావొచ్చు.
మునుపెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో ఒక పెద్ద స్కాం కి తెరలేపారు అమెరికాలో కన్సల్టెన్సీలు నడుపుతున్న కొందరు తెలుగువాళ్లు. అది ఇలాంటి అలాంటి స్కాం కాదు. చాలా పెద్దది: దొంగ గ్రీన్ కార్డులు తయారు చేయడం.
అమెరికాలో ఉంటూ ఆ దేశం యొక్క శాశ్వత నివాస కార్డుల నకిలీల్ని సృష్టించమంటే అది ఎంత పెద్ద నేరమో ఆలోచించండి. దొంగ నోట్ల ముద్రణ కంటే చాలా పెద్ద నేరం కదూ! అయినప్పటికీ ఈ ఫ్రాడ్ కి మన తెలుగువాళ్లు తెర లేపారు.
అమెరికాలోని తెలుగువాళ్ల కన్సల్టింగ్ కంపెనీలు కొన్ని ఫేక్ గ్రీన్ కార్డులే కాకుండా, ఫేక్ హెచ్ 1 బి వీసాల్ని, ఫేక్ ఐ-797 లని ఓపీటి విద్యార్థుల కోసం తయారు చేసి ఇస్తున్నాయి.
వీటిని అడ్డం పెట్టుకుని బ్యాక్ గ్రౌండ్ చెక్ కి గురికాని కాంట్రాక్ట్ జాబుల్ని కొందరు విద్యార్థులు పొందేలా చేస్తున్నాయి కన్సల్టెన్సీలు. అలా వచ్చిన ఉద్యోగాల తాలూకు జీతంలో భారీ పర్సెంటేజ్ ఈ కన్సెల్టెన్సీలు తీసుకుంటాయి.
రేపు చట్టానికి దొరికాక తమకి సదరు కన్సల్టెన్సీ ఆ ఫేక్ గ్రీన్ కార్డ్ ఇచ్చిందని చెబితే దానికి ఆధారాలుండవు. ఆ విద్యార్థే తమకు గ్రీన్ కార్డ్ చూపించాడని, అది నిజమైనదనే తాము కూడా నమ్మామని ఆ కన్సెల్టన్సీలు చెప్పేసి తప్పించుకోవచ్చు.
అయినప్పటికీ ఫేక్ గ్రీన్ కార్డ్ అని తెలిసి దాంతో ఉద్యోగం పొందినందుకు విద్యార్థి నేరస్థుడే అవుతాడు. అదంత సీరియస్ క్రైం అని తమకు తెలీదని చెప్పినా శిక్ష ఏమీ తగ్గదు. ప్రపంచ వ్యాప్తంగా లా లో ఒక పాయింట్ ఉంటుంది. “ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్యూజ్” అని.
అమెరికాలో తప్పు చేసాడని మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపునే వదలడంలేదు. తెలుగు విద్యార్థులొక లెక్కా!
ప్రతిభ లేకపోయినా మంచి ఉద్యోగం పట్టేయాలి, డాలర్లు సంపాదించేయాలి అనే యావలో పడి ప్రాక్సీ ఇంటర్వ్యూలు అటెండవ్వడం, ప్రాక్సీ గ్రీన్ కార్డులు చూపించి ఒకటి రెండు కాకుండా మూడు నాలుగు కాంట్రాక్ట్ ఉద్యోగాలు పొంది వర్క్ ఫ్రం హోం చేయడం, వర్క్ లోడ్ ఎక్కువుంటే కొన్ని డాలర్లు పారేసి ఇతర విద్యార్థుల్ని కూడా ఈ స్కాములో తమకు తెలియకుండానే దింపడం లాంటివి చేస్తున్నారు. నేరం చెయడమే కాదు, నేరస్థుడికి నేరంలో సాయం చేయడం కూడా నేరమే. కనుక ఈ వెబ్ లో ఉన్న ప్రతి విద్యార్థి ప్రమాదంలో ఉన్నట్టే.
స్టూడెంట్ వీసా మీద అమెరికాలో ల్యాండైన తెలుగు విద్యార్థులపై తెలుగు కన్సల్టెన్సీలు వల వేస్తున్నాయి. వాళ్లకి డాలర్ల ఆశ చూపించి ఇలాంటి నేరాలని చేయిస్తున్నాయి.
ఆశ్చర్యమేంటంటే ఈ ఫ్రాడ్ ఎప్పటి నుంచో అక్కడక్కడ జరుగుతున్నా ఈ మధ్యన మరీ విరివిగా జరగడంతో రహస్యం బయటికి పొక్కింది. తీగ లాగితే డొంకంతా కదులుతోంది.
తమ పిల్లల్ని అమెరికాకి పంపి ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకి ఈ విషయాలపై అవగాహన ఉండాలి. అటువంటి వ్యక్తుల వలలో చిక్కొద్దని తమ పిల్లల్ని హెచ్చరించుకోవాలి. ఇప్పటి వరకు ఈ ర్యాకెట్ ని అమెరికా సంస్థలు ఛేదించకపోవడం ఆశ్చర్యం. కొన్ని ఇండియన్ కన్సెల్టెన్సీలు ఈ విధంగా తమ అమెరికన్ వ్యవస్థని పాడు చేస్తున్నాయని, ఫేక్ గ్రీన్ కార్డ్స్ ద్వారా సెక్యూరిటీ థ్రెట్ కు తెరలేపుతున్నాయని తెలిస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి.
అలాంటి నేరస్థుల్ని శిక్షించడమే కాకుండా వీసాలివ్వడం మరింత కఠినతరం చేయొచ్చు.
మనవాళ్లు అనుకోవచ్చు… అమెరికన్ యూనివర్సిటీలకి డబ్బు కావాలి, కనుక ఏం జరిగినా చూసీ చూడనట్టు ఊరుకుంటారని! అది ముమ్మాటికీ నిజం కాదు. తమ పౌరుల ఉద్యోగావకాశాలకి గండి కొడుతూ కాంట్రాక్ట్ జాబ్స్ అన్నీ దొంగ గ్రీన్ కార్డులతో, ఫేక్ హెచ్ 1 బి లతో లాక్కుపోతుంటే ఇక్కడ జరిగే నష్టం కన్నా యూనివర్సిటీలకి ఫీజుల రూపంలో వచ్చే రాబడి చాలా తక్కువన్న విషయం లెక్కేసుకుంటే భారతీయ విద్యార్థులపై అమెరికా మోపేది ఉక్కుపాదమే.
తెలుగువాళ్ల పరువుని బజారుకీడుస్తున్న ఇలాంటి కన్సెల్టెన్సీల ఓనర్స్ ఎవరో తానా, ఆటా, నాట్స్, నాటా సంస్థల వాళ్లకి తెలీదని కాదు. తెలిసినా “మన” తెలుగువాడు, మనల్ని మోసం చెయ్యలేదు కదా, మన మిత్రుడు కదా, దొరికాక సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చులే అని ఉపేక్షిస్తే అంతకంటే తప్పు మరొకటి ఉండదు. అన్నం పెడుతున్న దెశానికి కన్నం వేసే దొంగల్ని పట్టివ్వకపోవడం కూడా తప్పే. “మన” అనుకున్నవాడు సరైన మార్గంలో నడిచేలా చూడడం తెలుగు సంఘాల బాధ్యత. ఆ బాధ్యతని విస్మరించకుండా ఈ విషయంపై దృష్టి పెడతారని ఆశిద్దాం.
హరగోపాల్ సూరపనేని