నా దారి చేగువేరా-1

పవన్‌తో ఓ సాయంత్రం Advertisement ‘ఎవరైతే నిజాయితీ, ముక్కుసూటిగా నడుస్తారో, ఎవరైతే రూల్స్‌ పాటిస్తూ ఓ క్రమ పద్ధతి ప్రకారం జీవిస్తారో వారికి ఈ సమాజంలో స్థానం లేకుండాపోయింది. నైతిక విలువలు, సిద్ధాంతాల బాటన…

పవన్‌తో ఓ సాయంత్రం

‘ఎవరైతే నిజాయితీ, ముక్కుసూటిగా నడుస్తారో, ఎవరైతే రూల్స్‌ పాటిస్తూ ఓ క్రమ పద్ధతి ప్రకారం జీవిస్తారో వారికి ఈ సమాజంలో స్థానం లేకుండాపోయింది. నైతిక విలువలు, సిద్ధాంతాల బాటన నడిచే వారికి ఎప్పుడు అవమానాలే.. చెప్పడానికి కఠినంగా ఉన్నా ఇది వాస్తవం. ఇదంతా నేను ఊహించుకుని చెప్పట్లేదు. స్టూడెంట్‌ లైఫ్‌ నుండీ నేనూ అనుభవించాను కాబట్టి ఆ చేదు జ్ఞాపకాలు, అనుభవాల నుండే నేను చెబుతున్నాను. దౌర్జన్యాలు, అన్యాయాలు, అక్రమాలు, లూటీలు చేసేవాడికే నేడు సమాజంలో గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి. వారినే అందరూ అందలమెక్కిస్తున్నారు. విలువలు లేనివారు నేడు రాజభోగాల్ని, సకల సౌకర్యాల్ని అనుభవిస్తున్నారు. నేటి వ్యవస్థ కేవలం కొన్ని అగ్రకులాల గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. దశాబ్దాలుగా వీరు సమాజంపై ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నారు. ఈ కులాలే సమాజాన్ని శాసిస్తున్నాయి. వారికి ఇతరుల బాగోగులతో పనిలేదు. వారు, వారి కుటుంబం, వారి బంధువులు బాగుపడితే చాలనే ధోరణిలో ప్రవర్తిస్తున్నారు. ఆశ్చర్యపోవలసిన విషయం ఏంటంటే ఎవరైతే తమ కులం ఓట్లతో రాజ్యాధికారంలోకి వచ్చారో వారు కనీసం వారి కులాల గురించి కూడా ఆలోచించడంలేదు. ఇదంతా నన్ను కదిలిస్తుంది.

ఎన్నో దెబ్బలు తిన్నాను

నేను కుల, వర్ణ వివక్ష ఎదుర్కోనప్పటికీ చిన్నప్పటినుంచీ చదువుకునే రోజులనుండీ ఇప్పటివరకు నేను దెబ్బలు తింటూనే వున్నాను. అవి ఎన్నో రకాలుగా కావొచ్చు. హీరోగా గుర్తింపు వున్న నాకే ఇలా జరిగితే ఏ గుర్తింపు లేని సగటు మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది.

వాళ్ళు తుపాకీ ఎందుకు పట్టారు?

దశాబ్దాలుగా మన దేశంలో అధికారం పేరిట దోపిడీ కొనసాగుతున్నందునే దీనిని సహించలేని, ఓర్చుకోలేని యువతరం అతివాదం, నక్సలిజం బాట పట్టింది. నేడు సమాజానికి నక్సలిజం ప్రమాదమనే సాకుతో దానిని ఉక్కుపాదంతో అణచివేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయే తప్ప వాటి మూలాల్లోకి వెళ్ళి అసలు కారణాల్ని అన్వేషించలేకపోతున్నారు. యువత తుపాకీ బాటను ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది, వాటిని నివారించడానికి ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతకడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతోంది. మల్కాన్‌ సింగ్‌ వంటి కరడు గట్టిన నేరగాళ్ళే జనజీవన స్రవంతిలో కలిసినప్పుడు నక్సలైట్‌ సోదరులు ఎందుకు కలవకూడదు. నేటి వ్యవస్థలో ఆల్టర్‌నేట్‌ సిస్టమ్‌ పనిచేయకపోవడం వల్లే మావోయిసం ప్రబలుతోంది. నిస్సహాయ పరిస్థితులనుండే ఉద్యమాలు పుడతాయి. ప్రభుత్వం, అధికార యంత్రాంగానిదే దీని పూర్తి బాధ్యత.

నాది కలల లోకం

ఆలోచనల నుండే సినిమాలు పుడతాయి. సినిమాలు సందేశం ఇవ్వడానికీ కలలుకనడానికీ సహాయపడతాయి. సినిమాలో హీరోలు చేసింది నిజ జీవితంలో జరగాలనే రూలేమీ లేదు. ఇప్పుడున్న స్థాయికి చేరుకుంటానని అనుకోలేదు. సినిమాలే నా జీవితంగా భావించాను. అన్నయ్య రాజకీయాల్లోకి వచ్చాక నేను కన్న కలల్ని, ఆశయాల్ని నిజ జీవితంలో సాధించగలననే ఆశ నాలో వుండేది. కలలు సాకారం కావాలంటే మనం చెప్పే నీతుల్ని నిజ జీవితంలో ఆచరించగలగాలి. నేను వాటిని ఆచరించాను కాబట్టే సామాన్య ప్రజలకు సేవ చేయగలననే నమ్మకం ఏర్పడిరది.

నిజమైన హీరోలు వారే..

నిజజీవితంలో సన్మార్గంలో నడిచేవారే నా దృష్టిలో నిజమైన హీరోలు. నేను తెరపై హీరోనైతే సమసమాజ స్థాపనకు కృషి చేసే ప్రతి ఒక్కరూ నా దృష్టిలో నిజమైన హీరోలు. ఇప్పటివరకు నేను నటించిన సినిమాల సక్సెస్‌ను ఎంజాయ్‌ చెయ్యలేదుగానీ, ఎప్పుడైతే రాజకీయ బాట పట్టి ప్రజా జీవితంలో అడుగు పెట్టానో, ఆ క్షణం అభిమానుల స్పందన చూసి మనస్ఫూర్తిగా ఎంజాయ్‌ చేస్తున్నాను. రాజకీయాల్లోకి రావడం నిజమైన మార్పుకు సంకేతంగా భావిస్తున్నాను.

జనం కన్నీళ్ళు తుడవాలి

సామాన్య  ప్రజలు పడుతున్న బాధలు చూసి చలించిపోయేవాడిని. వారికోసం ఏమీ చేయలేదనే గిల్టీ పీలింగ్‌ నాకుండేది. కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్నా పేద ప్రజల సమస్యల్ని తీర్చలేకపోతున్నానే మానసిక వేదన నన్ను అనుక్షణం వెంటాడేది. ఈ గిల్టీ పీలింగ్‌ నుంచి పుట్టిందే ‘కామన్‌ మెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌’. అన్నయ్య రాజకీయాల్లోకి రాకముందే నేను సీఎంపీఎఫ్‌ని స్థాపించాను. అంతమాత్రం చేత ఇదో రాజకీయ పార్టీ కాదు. కులమతాలకు అతీతంగా సామాజికంగా వివక్షకు గురవుతున్న నిస్సహాయులను అన్యాయాలకు గురౌతున్న నిరుపేదలను ఏకం చేసి సమస్యలను ఎదురించడానికి ఓ ప్లాట్‌ ఫామ్‌ వుండాలనే కోరికతోనే దానిని స్థాపించాను. నీతి నిజాయితీల కోసం తపించే ప్రతి ఒక్కరికీ ఇది సరైన వేదిక.

సామాన్యులకే అందలం

ప్రజల కోసం పాటుపడే సామాన్య పౌరుడికైనా పార్టీ టిక్కెట్‌ ఇచ్చేందుకు మా పార్టీ సిద్ధంగా వుంది. కులం, డబ్బు, హోదాతో సంబంధం లేకుండా ఆ వ్యక్తి తాను నివసించే ప్రాంతంలో అందరికీ సురిచితుడై, ఆ వ్యక్తి భవిష్యత్తులో ఆ ప్రాంత ప్రజల సమస్యల్ని తెలుసుకుని, వారికి అండగా నిలవగలిగితే అలాంటి వ్యక్తి నిరుపేదైనా ఏ కులం వాడైనా తప్పకుండా పార్టీ టిక్కెట్టు ఇస్తాం.

(ఇంకా వుంది )

(ప్రజారాజ్యం పార్టీ పెట్టిన రోజుల్లో జూబ్లీహిల్స్‌లోని ఓ గెస్ట్‌ హౌస్‌లో పవన్‌కళ్యాణ్‌తో ఓ గంటసేపు గడిపినప్పుడు సమాజం, రాజకీయాలు, మానవ సంబంధాలపై ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలివి)

– శ్యాంమోహన్‌