మనిషి జంతువుల ప్రవృత్తి నుంచి వచ్చిన వాడే! ఇప్పటికీ, ఎప్పటికీ మనిషిలో ఎంతో కొంత జంతు ప్రవృత్తి పోదు కూడా! జంతు ప్రవృత్తుల్లో ఒకటి.. శృంగారం విషయంలో పరిధులు పెట్టుకోకపోవడం! అయితే మనిషి జంతువుల నుంచి బయటకు వచ్చి సాంఘిక జంతువయ్యాడు. దీంతో శృంగారం విషయంలో కూడా హద్దులు, సరిహద్దులు పెట్టుకున్నాడు! అయితే ఏ కట్టుబాట్లను అయితే మనిషి పెట్టుకున్నాడో, అందులో కొన్నింటిని దాటడానికి కూడా మనిషి ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని నాగరికత చెబుతోంది.
ప్రత్యేకించి శృంగారం విషయంలో అయితే.. వివాహం అనే కట్టుబాటును పెట్టుకున్న మనిషి అవసరార్థం దాన్ని దాటుతూనే వచ్చాడు. బహు వివాహాలు, వివాహేతర సంబంధాలు, ఉంచుకోవడాలు.. ఇవన్నీ చరిత్ర సామాజిక పరిస్థితులను అనుసరించి అనధికారికంగానో, అధికారికంగానో ఆమోదించినవే! అయితే ఈ విషయంలో మగవాడికే మొదటి నుంచి మినహాయింపులు కొనసాగాయి! అయితే కాలం మారింది, రోజులు మారాయి!
ఇప్పుడు రెండుమూడు వివాహబంధాలను కొనసాగించే రోజులూ కావు, ఎవరో ఒకరిని అధికారికంగానో, అనధికారికంగానో ఉంచుకోవడమూ మగవాడికి సాధ్యమయ్యే పని కాదు! ఇదైతే స్పష్టంగా కనిపిస్తున్న మార్పు. అయితే ఇలాంటి మార్పులెన్ని వచ్చినా, మనిషి పక్కచూపులు మాత్రం తప్పవు! అది కూడా సహజమైన లక్షణమే అనుకోవాలేమో!
కొందరిలో ఇది సహజమైన ప్రవృత్తిగానే ఉండవచ్చు. వివాహ బంధం ఎంత సంతృప్తికరంగా ఉన్నా, అనుకూలవతి అయిన భార్య ఉన్నా, సామాజికంగా పేరు, ప్రఖ్యాతులు ఉన్నా.. కొందరు సహజమైన రీతిలోనే పక్కచూపులు చూసే అవకాశాలు ఉండనే ఉంటాయి. అక్రమసంబంధాల కోసం ఆరాట పడే తత్వం ఉండవచ్చు! దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి మానసికమైన తీరే!
వివాహబంధంలో ఎలాంటి లోటు లేకపోయినా.. చంచలమైన మనసు వల్ల పక్క చూపులు చూసే తత్వం మనిషికి సహజమైనదే! చాలామంది ఆ చంచలత్వాన్ని కట్టడి చేసుకుని కట్టుబడి ఉంటారు. అలా కట్టడి చేసుకోవడానికి వాళ్ల పరిస్థితులు కూడా కారణం కావొచ్చు. అయితే కొందరు పరిస్థితులు సానుకూలంగా ఉండటం వల్లనో, పరిస్థితులు ఎలా ఉన్నా ఫర్వాలేదన ధోరణితోనే ఇలాంటి పక్కచూపులు చూసే అవకాశం ఉంది.
వివాహం తర్వాత ఏర్పడే సంబంధాలకు ప్రధానమైన కారణం.. మానసికమైన ధోరణే అనేది పెద్దగా ఎవరూ ఒత్తి చెప్పని విషయం! ఇక స్త్రీ వైపు నుంచి పక్కచూపులకు కారణాల్లో ముఖ్యమైనది ఎమోషనల్ డిస్ కనెక్షన్ అంటారు రిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్. మగవాళ్లలో చాలామంది భార్యతో ఎంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉన్నా, పక్కచూపులకు వెనుకాడరు! అయితే బంధంలో మానసికమైన బాంధవ్యం లేకపోవడం వల్ల స్త్రీలలో వివాహేతర సంబంధం వైపు మొగ్గుచూపే అవకాశాలుంటాయని నయారిలేషన్ షిప్ ఎక్స్ పర్ట్స్ చెబుతూ ఉంటారు.
అలాగే శృంగారపరమై సంతృప్తి లేకపోవడం అనేది పక్కచూపులకు మూడో కారణం అని పరిశోధనలు చెబుతూ ఉన్నాయి. వివాహం తర్వాత వేరే రుచులు ఎరిగిన వారు తమ వైవాహిక జీవితంలో శృంగారంలో సంతృప్తి లేకపోవడం వల్లనే వేరే మార్గాలను చూసుకున్నట్టుగా చెప్పారట! అలాగే అవకాశం రావడం వల్ల మాత్రమే తాము పక్కచూపులు చూసినట్టుగా కొందరు, టెంప్టేషన్ వల్ల అలాంటి పని చేసినట్టుగా మరి కొందరు చెప్పారు! అవకాశమే రాకపోతే తాము అలాంటి పని చేసే వాళ్ల కాదని, వచ్చింది కాబట్టి చేశామనేది వీరి వాదన.
ఇక వివాహబంధంలో ఉన్న తలనొప్పులు, బాధ్యతలకు విసిగివేసారి పోయి సేదతీరడంగా వేరే బంధాన్ని ఏర్పరుచుకున్న వాళ్లూ ఉంటారట! అలాగే తమకు ఆకర్షణ ఉందని తమకు తాము నిరూపించుకోవడానికి, తామంటే క్రేజీగా చూసే వాళ్లు ఉన్నారనే అహంతృప్తి కోసం కూడా కొందరు ఇలాంటి బంధాలను ఏర్పరుచుకున్నారని కూడా వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి!