కెవి: హైడ్రా ట్రాఫిక్ సమస్యలు తీరుస్తుందా?

హైదరాబాదును చిరకాలంగా వేధిస్తున్న ప్రధాన సమస్య ట్రాఫిక్ యిక్కట్లు! రాష్ట్రవిభజన తర్వాత ఎన్నో ఫ్లయిఓవర్లు, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జ్‌లు, వంతెనలు కట్టినా, పలు మార్గాల్లో మెట్రో పరుగులు పెడుతున్నా యీ సమస్య రోజురోజుకి ఎక్కువవుతోంది తప్ప…

హైదరాబాదును చిరకాలంగా వేధిస్తున్న ప్రధాన సమస్య ట్రాఫిక్ యిక్కట్లు! రాష్ట్రవిభజన తర్వాత ఎన్నో ఫ్లయిఓవర్లు, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జ్‌లు, వంతెనలు కట్టినా, పలు మార్గాల్లో మెట్రో పరుగులు పెడుతున్నా యీ సమస్య రోజురోజుకి ఎక్కువవుతోంది తప్ప తగ్గటం లేదు. ప్రస్తుత ప్రభుత్వం హైడ్రాను ఉపయోగించి, ఆ సమస్యను కొంతమేరకైనా తీర్చగలదా? అనేది చూద్దాం. హైడ్రా అంటే బుల్‌డోజర్ కూల్చివేతలే కానీ ట్రాఫిక్‌తో దానికేం సంబంధం? అనుకోకండి. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ మానిటారింగ్ అండ్ ప్రొటెక్షన్) పేర ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలగించటం, అక్రమ నిర్మాణాలను కూల్చడం, కాలనీల్లో పార్కులు, ఆటస్థలాల వంటివి ఆక్రమించకుండా చూడడం, తాగునీరు, విద్యుత్తు సరఫరా వంటి విధులు అప్పగించారు.

దీనితో పాటు నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలగింపు, రోడ్లు, ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురి కాకుండా చూస్తూ ట్రాఫిక్ నిర్వహణ మెరుగుపరచడం, వంటి విధులు కూడా అప్పగించారు. నగరవాసిగా, రద్దీ బాధితుడిగా నాకు ట్రాఫిక్ అంశం ఎక్కువ ఆకర్షణీయంగా కనబడింది. నిజంగా పరిస్థితి మెరుగు పడుతుందా అనే సందేహం ఉన్నా, మెరుగు పడకపోతే ఎలా అనే భయమూ కలుగుతోంది. ట్రాఫిక్ అనేది ఎంత ముఖ్యమైన అంశంగా నేను పరిగణిస్తానో 2007 సెప్టెంబరులో ‘‘జన విజ్ఞాన వేదిక’’ నిర్వహించిన చర్చావేదికలో నా ప్రసంగం తెలుపుతుంది. ఆనాటి నా ఉపన్యాస పాఠం ముందుగా యిచ్చి, తర్వాత హైడ్రా గురించి నా అభిప్రాయాలు పంచుకుంటాను.

-‘ట్రాఫిక్‌ సమస్యల వచ్చే పలు రకాల నష్టాల గురించి మొదటగా ప్రస్తావిస్తాను. అన్నీ అందరికీ తెలిసిన విషయాలే, పెద్దగా విశదీకరించ వలసిన అవసరం లేదు కాబట్టి క్లుప్తంగా బుల్లెట్‌ పాయింట్స్‌గా చెప్తాను.

1) సమయనష్టం – మనిషి ఆయుర్దాయమే తక్కువ. దానిలో యాక్టివ్‌గా వుండే వయసు నాల్గవ వంతే! ఆ వయసులో రోజులో నాలుగు గంటలు ట్రాఫిక్‌లో వ్యర్థమై పోతోంది. ఆ సమయాన్ని ప్రోడక్టివ్‌గా వినియోగిస్తే దేశానికి లాభం, ఆత్మీయులతో గడిపితే కుటుంబానికి, సమాజానికి శ్రేయం.

2) ఆరోగ్యనష్టం – ట్రాఫిక్‌ కారణంగా కలిగే వాయు, శబ్ద కాలుష్యం వలన ఆరోగ్యం చెడుతోంది. ట్రాఫిక్‌లో యిరుక్కుని పోవడం వలన కలిగే ఒత్తిడి వలన కూడా చెడుతోంది.

3) పనులు భగ్నం కావడం – వైద్యసహాయం సరైన సమయానికి అందకపోవడం, ఇంటర్వ్యూలు, ఎపాయింట్‌మెంట్స్‌ మిస్‌ కావడం.. తద్వారా ఉద్యోగాలలో, వ్యాపారాలలో నష్టం.., బస్సు, రైలు, విమానం సమయానికి అందుకోలేక ప్రయాణాలు తప్పిపోవడం

4) పారిశ్రామిక వాతావరణం దెబ్బ తినడం – పరాయి రాష్ట్రాల నుంచి, ఇతరదేశాల నుంచి వచ్చే నిపుణులు, పెట్టుబడిదారులు ట్రాఫిక్‌లో యిరుక్కుని, యీ నగరం తమకు అనువైనది కాదని అనుకోవడం, ఉత్పాదనల రవాణాకు అవరోధం, వ్యాపారావకాశాలకు విఘాతం, కొత్త పరిశ్రమలు రావు, పాతవి తరలిపోతాయి.

రద్దీకి కారణాలేమిటి? – 1) కుదించుకుపోతున్న రోడ్డు స్పేస్‌ – నగరం రూ స్థాయిలో విస్తరిస్తుందని ప్లానర్లు వూహించ లేదు. వాహనాలు విపరీతంగా పెరిగాయి. రోడ్ల మేన్‌టెనెన్స్‌ బాగోలేదు. కంట్రాక్టర్లు నాసిగా వున్నారు. బాగా వున్న రోడ్లకు, గుంతల్లేని రోడ్డు భాగానికి అందరూ ఎగబడుతున్నారు. దాంతో అక్కడ ట్రాఫిక్‌ పెరుగుతోంది. రోడ్ల అంచులు ప్రమాదకరంగా వుండడం వలన ఏ డ్రైవరూ వాహనాన్ని రోడ్డు నుంచి దింపడు. ఓ పద్ధతి లేకుండా ఎక్కడ పడితే అక్కడ స్పీడు బ్రేకర్లు వేయడం, ఒక్కోటి ఒక్కో ఎత్తులో, ఒక్కో షేపులో ఉండడం..

2) ఎన్‌క్రోచ్‌మెంట్స్‌ – పేవ్‌మెంట్లపై షాపుల పబ్లిసిటీ సామగ్రి, కస్టమర్లకై బెంచీలు, నిర్దాక్షిణ్యంగా తొలగించకపోవడం, కాలనీల్లో యిళ్ల కాంపౌండ్‌ వాల్స్‌, అరుగులు, వాహనాల రాంప్స్‌, మొక్కలు పేవ్‌మెంట్స్‌పై రాకుండా చూడకపోవడం, ఫంక్షన్ల కంటూ షామియానాలు వేయడానికి అనుమతి యివ్వడం

3) హాకర్స్‌ – రోడ్డు విస్తరించగానే వీళ్లు వచ్చి ఆక్రమిస్తున్నారు. చౌక వస్తువుల కోసం ప్రజలు వీరిని ప్రోత్సహిస్తున్నారు. వీరిని తొలగిస్తే అయ్యో పాపం పేదలు అంటూ మీడియా కూడా విరుచుకు పడుతోంది. వీరిని దగ్గర్లో వున్న ప్రభుత్వస్థలాలకు తరలించాలి. వీరి విషయంలో, ముష్టివాళ్ల విషయంలో మిస్‌ప్లేస్‌డ్‌ సింపతీకి తావు యివ్వకూడదు.

4) మతస్థలాలు – వీటిని సహిస్తున్న కొద్దీ పుట్టుకొస్తున్నాయి, పోటాపోటీలుగా మొలుస్తున్నాయి. ఒకసారి వెలిశాక చుట్టూ, చెప్పుల స్టాండంటూ, పూల దుకాణాలంటూ ఏరియా పెంచుకుంటూ పోతున్నాయి. అన్ని ప్రార్థనాలయాలను దగ్గర్లో వున్న పెద్ద గుడి/మసీదు కాంపౌండులోకి తరలించాలి. కొత్తవి అనుమతించ కూడదు.

5) సమాధులు, స్మశానాలు – అవి ఎల్లకాలం అక్కడే ఉండవలసిన అవసరం లేదు. దగ్గర్లో వున్న పెద్ద స్మశానానికి తరలించాలి.

6) రవాణా శాఖ లోపాలు – ఒక రిపోర్టు ప్రకారం డ్రైవర్స్‌లో 30% మంది నిరక్షరాస్యులు. కనీసం 8 వ తరగతి వరకైనా చదవాలనే షరతు కొత్తవారికే కాదు, పాతవారికీ విధించాలి. లైసెన్సు వున్న వారిలో కూడా రూల్సు మరచినవారెందరో! హెల్మెట్‌ క్లాసులు పెట్టినట్టు రోడ్‌సైడ్‌ షోలు పెట్టి రూల్సు గురించి ఎడ్యుకేట్‌ చేయాలి.

ఆరోగ్యరీత్యా డ్రైవింగ్‌కు అనర్హులు ఎందరో ఉంటారు. డాక్యుమెంట్స్‌ చెకింగ్‌‌తో బాటు కంటిపరీక్ష కూడా నిర్వహించాలి. ఫ్యూయల్‌ ఎఫిషియన్సీ లేని వాహనాలవల్ల కాలుష్యం పెరుగుతోంది. గ్రీన్‌ టాక్స్‌ కట్టించుకుని అనుమతిస్తున్నారు. 4 స్ట్రోక్ యింజన్లనే నగరంలో అనుమతించాలి. పెనాల్టీలు, అదనపు పన్నులు వద్దు, వాటిని పట్టణాలకు తరలించాలి. అప్పుడు ప్రయివేటు వాహనాలు తగ్గి, పబ్లిక్‌ వాహనాలకు డిమాండు పెరుగుతుంది.

7) పోలీసింగ్‌ వ్యవస్థ వైఫల్యం – తగినంతమంది పోలీసులు లేరు. వారిని యితర విధులకు వుపయోగిస్తున్నారు. వారిపై నిరంతరం ఒత్తిడి పెరుగుతోంది. వాయుకాలుష్యం వలన, శబ్దకాలుష్యం వలన అనారోగ్యం పాలవుతున్నారు. వర్షాలనుండి, ఎండల నుండి వారికి రక్షణ లేదు, టాయిలెట్‌ సౌకర్యం లేదు. వారికి మంచి యిమేజ్‌ లేదు, వారంటే పౌరులకు భయం లేదు. ట్రాఫిక్‌ ఎఫెండర్స్‌ను అక్కడికక్కడ నిలువరించే వ్యవస్థ లేదు.

15 వేల మంది పోలీసులను నియమించగానే సరిపోదు. అనేక చర్యలు చేపట్టి పోలీసులకు ఆత్మగౌరవం, వారంటే పౌరులకు మర్యాద కలిగించాలి.

8) ట్రాఫిక్‌ నిర్వహణలో లోపాలు – పాదచారులు – ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వాహనదారులకు మాత్రమే అనుకుంటారు వీరు. సిగ్నల్‌ లేకుండా రోడ్డు దాటే పాదచారులకు ఫైన్‌ వేయాలి. జీబ్రా క్రాసింగ్స్‌ సరిపోయినంతగా లేవు. నగరానికి వచ్చే ఫ్లోటింగ్‌ పాప్యులేషన్‌ తబ్బిబ్బు పడుతూంటారు. వారి కోసం సూచనలు హోర్డింగులుగా పెట్టాలి. ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జ్‌లు చాలా కట్టాలి. వాటిని వాడని పాదచారులకు ఫైన్‌ వేయాలి. ఉన్న ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌లు, అండర్‌ బ్రిడ్జ్‌లు హాకర్లతో, బెగ్గర్లతో నిండిపోతున్నాయి. వారిని నిర్దాక్షిణ్యంగా తరిమేయాలి. వారిని ఆదరించే పౌరులను హెచ్చరించాలి.

9) సొంత వాహనాలు పెరగడం – పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టుపై ప్రజలకు విశ్వాసం లేదు. బస్సులను, లోకల్‌ రైళ్లను సమయానికి నడపగలగాలి. బస్సులలో రద్దీ, టిక్కెట్‌ ధర ఎక్కువగా ఉంటోంది. స్త్రీలకు, పిల్లలకు, వృద్ధులకు ప్రత్యేక బస్సులు నడపాలి. టిక్కెట్టు ధర బాగా తగ్గించి, స్వంత వాహనంవైపు మొగ్గకుండా చేయాలి. బస్సుల కంటె లోకల్‌ రైళ్లను ప్రోత్సహించాలి, అవి ఎక్కువ మందిని తీసుకెళతాయి. నిర్వహణావ్యయం, కాలుష్యం తక్కువ. కొత్త రూట్లలో రైల్వే లైన్లు వేయాలి. రైల్వే స్టేషన్లకు, బస్‌డిపోలకు మధ్య బస్‌లు నడపాలి. మెట్రో ప్రాజెక్టు వస్తోందంటూ లోకల్‌, ఎంఎంటియస్‌లను పరిపుష్టం చేయడం లేదు. అన్ని వర్గాలకు రవాణా సౌకర్యం ఉండేట్లు చూడాలి.

10) లేనింగ్‌ వ్యవస్థ లేకపోవడం – స్పీడ్‌ ట్రాక్స్‌ లేవు. లేన్‌ వ్యవస్థ అవలంబించటం లేదు. స్పీడ్‌ ట్రాక్ క్లస్టర్స్‌ ఏర్పడాలి. ట్రక్‌లకు పెట్టినట్టుగానే స్లో మూవింగ్‌ వాహనాలకు టైమింగ్స్‌ నిర్ధారించాలి. వ్యాస్‌ నగర కమీషనర్‌గా ఉండే రోజుల్లో అప్పటి రోడ్ల మీదే ‘వ్యాసగీతలు’ పెట్టగలిగారు. ఇప్పుడు పెట్టలేరా?

11) అవగాహనా లేమి – ఎన్ని సౌకర్యాలున్నా, ఎంతమంది సిబ్బంది వున్నా ప్రజలకు సివిక్‌ సెన్సు వుండాలి. హెల్మెట్స్‌ పెట్టుకోరు, లెఫ్ట్‌ ఓవర్‌టేకింగ్‌ చేస్తారు, పోట్లాటకు దిగుతారు. పోలీసు టాయిలెట్‌కై అరక్షణం కనుమరుగైతే, అందరూ రూల్సు అతిక్రమించి నిమిషాల్లో ట్రాఫిక్‌ జామ్‌ చేసేస్తారు. రోడ్డుపై వాహనం ఆగిపోతే డ్యూటీ మానేసి వచ్చి పోలీసే వచ్చి తొయ్యాలి తప్ప సాటి పౌరుడు దిగి రాడు.

మరి పరిష్కారాల మాటేమిటి?

1) మోటారబుల్‌ స్పేస్‌ను పెంచాలి – లూప్‌ రోడ్లు నిర్మించాలి. రోడ్లను వేయడం, నిర్వహణ కాలనీ సంఘాల పర్యవేక్షణలో జరగాలి. కాంట్రాక్టర్లను, లాలూచీ పడినవారిని కఠినంగా శిక్షించాలి. కాలనీ రోడ్లలో అన్ని స్పీడు బ్రేకర్లను తొలగించాలి. రోడ్లు పేద పిల్లల ఆటస్థలాలు కావని నిర్మొహమాటంగా ప్రకటించాలి. రోడ్లపై విద్యుద్దీపాలు వుండి తీరాలి. పొదుపు పేరుతో ఆర్పేయరాదు.

2) అవగాహన పెంచాలి – స్కూలు స్థాయి నుండి ట్రాఫిక్‌పై అవగాహన పెంచాలి. నిబంధనలు పాటించక పోతే జరిగే నష్టాలను స్కిట్స్‌ రూపంగా, టీవీ షోల రూపంగా వివరిస్తూనే వుండాలి. పెద్దలకు పునశ్చరణ తరగతులు పెట్టాలి. ట్రాఫిక్‌ అఫెండర్‌కు, పోలీసుకు జరిగే వాదనలో పోలీసుపక్షం వహించేట్లా పౌరులను తీర్చిదిద్దాలి. కొన్ని ముఖ్యమైన సెంటర్లలో వాలంటీరు దళాలు ఏర్పడాలి. వారి కయ్యే ఖర్చు కార్పోరేట్లు భరించాలి. జంక్షన్‌లలో గార్డెన్‌ నిర్వహణలా దీని వ్యయం కూడా సిఎస్‌ఆర్‌ క్రింద చూపవచ్చు.

ఇదీ 2007 నాటి ఉపన్యాస సారం. గత 17 ఏళ్లలో ట్రాఫిక్‌ సమస్య హైదరాబాదులో అంతకంతకూ పెరుగుతూ వచ్చి, నగరం బెంగుళూరుతో పోటీ పడుతోంది. రాష్ట్ర విభజన తర్వాత నగరంలో రద్దీ తగ్గుతుందని అనుకున్నారు కానీ ఏమీ తగ్గలేదు. ఆంధ్ర నుంచే కాక, తూర్పు రాష్ట్రాల నుంచి, ఉత్తరాది రాష్ట్రాల నుంచి యిబ్బడిముబ్బడిగా అన్ని వర్గాల వారూ వచ్చి పడుతున్నారు. శాంతిభద్రతలు బాగుండడంతో, పారిశ్రామిక వాతావరణం అనువుగా ఉండడంతో కొత్తకొత్త పరిశ్రమలు వస్తున్నాయి. సకల భాషీయులను యిముడ్చుకోగల తెలుగు సంస్కృతి దేశంలోని యితర ప్రాంతీయుల వలసలకు దోహదకారిగా ఉంది. ధనప్రవాహం పెరిగి, కన్స్యూమరిజం హద్దులు దాటి, కార్ల సైజు యింకాయింకా పెరుగుతోంది. ఊళ్లో పార్కింగుకి స్థలం దొరకడం గగనమై పోతోంది.

ఫ్లయి ఓవర్లు పెరిగాయి, వాటితో పాటు రోడ్లపై ఆక్రమణలూ పెరిగాయి. కొద్దిపాటి వర్షానికే రోడ్లు జలమయమై పోయి, వాహనాలు గంటల తరబడి నిలిచి పోతున్నాయి. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ తగ్గించి వేసి యు-టర్న్‌లు పెట్టే ప్రయోగం సత్ఫలితాలను యివ్వటం లేదు. మతావేశం పెరిగి గతంలో కంటె వేగంగా రోడ్లపై ప్రార్థనాలయాలు పెరిగిపోయాయి. గమ్యం ఎప్పుడు చేరతామో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టు లాడుతున్నాం. పంక్చువాలిటీ అనేది భయపట్టే పదంగా మారింది. ఈ పరిస్థితుల్లో 2024 జులైలో హైడ్రా అవతరించి, అక్రమ ఆక్రమణలను తొలగించి వేస్తానంటూ అట్టహాసంగానే రంగంలోకి దిగింది. సినీనటుడు నాగార్జున ఎన్-కన్వెన్షన్ కూల్చివేతతో హెడ్‌లైన్స్ ఆక్రమించింది.

1970లలో హైదరాబాదులో వర్షం కురిస్తే, పావుగంటలో రోడ్లపై నీరు ఉండేది కాదు. ఈ రోజుల్లో నిన్న వర్షం కురిస్తే, యివాళ్టికి కూడా వర్షపు నీరు నిలిచిపోతోంది. నీటి గుంటలు ఏర్పడడంతో అవి ఎంత లోతు ఉన్నాయో అంచనాకు అందక, అందరూ వాటిని తప్పించుకునే ప్రయత్నంలో ఒకే చోట యిరుక్కుపోతున్నారు. నీరు పోయే మార్గాలన్నీ ఆక్రమణలకు గురి కావడమే రోడ్లను నీళ్లు ముంచెత్తడానికి కారణమంటున్నారు. ఆంధ్రలో యిటీవలి వరదల బీభత్సానికి కారణం, బుడమేరు ప్రవాహ దారిలో కాలువలు, వాగుల్లో కబ్జాలు, స్థలాలలో ఆక్రమణలు జరిగి జనావాసాలుగా మారడం! విజయవాడలో కొన్ని ప్రాంతాలు మునిగినట్లుగా, హైదరాబాదులో కొన్ని ప్రాంతాలు కూడా మునిగే రోజు దూరంలో లేదు.

ఇప్పుడీ హైడ్రా చెరువుల్లో ఆక్రమణలపై దృష్టి పెట్టింది. అవి తొలగిస్తే, వర్షపు నీరు చెరువుల్లోకి ప్రవహించి, రోడ్లపైకి రాకుండా ఉంటుంది. చెరువు మధ్యలో కట్టేసినవి, చెరువు అంచుల్లో కట్టేసినవి కూలిస్తే ఎవరూ ఏమీ అనలేక పోయేవారు. కానీ చెరువు ఎఫ్‌టిఎల్ (ఫుల్ టాంక్ లెవెల్), బఫర్ జోన్లలో కట్టినవి కూడా కూల్చివేస్తాం అంటూ హైడ్రా దూకుడుగా వెళ్లి అనే ఫ్లాట్లను, విల్లాలలను కూల్చివేసింది, అది కూడా 40 ఏళ్ల క్రితం నాటి మ్యాప్‌లు చేత పట్టుకుని! ‘అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు తీసుకుని, ఎల్‌ఐసి, బ్యాంకులు వంటి ప్రభుత్వ ఋణసంస్థలు సంతృప్తి పడి రూల్సు ప్రకారం యిచ్చిన లోన్లతో కట్టుకున్న యిళ్లను, నోటీసైనా యివ్వకుండా అలా ఎలా కూలుస్తారు?’ అని అనేక మంది మధ్యతరగతి వాళ్లు తిరగబడ్డారు. ‘అనుమతులు యిచ్చిన వారిపై, ఋణాలు యిచ్చిన వారిపై మాకు నియంత్రణ లేదు. ఏ నోటీసులు యివ్వనక్కర లేకుండా మీ యిళ్లు కూల్చివేసే అధికారం మాకు ప్రభుత్వం యిచ్చింది. దాన్ని అమలు చేస్తున్నాం.’ అంది హైడ్రా.

సమాజపు తీరు ఎలా ఉంటుందంటే ధనవంతుల ఆస్తులు, వారి ఫార్మ్‌హౌస్‌లు, గెస్ట్‌హౌస్‌లు ధ్వంసం చేస్తే అంతా భేష్‌భేష్ అంటారు. ఎవరిది కూల్చినా నియమాలు పాటించాలి కదా అని ఎవరూ అనుకోరు. అదే పేదవారు ఆక్రమణలు తొలగిస్తే అయ్యో పాపం అంటారు. ఆక్రమణ అనేది ఎవరు చేసినా అక్రమమేగా అనుకోరు. హైడ్రా అధిపతులకు యీ విషయం తెలుసు. దూకుడు తగ్గిద్దామని వారు అనుకోగానే వారు మధ్యతరగతి వారి యిళ్లు కూలగొట్టి, ప్రజల్లో వ్యతిరేకత వచ్చేట్లు చేశారు. వాళ్లు కోర్టులకు వెళ్లేట్లు చేశారు. ‘దుండిగల్, మల్లంపేట, అమీన్‌పూర్‌లలో నిర్మాణాలకు అనుమతులిచ్చిన దరిమిలా రద్దు చేశారు, కానీ డెవలపర్లు నిర్మాణాలు చేపట్టి విక్రయించడంతో కూల్చివేశాం’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాజాగా చెప్తున్నారు. ‘అనుమతులు రద్దు చేసిన విషయాన్ని ప్రభుత్వశాఖలు కొనుగోలుదారులకు తెలియపరిచాయా? ఆ మేరకు పత్రికా ప్రకటనలు యిచ్చాయా?’ అని కోర్టులో ప్రశ్నలు రావడం సహజం.

ఇక ఆపేద్దామను కున్నపుడు పేదల యిళ్లపైకి వెళ్లారు. వెంటనే రాజకీయ నాయకులు రంగంలోకి దిగారు. పేదల జోలికి వస్తే ఊరుకోం అని హుంకరించారు. మధ్యలో కోర్టు కూడా నోటీసు లివ్వకుండా కూల్చడమేమిటి? శనాదివారాల్లో కూల్చడమేమిటి? అని చివాట్లు వేసింది. దాంతో మూడు నెలల పాటు విరామం అని ప్రకటించి, కామా పెట్టేశారు. రంగనాథ్ గారు యిప్పుడు ‘ఆయా ప్రాంతాల్లో చెల్లుబాటయ్యే అనుమతులతో నిర్మిస్తోన్న భవనాలను యిక నుంచి కూల్చేది లేదని పేర్కొన్నారు. అనుమతులు లేకుండా చేపడుతోన్న నిర్మాణాల విషయంలో చట్టప్రకారం వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. సమగ్ర వివరాల సేకరణ అనంతరం తదుపరి చర్యలుంటాయని చెప్పారు. అంటే సమగ్రంగా విచారించకుండానే, చట్టంతో సంబంధం లేకుండానే యిన్నాళ్లూ వ్యవహరించినట్లు ఒప్పుకున్నట్లేగా!

ఈ విరామంతో ధనవంతులైన ఆక్రమణదారులు కొందరు బతికిపోయారు. హైడ్రా అందరితోనూ ఒకేలా వ్యవహరించ లేదు. కొందరికీ ఏ నోటీసు యివ్వకుండా ఎకాయెకి కూల్చేస్తూనే, మరి కొందరికి నోటీసులిచ్చి, సవరించుకోవడానికి సమయమిచ్చింది. ప్రస్తుత విరామంలో వాళ్లు తమ ఇర్రెగ్యులారిటీని రెగ్యులరైజ్ చేయించేసు కుంటారో, కోర్టుకి వెళ్లి స్టేలు తెచ్చుకుంటారో తెలియదు. మొత్తం ఆక్రమణ లెన్ని? కూల్చినవెన్ని? కూల్చవలసినవి ఎన్ని? కూల్చలేకపోతున్నవి ఎన్ని? కారణాలేమిటి? యిలాటి వివరాలతో నెలనెలా ప్రోగ్రెస్ రిపోర్టు ప్రకటిస్తేనే హైడ్రా లక్ష్యంపై ప్రజలకు గురి కుదురుతుంది. ఈ కామా ఫుల్ స్టాప్ కాదనే ధైర్యం చిక్కుతుంది. గత ప్రభుత్వ హయాంలో కూడా వర్షాకాలం వచ్చి కొన్ని కాలనీలు మునగగానే ‘ఆక్రమణలపై ఉక్కుపాదం’ అనే వార్త వచ్చేది. పై ఏడాది వర్షాకాలం వరకు అది మళ్లీ వినబడేది కాదు.

విల్లాలు, భవంతులు, మూసీ ఆక్రమణదారుల యిళ్లు యివన్నీ కూల్చడంలో చిక్కులున్నాయి కాబట్టి ఆ విభాగంలో హైడ్రా విరామం తీసుకుందంటే సరేలే అనుకోవచ్చు. హైడ్రా బాధ్యతల్లో భాగమైన హోర్డింగులను, ఫుట్‌పాత్‌లపై దుకాణదారుల ఆక్రమణలను, రోడ్లపై హాకర్లను, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలపై ముష్టివాళ్లను, ట్రాఫిక్ లైట్ల వద్ద జబర్దస్తీగా వసూళ్లు చేసే వాళ్లను తొలగించడానికి ఏ కష్టం వచ్చింది? దానికి బుల్‌డోజర్లు అక్కలేదు. కొంతమంది సిబ్బంది చాలు. పబ్లిసిటీ రాకపోవచ్చు. కానీ ట్రాఫిక్ మెరుగుపడుతుంది. పాదచారులు వాహనాలకు అడ్డుగా రావడం తగ్గుతుంది. హైడ్రా బాధ్యతల్లో విపత్తు నిర్వహణ కూడా ఉంది. రోడ్లపై గుంతలుండడం విపత్తులో భాగమే అనుకుని, గుంతలు పూడ్చే కార్యక్రమం చేపడితే కూడా ట్రాఫిక్ వేగం పెరుగుతుంది.

రోడ్లను ఆక్రమించిన ప్రార్థనా స్థలాలపై అక్టోబరు 1న సుప్రీం కోర్టు ఒక కీలకమైన తీర్పు నిచ్చింది. రహదారులను, జలాశయాలను, రైల్వే ట్రాక్‌లను ఆక్రమించిన ఏ మతానికి చెందిన ప్రార్థనా స్థలాన్నయినా సరే కూల్చివేయాలని అంది. గుడి, దర్గా ఏదైనా కానీ పౌరుల రక్షణ (పబ్లిక్ సేఫ్టీ)కి ప్రతిబంధకంగా ఉంటే తొలగించ వలసినదే అంది. సుప్రీం కోర్టే చెప్పినపుడు యిక హైడ్రాకు అడ్డేముంది? నిక్షేపంలా, సత్వరమే ఆ పని మొదలుపెట్టవచ్చు. నడివీధిలో, వాహనాల రణగొణ ధ్వనుల మధ్య ప్రార్థన చేసుకుంటున్నామని ఎవరైనా అంటే అది అబద్ధమే. ఆ గుళ్లను దగ్గర్లో ఉన్న ఖాళీ స్థలానికి సకల సంప్రదాయాలతో తరలించి, ప్రశాంతంగా పూజో, ప్రార్థనో చేసుకోండి అని చెప్పవచ్చు. ఈ అవరోధాలను తొలగించి, రోడ్లను విశాలం చేయిస్తే అంతకంటె ఏం కావాలి? హైడ్రా యీ దిశగా తన దృష్టి సారించాలని ఒక హైదరాబాదు వాసిగా ఆశిస్తున్నాను.

– కె.ఐ. వరప్రసాద్ రెడ్డి (శాంతా బయోటెక్నిక్స్)

11 Replies to “కెవి: హైడ్రా ట్రాఫిక్ సమస్యలు తీరుస్తుందా?”

  1. ఈ మధ్య ఏదో పేపర్లో రాశారు..

    లకంబర్గ్ అనే వూళ్ళో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంతా ఫ్రీ చేసేసి , ప్రైవేటు వాహనాలు మీద అధిక పన్నులు వేస్తారు అంట. దానివలన అందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కవ వాడతారు.

    అక్కడ తక్కువ జనాభా కి , అక్కడి జనాలు అందరూ 40 శాతం టాక్స్ కట్టడం వలన ఇలాంటి ప్రయత్నాలు కుదురుతాయి.

    మన దగ్గర అధికా జనాభా, అందులో టాక్స్ కట్టేవాళ్ళు అర కొర . అందువలన అలాంటి ఫ్రీ పథకాలు మనకి సరిపడవు.

    హైద్రాబాదు లో ఆడవారికి ఫ్రీ బస్ పథకం వచ్చిన తర్వాత అవసరం లేకపోయినా సరే సరదాగా వచ్చి బస్సులో తిరుగుతున్నారు అంట. వారి వలన డబ్బు పెట్టీ టిక్కెట్టు కొన్న వారికి సీట్ దొరకడం లేదు.

  2. వందల కోట్లు వున్న వారికి ఒక ఇల్లు పోతే పెద్దగా వచ్చే నష్టం లేదు

    కానీ మద్య తరగతి వారికి లోన్ లో ఇల్లు కొనుక్కుని నెల నెలా ఆ బ్యాంకు లోన్ కి వడ్డీ లు కడుతూ వుండేవారికి ఆ ఇల్లు అకస్మాత్తుగా కూలిస్తే, వాళ్ళ జీవితమే కూలినట్లు.

  3. ఒ!రే!య్ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి (శాంతా బయోటెక్నిక్స్) ఇందులో … చర్చి గురించి ఎక్కడరా కోజ్జనాయాలా … ఆక్రమించిన ఏ మతానికి చెందిన ప్రార్థనా స్థలాన్నయినా సరే కూల్చివేయాలని అంది. గుడి, దర్గా ఏదైనా కానీ పౌరుల రక్షణ (పబ్లిక్ సేఫ్టీ)కి ప్రతిబంధకంగా ఉంటే తొలగించ వలసినదే అంది.

  4. అన్నింటికన్నా ముఖ్యమైనది “ఇంజనీరింగ్”, అసలు రోడ్డు ఎలా ఉండాలి? లేన్ లు ఎలావుండాలి? లేన్ మెర్జింగ్? ఎగ్జిట్ లు ఎలావుండాలి??? డ్రైనేజీ ఎక్కడుండాలి? ఫుట్ పాత్ ల పరిస్థితీయేమిటీ??? బస్ఏ బే లు, ఆటో బే లు, జనాలు రోడ్డు దాటడానికి దారి… ఇవేమీ ఆలోచించకుండా నల్లగా తారు రోడ్డు వేయడమే గొప్ప అనుకునే ఈ ప్రజలు/ప్రభుత్వాలు ఉన్నంత కాలం ఈ రోడ్లు ట్రాఫీక్ జాం లు ఇలాగే ఉంటాయి.

  5. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇన్ని కారణాలు చెప్పారు అసలు కారణం చెప్పలేదు.. గత 20-25 సంవత్సరాలుగా , హైదరాబాద్ లో ఎక్కడ స్థలం లేనట్లు గా…ఒకే వెస్ట్ వైపు గుద్దా లో పెట్టిన ఐటీ కంపెనీలు… హైటెక్ సిటీ, గచ్చిబౌలి గుద్దా లో కాకుండా కోకపేట అనే పిచ్చిపుకు విలేజ్ లో పెట్టీన కంపెనీస్ కూడా… A లౌడ lo కోకపేట్ వెళ్ళడానికి ఉప్పల్ నుండి వెళ్ళాలి అంటే మెట్రో అక్కడ నుండి 3 షేర్ ఆటో మారాలి.. ఈస్ట్ హైదరాబాద్ మొత్తం ఉదయం వెస్ట్ వైపు,sayanthram east vypu untundi…traffic lo చావాలి..చంద్ర బాబు తన కమ్మ కులపు మేలు కోసం ఘట్కేసర్ సంస్కృతి టౌన్షిప్ లో 199888 లో అప్పటి అబ్ వాజపేయి govt మొట్టమొదటి STPI ఏర్పాటు చేస్తే ఈ చెంబా గాడు మా ఈస్ట్ హైద్రాబాద్ ఐటీ develpment కాకుండా వెస్ట్ లో మురళీ మోహన్ బినామీ భూమ్ కి ధర రావాలి అని వెస్ట్ వైపు దెంగుకొని పోయాడు…మా ఈస్ట్ హైదరాబాద్ నీ ఐటీ విషయం లో చంద్రబాబు నుండి కేసీఆర్, ఇప్పటి రేవంత్ రెడ్డి వరకు ఎవ్వడు కూడా development cheyatledu

    1. sarigga cheppaaru….roju 4hrs traffic lo journey cheyalaeka sontha illu vadili West side shift ayyaanu….ippudemo high rents tho paatu…podhunne milk nundi school fees , hospital expenses varaku kharchulu thattukoleka pothunnaam…..Politicians anthaa daridrule…sontha laabham kosam janaalu chasthunnaa pattinchukoru l@#ja kod24ulu

  6. hydra will remain on crude joke it is based on all wrong assumptions n least practical premises. even if a class action suit is Raised our legal system incapable of any correction in time. leaders n even govt wud b replaced

Comments are closed.