భారత క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ రవిశాస్త్రికే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో జట్టుకు విజయవంతమైన కోచ్‌గా సేవలందించిన శాస్త్రిని తిరిగి ఆ పదవిలో నియమించేందుకు అడ్వయిజరీ కమిటీ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. కమిటీ సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ మరోసారి రవికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఈ విషయాన్నే రవికి చేరవేసి కోచ్ పదవికి నిబంధనల ప్రకారం దరఖాస్తు చేయాలని కోరారట. దీంతో రేపోమాపో కోచ్ పదవి కోసం రవిశాస్త్రి అప్లై చేయనున్నారు. ఛాంపియన్ ట్రోఫి ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో ఓటమి తరవాత కెప్టెన్ కోహ్లీతో తలెత్తిన విబేధాల కారణంగా కోచ్ అనిల్ కుంబ్లే రాజీనామా చేయడంతో పదవి ఖాళీ ఏర్పడింది.
కొత్త కోచ్ నియామకం కోసం అడ్వజయిరీ కమిటీ దరఖాస్తులు ఆహ్వానించగా ఆశించిన ఫలితం రాలేదు. కమిటీ ఆశించిన వారిలో చాలా మంది దరఖాస్తు చేసుకోలేదు. కుంబ్లేకు ముందు కోచ్ గా పనిచేసిన రవిశాస్త్రి అయితే కావాలంటే తనను నియమించండి గానీ దరఖాస్తులు, ఇంటర్వ్యూలంటే కుదరదని తెగేసి చెప్పాడు. ఏడాది క్రితం కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి పదవీ కాలం ముగిశాక మరోసారి తనను కొనసాగించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడు.
అయితే విదేశాల్లో ఉన్న కారణంగా అడ్వజయిరీ కమిటీ ఎదుట ఇంటర్వ్యూకు హాజరుకాలేదు. దీన్ని కారణంగా చూపి కమిటీ కుంబ్లేను నియమించింది. అయితే ఇంటర్వ్యూ సాకు మాత్రమేనని రవిని తప్పించి కుంబ్లేకు కోచ్ పదవి ఇవ్వాలని ముందుగానే కమిటీ నిర్ణయించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు జట్టులో నెలకొన్న గంభీర వాతావరణ పరిస్థితుల్లో రవిశాస్త్రి అయితేనే జట్టును సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలడని అడ్వజయిరీ కమిటీ భావిస్తోంది. కోహ్లీతో కూడా రవికి సత్సంబంధాలున్నాయి. దీంతో అడ్వయిజరీ కమిటీ కూడా రవిని సంప్రదించి పద్దతి ప్రకారం దరఖాస్తు చేసి ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరినట్టు సమాచారం. కమిటీ కోరిక మేరకు త్వరలోనే రవిశాస్త్రి కోచ్ పదవికి నిబంధనల మేరకు దరఖాస్తు చేయనున్నారు.