బంగ్లాపై శ్రీలంక ‘చితక్కొట్టుడు’

పసికూన బంగ్లాదేశ్‌పై, శ్రీలంక ఆటగాళ్ళు విరుచుకుపడ్డారు. బంగ్లా బౌలింగ్‌ని చితక్కొట్టారు. కేవలం ఒకే ఒక్క వికెట్‌ కోల్పోయి, 50 ఓవర్లలో 332 పరుగులు చేసింది శ్రీలంక. ఇందులో రెండు సెంచరీలు, ఒక అర్థ సెంచరీ…

పసికూన బంగ్లాదేశ్‌పై, శ్రీలంక ఆటగాళ్ళు విరుచుకుపడ్డారు. బంగ్లా బౌలింగ్‌ని చితక్కొట్టారు. కేవలం ఒకే ఒక్క వికెట్‌ కోల్పోయి, 50 ఓవర్లలో 332 పరుగులు చేసింది శ్రీలంక. ఇందులో రెండు సెంచరీలు, ఒక అర్థ సెంచరీ వున్నాయి. ఓపెనర్‌ తిరుమానే 52 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. మరో ఓపెనర్‌ దిల్షాన్‌, సంగక్కరతో కలిసి లంక స్కోర్‌ బోర్డ్‌ని 300 పరుగులు దాటించాడు.

బంగ్లా బౌలర్లు ఎవరూ లంక బ్యాట్స్‌మన్‌ని ఇబ్బంది పెట్టలేకపోయారనే చెప్పాలి. చెత్త ఫీల్డింగ్‌తో పరుగులు సమర్పించుకుని, కీలకమైన సందర్భాల్లో క్యాచ్‌లు కూడా వదిలేశారు బంగ్లా ఆటగాళ్ళు. ఫీల్డింగ్‌ మోహరింపులోనూ బంగ్లా సరైన వ్యూహాల్ని అమలుచేయలేకపోవడం లంకకు బాగా కలిసొచ్చింది. అనుభవజ్ఞులైన లంక బ్యాట్స్‌మన్‌, బంగ్లా అనుభవలేమిని ఓ రేంజ్‌లో క్యాష్‌ చేసుకుంది.

76 బంతుల్లో సంగక్కర 106 పరుగులు చేస్తే, 146 బంతుల్లో దిల్షాన్‌ 161 పరుగులు చేశాడు. లంక ఇన్నింగ్స్‌లో కేవలం ఒకే ఒక్క సిక్స్‌.. అది కూడా సంగక్కర కొట్టింది కావడం గమనార్హం. శ్రీలంక తరఫున వరల్డ్‌ కప్‌ పోటీల్లో వ్యక్తిగత స్కోర్‌ పరంగా దిల్షాన్‌ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డ్‌ లంక మాజీ ఆటగాడు డిసిల్వా పేరున (145 పరుగులు) వుండేది.