శ్రీలంక, బంగ్లాదేశ్ తలపడ్తున్నాయి వరల్డ్ కప్‌లో భాగంగా ఈ రోజు. అయితే ఈ మ్యాచ్‌పై పెద్దగా ఎవరికీ ఆసక్తి లేదు. కానీ, ఇదే మ్యాచ్‌కి సమాంతరంగా మరో మ్యాచ్ జరిగింది. ఆ రెండు జట్లూ పసికూనలే. అయితేనేం, మ్యాచ్‌ని రసవత్తరంగా మార్చేశాయి ఇరు జట్లూ. ఆఫ్గనిస్తాన్, స్కాట్‌లాండ్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లూ సత్తా చాటాయి. అయితే విజయం మాత్రం ఆప్గనిస్తాన్‌నే వరించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్‌లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో కేవలం 210 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్యం చిన్నదే కావడంతో ఆఫ్గనిస్తాన్ విజయం పెద్ద కష్టమేమీ కాదనుకున్నారంతా. కానీ, స్కాట్‌లాండ్ బౌలర్లు సత్తా చాటారు. టపటపా వికెట్లు రాలగొట్టారు. ఫలితంగా ఓ దశలో మ్యాచ్ ఆప్గనిస్తాన్ చేతుల్లోంచి స్కాట్‌లాండ్ చేతుల్లోకి వెళ్ళిపోయింది.
క్రికెట్‌లో అసలైన మజా ఏంటో చూపించాయి స్కాట్‌లాండ్, ఆప్గనిస్తాన్. ఆప్గనిస్తాన్ ఆటగాడు సమిఉల్లా షెన్వారీ 147 బంతులు ఎదుర్కొని 96 పరుగులు చేసి, తమ జట్టును విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేశాడు. చివర్లో అతని వికెట్ పడేసరికి, మ్యాచ్ కొత్త మలుపు తిరిగింది. తొమ్మిదో వికెట్‌గా షెన్వారీ ఔటయ్యేసరికి ఇంకొక్క వికెట్ తీస్తే స్కాట్‌లాండ్ గెలిచే అవకాశమేర్పడిరది.
కానీ, స్కాట్‌లాండ్ ఆ చివరి వికెట్ తీయలేకపోయింది. చివర్లో రనౌట్ ఛాన్స్‌నీ చేజార్చుకున్న స్కాట్‌లాండ్ ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. అయితేనేం క్రికెట్ అభిమానులకు స్కాట్‌లాండ్ సిసలైన మజా చూపించింది. ఆఫ్గనిస్తాన్, స్కాట్‌లాండ్ క్రికెట్ అభిమానులు నరాలు తెగే ఉత్కంఠను అనుభవించారు. క్రికెట్ లవర్స్ కూడా ఈ మ్యాచ్‌ని మేగ్జిమమ్ ఎంజాయ్ చేశారు. నిన్న యూఏఈ, ఐర్లాండ్‌ల మధ్య మ్యాచ్ కూడా ఇదే తరహాలో జరిగింది. ఈ వరల్డ్ కప్‌లో ఈ రెండు మ్యాచ్‌లే నరాలు తెగే ఉత్కంఠను క్రియేట్ చేశాయి.