ఏదైనా ఒక రంగంలో వారసులు కావడానికి రక్తం పంచుకునే పుట్టక్కర్లేదు. అంతటి కృషి చేసిన వాళ్ళంతా వారసులే అవుతారని భావన. దర్శకరత్న దాసరి నారాయణరావుకు ఇప్పుడు ఓ కొత్త వారసుడు దొరికాడు. ఆయనెవరో కాదు పూరి జగన్నాథ్. ఎంతోకాలం ఎదురు చూశాక ఇప్పుడు పూరి ఎందుకు వారసుడయ్యాడంటే, టెంపర్ సినిమాని గుర్తుచేసుకోక తప్పదు.
ఎర్రబస్సు ఫ్లాప్ అయ్యాక తనలో ఎక్కడ లోపం వుందో తెలుసుకోవడానికి దాసరిగారు మిగతా హిట్ డైరెక్టర్స్ సినిమాలు క్రమం తప్పకుండా చూస్తున్నట్లున్నారు. టెంపర్ సినిమా చూసి ఆ ఆనందం తట్టుకోలేక ఒక మనిషిని పంపించి, పూల బొకే అందజేసి, ఫోన్ చేసి ‘నువ్వేనయ్యా నా వారసుడివి.. ఎలాంటి వారసుడు లేకుండా శుభం కార్డు పడిపోతుందేమోననే బెంగ తీరిపోయింది..’ అని పూరిని దాసరి అభినందించడమే కాకుండా, ‘నా తర్వాత కోర్టు సీన్లు తియ్యడంలో నువ్వే గొప్పోడివి.. బొబ్బిలిపులి సినిమాలో కోర్ట్ సీన్లను తలదన్నేలా వున్నాయి’ అని కూడా కితాబులిచ్చాడట.
అసలు దాసరి నారాయణరావు అంటేనే లెజెండ్. ఒక తరానికి తిరుగులేని డైరెక్టర్. ఆయన ఇంకో టాలెంట్ ముందు వంగి వుండాల్సిన అవసరం లేదు. ఎన్నో కుటుంబ కథా చిత్రాలు, చారిత్రక చిత్రాలూ తీసి తరించిన దాసరి ముందు సోకాల్డ్ మూవీలు తీసే ఫక్తు కమర్షియల్ డైరెక్టర్స్ దిగదుడుపే. ఏ డైరెక్టర్ కూడా దాసరి స్థాయికి చేరుకోలేడనేది చారిత్రక సత్యం. అలాంటి దర్శకరత్న దాసరికి వెయ్యి మంది పూరి జగన్నాథ్‌లైనా సాటి రారు. మరెందుకు దాసరిగారు అలా ప్రకటించారో అర్థం కావడంలేదు చాలామందికి.