భారత్‌ – పాక్‌ క్రికెట్‌ ఆడాలా? వద్దా?

భారత్‌, పాకిస్తాన్‌ దాయాది దేశాలు. డెబ్భయ్‌ ఏళ్ళుగా రావణ కాష్టం రగులుతూనే వుంది ఇరు దేశాల మధ్యా. కాశ్మీర్‌ పేరుతో పాకిస్తాన్‌ చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. చాలాసార్లు ఇండియాపై దండెత్తిన పాకిస్తాన్‌…

భారత్‌, పాకిస్తాన్‌ దాయాది దేశాలు. డెబ్భయ్‌ ఏళ్ళుగా రావణ కాష్టం రగులుతూనే వుంది ఇరు దేశాల మధ్యా. కాశ్మీర్‌ పేరుతో పాకిస్తాన్‌ చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. చాలాసార్లు ఇండియాపై దండెత్తిన పాకిస్తాన్‌ కొంత మేర మనల్ని నష్టపరచగలిగిందిగానీ, అదే సమయంలో తాను ఇంకా దారుణంగా నష్టపోయింది. కుక్క తోక వంకర అన్న చందాన, ప్రతిసారీ భారత్‌తో సయోధ్య కోసం ప్రయత్నిస్తుండడం, ఆ వెనకాలే వెన్ను పోటు పొడుస్తుండడం పాకిస్తాన్‌కి అలవాటైన 'క్రీడ'. 

క్రికెట్‌లో భారత్‌, పాక్‌ తలపడితే ఆ మజానే వేరు. ఆట ఆడుతున్నాం.. అన్నట్టు కాకుండా, యుద్ధం చేస్తున్నాం అన్న భావనతో రంగంలోకి దిగుతారు ఇరు జట్ల ఆటగాళ్ళు. అలా బరిలోకి దిగిన ఆటగాళ్ళ మధ్య మాటల యుద్ధం, ఒకానొక దశలో ఒకర్ని ఒకరు కవ్వించుకోవడం, తోసుకోవడం జరిగిన సందర్భాలు ఎన్నో వున్నాయి. విదేశీ వేదికలపైనా, భారత్‌, పాక్‌లలోనూ మ్యాచ్‌లు జరిగినప్పుడు ఇవన్నీ సర్వసాధారణంగా మారిపోయాయి. 

అయితే గత కొంతకాలంగా పాకిస్తాన్‌తో క్రికెట్‌ ఆడేందుకు భారత్‌ సుముఖత వ్యక్తం చేయడంలేదు. భారత్‌పై పాకిస్తాన్‌ తీవ్రవాదుల్ని ప్రయోగిస్తుండడమే ఇందుకు కారణం. పాకిస్తాన్‌ మాత్రం, భారత్‌తో క్రికెట్‌ ఆడేందుకు తహతహలాడుతోంది. ఐసీసీకి ఓ సారి ఇదే విషయమై పాక్‌ ఫిర్యాదు చేసింది కూడా. కానీ, క్రికెట్‌ పేరుతో స్నేహహస్తం అందించి, తీవ్రవాదం పేరుతో వెన్నులో బల్లెం దించుతున్న పాకిస్తాన్‌పై భారత్‌ గుర్రుగా వుంది. 

తాజాగా పాకిస్తాన్‌ నుంచి మరోమారు భారత్‌తో క్రికెట్‌ ఆడే విషయమై ప్రయత్నాలు మొదలయ్యాయి. భారత్‌ మాత్రం ఈ పాకిస్తాన్‌తో క్రికెట్‌ ఆడేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు. 'ఆటను ఆటగానే చూడాలి.. ఆట ఇరు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాల్ని పెంచుతుంది..' అంటూ భారత్‌కి క్లాస్‌ పీకే స్థాయికి ఎదిగిపోయినట్లు పాకిస్తాన్‌ వ్యవహరిస్తోంది. కానీ, కాశ్మీర్‌ విషయంలోనూ తీవ్రవాదం విషయంలోనూ పాకిస్తాన్‌ తన వైఖరి మార్చుకుంటే తప్ప, పాకిస్తాన్‌తో ఆట సహా ఏ సంబంధాల్నీ భారత్‌ కోరుకోవడంలేదని, భారత్‌ వైపు నుంచి స్పష్టంగా సంకేతాలు వెళ్తున్నాయి. 

దేశ ప్రజానీకం కూడా పాకిస్తాన్‌తో భారత్‌ క్రికెట్‌లో తలపడరాదనే భావిస్తోంది. ఐసీసీ మాత్రం ఇరు దేశాలూ విభేదాలు పక్కన పెట్టి, సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలనీ, ఆటను రాజకీయం చేయరాదని చెబుతోంది. ఎవరేం చెప్పినా, పాకిస్తాన్‌తో క్రికెట్‌ ఆడటం అన్నది ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాకపోవచ్చు.