అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు టీమిండియా ఆటగాడు వీరేందర్ సెహ్వాగ్. టెస్టులైనా, వన్డేలైనా అతడికి ఒకటే. బంతి వికెట్ల మీదకు దూసుకొస్తోందా.. దాన్ని స్టాండ్స్‌లోకి తరలించి బుద్ధి చెప్పడమే తన పని అన్నట్టు వ్యవహరించేవాడు సెహ్వాగ్. అంతర్జాతీయ క్రికెట్లో సెహ్వాగ్‌కి ఎవరు బౌలింగ్ చేసినాసరే, చితక్కొట్టించుకోవాల్సిందే. ఎంతటి బౌలర్ అయినా సెహ్వాగ్ క్రీజ్‌లో వున్నాడంటే వణకాల్సిందే. నిర్దాక్షిణ్యంగా బంతిని బలంగా బాదడంలో దిట్ట వీరేందర్ సెహ్వాగ్.
ఎలాంటి ఆటగాడికైనా సరే, ఆటలో హిట్, ఫ్లాప్ తప్పవు. సెహ్వాగ్ కూడా అంతే. ఫామ్ కోల్పోయి తంటాలు పడ్డాడు. గాయాలతో బాధపడ్డాడు. టీమిండియాకి ప్రధాన బలం తానే అయినా, జట్టులో స్థానం కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఇక, టీమిండియాలో చోటు దక్కదని అనుకున్నాడో ఏమో, క్రికెట్‌కి ఇక సెలవ్.. అని ప్రకటించేశాడు.
డాషింగ్ ఓపెనర్.. అన్న పదానికే వన్నె తెచ్చిన సెహ్వాగ్, భారత్‌కి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ఇక మ్యాచ్ డ్రా అయిపోతుంది.. అనుకున్న సమయంలో టెస్ట్ మ్యాచ్‌ని వన్డే తరహాలో మార్చేసి, టీమిండియాని విజయాల బాట నడిపించిన ఆటగాడు ఎవరైనా వుంటే అది సెహ్వాగ్ మాత్రమే. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ, వన్డేల్లో డబుల్ సెంచరీ ఇవి సెహ్వాగ్ ఘనతకు నిదర్శనాలు. 90 పరుగుల్లో వున్నప్పుడు కూడా బలంగా సిక్స్‌లు బాదడం, క్రీజ్ బయటకు వచ్చి, బంతిని స్టాండ్స్ దాటించేందుకు ఇష్టపడటం సెహ్వాగ్‌కి మాత్రమే చెల్లింది.
మొత్తం 100కి పైగా టెస్టులు ఆడిన సెహ్వాగ్ 8 వేల పరుగులు పైగా చేశాడు. 250కి పైగా వన్డేలు ఆడి, వన్డేల్లోనూ 8 వేల పరుగుల మైలు రాయిని దాటేశాడు. మోడ్రన్ క్రికెట్లో బంతిని బలంగా బాదడం, తనదైన టెక్నిక్‌తో విరుచుకుపడ్డం.. వంటివి సెహ్వాగ్‌ని చూసే పుట్టాయేమో అనడం అతిశయోక్తి కాకపోవచ్చు.
కొసమెరుపు: రెండేళ్ళ క్రితం సెహ్వాగ్ వన్డే, టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అప్పటినుంచీ ఇప్పటిదాకా సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్లో కన్పించలేదు. అంటే రెండేళ్ళు ఎదురుచూసి, ఇక జట్టులో స్థానం దొరకదనే సెహ్వాగ్ రిటైర్మెంట్ ప్రకటించాడని అర్థమవుతోంది కదా.!