1967 సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఆహారధాన్యాల కొరత, అవినీతి కారణంగా కాంగ్రెసు ఎంత అప్రతిష్ఠపాలైనా దానికి వుండే బేస్ దానికి వుందని, ఒంటరిగా పోరాడితే దాన్ని ఎదుర్కోలేమని అణ్నా గ్రహించాడు. అందుకే ప్రతిపక్షాలన్నిటిని ఒక తాటిమీదకు తీసుకురావాలని సంకల్పించాడు. అయితే ప్రతిపక్షాల్లో పూర్తిగా లెఫ్టిస్టులైన కమ్యూనిస్టుల నుండి, పూర్తిగా రైటిస్టులైన స్వతంత్ర పార్టీ దాకా అందరూ వున్నారు. అందుకని 'మనను కలిపేది ఉమ్మడి ప్రయోజనం తప్ప సిద్ధాంతసామ్యం కాదు' అని వాళ్లకు నచ్చచెప్పి ఎన్నికలకై కూటమి ఏర్పాటు చేశాడు. ఒప్పందం కుదరని చోట ఒకరితో మరొకరు పోటీ చేయవచ్చని అనుకున్నారు. ఈ కూటమికి రాజాజీ ఆశీర్వచనాలు అందాయి. కాంగ్రెసు నుండి బయటకు వచ్చిన రాజాజీ ఎలాగైనా కాంగ్రెసును ఓడించాలని పంతం పట్టి ఆ సామర్థ్యం వున్నది డిఎంకె ఒక్కదానికే అని గ్రహించి, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఏర్పడిన ద్రవిడ కళగంలోంచి పుట్టుకొచ్చిన డిఎంకెకు ఓటేయడానికి బ్రాహ్మణులు సమ్మతించరని తెలిసి ''బ్రాహ్మణులారా, డిఎంకెకు ఓటు వేయడం పాపం కాదు. 89 ఏళ్ల వయసులో నా జందెం పట్టుకుని చెప్తున్నా – మీరు డిఎంకెకు ఓటేయాలి.'' అని పిలుపిచ్చాడు. రాజాజీ బద్ధశత్రువైన పెరియార్‌ను యిది మండించింది. ''ఎట్టి పరిస్థితుల్లో డిఎంకెను ఓడించండి, కాంగ్రెసు గెలిచినా ఫర్వాలేదు'' అని ప్రకటించాడు. ప్రతిపక్షాలన్నీ కలిసి 1966 డిసెంబరులో మద్రాసులో నాలుగు రోజుల సమావేశం ఏర్పాటు చేస్తే దానికి లక్షలాది ప్రజలు హాజరు కావడంతో వారికి ఆత్మస్థయిర్యం పెరిగింది. ఆ సమావేశంలోనే పార్టీ కోశాధికారిగా వున్న కరుణానిధి అణ్నాకు పార్టీ ఫండ్‌గా రూ.11 లక్షలు అందించాడు. అప్పట్లో అది ఎవరూ వూహించలేనంత పెద్ద మొత్తం. అదే మీటింగులో ఎమ్జీయార్ ''నేను ఒక సినిమాకు తీసుకునే పారితోషికం పార్టీకి విరాళంగా యిస్తాను'' అని ప్రకటించాడు. దానికి ప్రతిస్పందనగా అణ్నా ''నాకు ఎమ్జీయార్ ఫీజు అక్కరలేదు. ఒక సినిమాకు అతను కేటాయించే సమయాన్ని పార్టీ ప్రచారానికి కేటాయిస్తే చాలు'' అన్నాడు.
మొదటి విడతలో ఎమ్జీయార్ ప్రచారసభల్లో పాల్గొని పార్టీకి ఉపయోగపడ్డాడు. ఆ తర్వాత ఎమ్మార్ రాధా (సినీనటి రాధిక తండ్రి) చేత కాల్చబడి యింకా ఎక్కువ ఉపయోగపడ్డాడు. ఆ సంఘటన గురించి 9 వ భాగంలో కాస్త రాశాను. ఎమ్మార్ రాధా పెరియార్‌కు శిష్యుడు. ద్రవిడ కళగం సభ్యుడు. డిఎంకె పార్టీ ప్రజాదరణ పొందడంతో, రాజాజీ ఆశీస్సులతో, ఎమ్జీయార్ సాయంతో అధికారం పొందే దశకి చేరడం అతను సహించలేకపోయాడు. అతన్ని కలవడానికి అతని యింటికి వెళ్లాడు. వృత్తిరీత్యా ఎమ్జీయార్‌తో వున్న సాహిత్యం కారణంగా అతన్ని ఏ చెకింగూ లేకుండా లోపలికి పోనిచ్చారు. అతను తుపాకీ తీసి అతి దగ్గరగా పెట్టి కాల్చేశాడు. ఎమ్జీయార్ గొంతులోంచి గుండు వెళ్లిపోయింది. అదృష్టవశాత్తూ బతికాడు కానీ కంఠస్వరం పాడై పోయింది. చాలా సాధన చేసి ఓ మేరకు మళ్లీ తెచ్చుకున్నాడు. చావుబతుకుల్లో వున్న ఎమ్జీయార్ ఫోటో సానుభూతి ఓట్లను కురిపించింది. ''మీ ఇంటికి వద్దామనుకున్నాను, ఇప్పుడు వచ్చే పరిస్థితిలో లేను, అందుకే మీ హృదయాల్లో చోటు కోరుతున్నాను'' అనే సందేశంతో పోస్టర్లు వేశారు. ఆడవాళ్లు చలించిపోయారు. దిగువ తరగతి యువకులైతే చెప్పనే అక్కరలేదు. ఇంత జరిగినా ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెసుకు 41.52% ఓట్లు, 50 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు వచ్చాయి. ప్రతిపక్షాలు కలిసికట్టుగా పోరాడాయి కాబట్టి గెలిచాయి. డిఎంకెకు 40.82% ఓట్లు, 234 అసెంబ్లీ సీట్లలో 173 వచ్చి ఎవరి సాయం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా సంపాదించుకుంది. 39 పార్లమెంటు సీట్లలో 25 గెలిచింది. 1967లో దేశమంతా కాంగ్రెసు వ్యతిరేక పవనాలు వీచాయి. బలమైన ప్రతిపక్షాలు వున్న 5 ఉత్తరాది రాష్ట్రాలలో ఓడిపోయింది. అదే వూపులో తమిళనాడులో కూడా కాంగ్రెసు తరఫున పోటీ చేసిన హేమాహేమీలు ఓడిపోయారు. ముఖ్యమంత్రి భక్తవత్సలం, అతని కాబినెట్‌లో ఒక్కరు తప్ప మంత్రులందరూ, కేంద్రమంత్రిగా చేసిన సి.సుబ్రహ్మణ్యంతో సహా ఓడిపోయారు. అన్నిటికంటె చిత్రం – సాక్షాత్తూ కామరాజ్ తన సొంత నియోజకవర్గంలో ఓడిపోయారు. ఆయన్ను ఓడించినవాడు 28 ఏళ్ల విద్యార్థి నాయకుడు పి.శ్రీనివాసన్. ఈయన దరిమిలా తమిళ, తెలుగు నటి వాసంతిని పెళ్లాడారు.
కామరాజ్, సుబ్రహ్మణ్యంల ఓటమి అణ్నాను బాధించింది. కామరాజ్ వంటి తమిళుడు వెయ్యేళ్ల కోసారి పుడతాడు, ఆయన్ని ఓడించి మనం తప్పు చేశాం అన్నాడు, కేంద్ర కాబినెట్‌లో ఒక్క తమిళమంత్రీ లేకుండా పోతున్నాడని బాధపడ్డాడు. ఇంతటి విజయాన్ని ఎదురుచూడని అణ్నా ఎందుకైనా మంచిదని పార్లమెంటుకి పోటీ చేసి నెగ్గాడు. దాంతో ముఖ్యమంత్రిగా నెడుంజెళియన్ అవుతాడని పుకారు వచ్చింది. అలస్యం చేస్తే యిలాటి ఉపద్రవాలు వస్తాయని ఫలితాలు వచ్చిన కొన్ని గంటల్లోనే అణ్నా తనే ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించాడు. ఆ తర్వాత రాజాజీ వద్దకు వెళ్లి ధన్యవాదాలు తెలిపాడు. తన రాజకీయపిత అయిన పెరియార్‌ను కలుద్దామనుకుంటే ఆయన తిరుచ్చిలో వున్నాడని తెలిసింది. అక్కడికి వెళ్లడానికి నిశ్చయించుకున్నాడు. ఆయన అప్పటికే డిఎంకె విజయం తమిళ ప్రజల దురదృష్టం అని స్టేటుమెంటు యిచ్చివున్నాడు. అయినా అణ్నా 20 ఏళ్ల తర్వాత తనను వచ్చి కలిసి కాళ్లకు దణ్ణం పెట్టడంతో పెరియార్ సిగ్గుపడ్డాడు. ''కాంగ్రెసులో నేను కామరాజును మాత్రమే అభిమానించాను, కానీ డిఎంకె విషయంలో ఆ పార్టీ నాయకులందరూ నాకు యిష్టులే. నేను వారిని ఎన్ని దుర్భాషలాడినా, వాళ్లు ఏమీ అనుకోలేదు, తిరిగి నన్ను నిందించలేదు'' అని ప్రకటించాడు.
అణ్నా మంత్రుల లిస్టు తయారుచేసి రా చెళియన్ ద్వారా ఆసుపత్రిలో వున్న ఎమ్జీయార్‌కు పంపించాడు. అతను ఆసుపత్రిలో వుంటూనే ఎమ్మెల్యేగా గెలిచాడు. అణ్నా తనకిచ్చిన ప్రాధాన్యతకు ఎమ్జీయార్ మురిసిపోయాడు. కానీ ఒక వ్యక్తి పేరు చూడగానే మండిపడ్డాడు. అతను సిపి అదితన్. బారిస్టరుగా సంపాదించి ''దినతంతి'' అనే పాఠకాదరణ గల దినపత్రిక ద్వారా పలుకుబడి సంపాదించాడు. ఆ పత్రిక డిఎంకెకు వ్యతిరేకంగా వుంటూ వచ్చింది. కానీ ఎన్నికల సమయంలో వారి వైపు మళ్లింది. కానీ ఎమ్జీయార్‌ను మాత్రం ఎప్పుడూ విమర్శించేది. ఎన్నికలలో తమకు మద్దతు యిచ్చినందుకు కృతజ్ఞతగా అణ్నా అతనికి పరిశ్రమల శాఖ యిద్దామనుకున్నాడు. కానీ ఎమ్జీయార్ మండిపడ్డాడు. ''అది అవినీతికి అవకాశం వున్న శాఖ. మీ అన్న నెడుంజెళియన్ వంటి నిజాయితీపరుడికి యివ్వాలి తప్ప యిలాటి వాడికా?'' అని రా చెళియన్‌తో అన్నాడు. అణ్నా వెంటనే అదితన్ పేరు జాబితాలోంచి కొట్టేసి అతనికి స్పీకరు పదవి యిచ్చాడు. కానీ నెడుంజెళియన్‌కు విద్యాశాఖ యిచ్చాడు. కరుణానిధికి పబ్లిక్ వర్క్స్ దక్కింది. 1967 మార్చి 6న అణ్నా, అతని మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేసింది. (సశేషం)
ఫోటో – ఆసుపత్రిలో వుండగానే ఎమ్మెల్యేగా సంతకం చేస్తున్న ఎమ్జీయార్
-ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2015)