క్రికెట్లోకి అతనో సంచలనంలా దూసుకొచ్చాడు.. క్రికెట్లో వున్నన్నాళ్ళూ సంచలనమే. సాధించిన విజయాలకంటే, వివాదాలే ఎక్కువ. చాలా వివాదాల్లో అతను బాధితుడు మాత్రమే. మైదానంలో డాన్సులేసినా అతనికే చెల్లింది.. కంటతడిపెట్టినా అతనికే చెల్లింది.. చివరికి సహచర ఆటగాడితో చెంపదెబ్బ తిన్నా అతడికే చెల్లింది. పరిచయం అక్కర్లేని పేరది. అతనే కేరళ స్పీడ్‌స్టర్‌గా పేరు సంపాదించుకున్న శ్రీశాంత్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఓ ఆటగాడి క్రీడా జీవితాన్ని నాశనం చేసేస్తుందని ఎవరైనా ఊహించారా.? ఇదిగో, శ్రీశాంత్ పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఐపీఎల్ ఆరో సీజన్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడం, ఆ ఆరోపణల నేపథ్యంలో శ్రీశాంత్ అరెస్టవడం, జీవిత కాల నిషేధానికి గురికావడం తెల్సిన విషయాలే. 'నన్ను అమాయకుడ్ని చేసి, నాపై బురద జల్లారు.. నా జీవితాన్ని నాశనం చేశారు..' అంటూ వాపోయాడు శ్రీశాంత్. కానీ, ఉపయోగం లేకుండా పోయింది.
క్రికెట్‌కి దూరమవడం ఇష్టం లేకనే, దూరమయ్యాడు. సినిమాకి దగ్గరయ్యాడు. రాజకీయాల్లోనూ అడుగుపెట్టాడు. ఎక్కడా కాలం కలిసిరాలేదు. ఈ టైమ్‌లో చిన్న ఊరట. నిషేధం ఎత్తివేస్తూ, కేరళ హైకోర్టు గతంలో తీర్పు వెల్లడించింది. ఆ తీర్పుని బీసీసీఐ సవాల్ చేస్తే, తాజాగా షాక్ తగిలింది శ్రీశాంత్‌కి. జీవితకాల నిషేధాన్ని న్యాయస్థానం సమర్థించింది. అంతే, ఇక ఇప్పుడు చేయడానికేమీ లేదు.. ఒక్క సుప్రీంకోర్టుని ఆశ్రయించడం తప్ప.
ఇక, పోరాటం చేసి ఉపయోగం లేదు.. ఎందుకంటే, పుణ్యకాలం కాస్తా పూర్తయిపోయింది. ఇకపై క్రికెట్ ఆడేందుకు వయసు, ఫిట్నెస్ సహకరించకపోవచ్చు. అయినా, సుప్రీం కోర్టుకి వెళ్ళినా ఊరట లభిస్తుందన్న గ్యారంటీ ఏంటి.? ఇంతా చేసి, రంజీల్లో ఆడినా.. టీమిండియాలో చోటు దక్కుతుందన్న నమ్మకమూ లేదాయె.