టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సుడి అలా తిరుగుతోంది. అతని ఖాతాలో మరో టెస్ట్ సిరీస్ విజయం నమోదయ్యింది. చిన్న జట్టే అయినా, విజయం అందరూ ముందే ఊహించినదే అయినా.. ఎప్పుడూ విజయం ప్రత్యేకమైనదే.. ఆనందాన్నిచ్చేదే.!
బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. 208 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది విరాట్ కోహ్లీ సేన. వేగంగా 250 వికెట్లు సాధించిన అశ్విన్, వరుసగా నాలుగు టెస్ట్ సిరీస్‌లో డబుల్ సెంచరీలు సాధించిన కోహ్లీ.. ఇవీ ఈ మ్యాచ్ విశేషాలు. విజయ్ సెంచరీ, జడేజా, అశ్విన్ చెరో ఆరు వికెట్లు సాధించడం తెల్సిన విషయాలే. భారత బ్యాట్స్‌మెన్‌కి బ్యాటింగ్ ప్రాక్టీస్, బౌలర్లకు బౌలింగ్ ప్రాక్టీస్.. ఇదీ బంగ్లాదేశ్‌తో టీమిండియా టెస్ట్ సిరీస్ జరిగిన తీరు.
బంగ్లాదేశ్ నుంచి ముష్ఫికర్ రహీమ్ సెంచరీ, ఆ జట్టుకి కాస్త ఊరట. అంతకు మించి, బంగ్లాదేశ్ జట్టుకి, టీమిండియాతో జరిగిన మ్యాచ్ ద్వారా ఒరిగిందేమీ లేదు. 'భారత్‌కి ఝలక్ ఇస్తాం..' అని బంగ్లాదేశ్ జట్టు ఆటగాళ్ళు ఈ మ్యాచ్‌కి ముందు కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే మాట్లాడేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం, 'బంగ్లాదేశ్‌ని చిన్నజట్టుగా భావించట్లేదు..' అంటూ, ఇవ్వాల్సిన గౌరవమే ఇచ్చాడు.
మొత్తమ్మీద, హైద్రాబాద్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయాన్ని అందుకుంది. స్వదేశంలో టీమిండియాకి తిరుగులేదనే విషయం మరోమారు ప్రూవ్ అయ్యింది. కొత్త కెప్టెన్.. టీమిండియాని ఎలా నడిపిస్తాడో.? అన్న ఆందోళనలకు చెక్ పెడుతూ, సిరీస్ సిరీస్‌కీ అటు కెప్టెన్‌గానూ, ఇటు బ్యాట్స్‌మెన్‌గానూ కోహ్లీ రాణిస్తుండడం విశేషమేమరి.