లార్డ్స్ టెస్టులో భార‌త ఓపెనర్ల అరుదైన ఫీట్

విదేశీ గ‌డ్డ మీద చాలా కాలం త‌ర్వాత వంద ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని ఏర్ప‌రిచింది రోహిత్ శ‌ర్మ‌- కేఎల్ రాహుల్ ల జోడీ. భార‌త్- ఇంగ్లండ్ ల మ‌ధ్య లార్డ్స్ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్టులో…

విదేశీ గ‌డ్డ మీద చాలా కాలం త‌ర్వాత వంద ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని ఏర్ప‌రిచింది రోహిత్ శ‌ర్మ‌- కేఎల్ రాహుల్ ల జోడీ. భార‌త్- ఇంగ్లండ్ ల మ‌ధ్య లార్డ్స్ వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్టులో ఈ అరుదైన ఫీట్ న‌మోదైంది. 

చివ‌రిసారిగా భార‌త్ త‌ర‌ఫున ఓపెన‌ర్లు ఆసియా అవ‌త‌ల క‌నీసం వంద ప‌రుగుల వ‌ర‌కూ వికెట్ ప‌డకుండా ఆడింది దాదాపు 11 సంవ‌త్స‌రాల కింద‌ట గ‌మ‌నార్హం. 2010లో ఆసియా అవ‌త‌ల ఒక భార‌త ఓపెనింగ్ జోడీ 100 ప‌రుగుల పై చిలుగు భాగ‌స్వామ్యాన్ని చివ‌రి సారి ఏర్ప‌రిచింది. రోహిత్- రాహుల్ ల జోడి అలాంటి అరుదైన ఫీట్ ను సాధించింది.

విశేషం ఏమిటంటే.. ఇదొక బౌన్సీ ట్రాక్ పై కావ‌డం. ఉప‌ఖండం ప‌రిధిలో ఇలాంటి ఫీట్ల‌ను ఎన్నింటినైనా సాధిస్తుంటారు భార‌త ఓపెన‌ర్లు. అయితే ఫాస్ట్, బౌన్సీ ట్రాక్ ల‌పై ఓపెనింగ్ జోడీలు నిల‌దొక్కుకోవ‌డం మాట‌లు కాదు. అలాంటి అరుదైన ఫీట్ ను సాధించారు రోహిత్, రాహుల్. ఈ భాగ‌స్వామ్యంలో రోహిత్ దూకుడుగా ఆడ‌గా, రాహుల్ పూర్తి డిఫెన్సివ్ మోడ్ లో ఆడాడు. 

వంద ప‌రుగులు పూర్త‌య్యే స‌మ‌యానికి రోహిత్ వ్య‌క్తిగ‌త స్కోరు 80 ప‌రుగుల‌కు చేరువ కావ‌డం గ‌మ‌నార్హం. అయితే సెంచ‌రీ దిశ‌గా సాగుతున్న క్ర‌మంలో రోహిత్ ఔట‌య్యాడు. దూకుడుగా ఆడుతున్నంత సేపూ రోహిత్ బ్యాటింగ్ సాఫీగానే సాగింది. అయితే లార్డ్స్ లో సెంచ‌రీ అనే రికార్డు ఊరించిందో ఏమో కానీ.. రోహిత్ డిఫెన్సివ్ మోడ్ లో ఆడ‌టం ప్రారంభించ‌డంతోనే ఇబ్బంది ప‌డ్డాడు. చివ‌ర‌కు అండ‌ర్స‌న్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ కావ‌డంతో ఈ భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది.

2018లో ఇంగ్లండ్ తోనే లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన టెస్టులో భార‌త జ‌ట్టు చిత్త‌య్యింది. అయితే ఈ సారి భార‌త బ్యాట్స్ మెన్ ధీటుగా బ‌దులిస్తున్నారు. లార్డ్స్ లో గ‌త ఐదు టెస్టుల్లో ఫ‌స్ట్ ఇన్నింగ్స్ యావ‌రేజ్ స్కోరు 202 కాగా, భార‌త జ‌ట్టు ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ కేవ‌లం రెండు వికెట్ల న‌ష్టానికే ఇప్పటికే ఆ స్కోరును దాటేసింది. 

తొలి మ్యాచ్ లో ఊరించిన విజ‌యానికి వ‌ర్షం అడ్డంకిగా నిలిచింది. మ‌రి ఆ లోటును లార్డ్స్ టెస్టులో అయినా ఇండియా భ‌ర్తీ చేస్తుందేమో చూడాలి.