అడిలైడ్ టెస్టు సెకెండిన్నింగ్స్ పీడకల నుంచి టీమిండియా త్వరగానే బయటపడుతున్నట్టుగా ఉంది. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా మీద టీమిండియా పై చేయి సాధించింది.
తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను 195 పరుగులకే ఆలౌట్ చేసింది టీమిండియా. చక్కటి బౌలింగ్ తో ఆసీస్ బ్యాట్స్ మన్ ను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఆ తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత బ్యాట్స్ మెన్ ఒక్క వికెట్ నష్టానికి 36 పరుగులు చేశారు.
ఈ 36 అనే నంబర్ అడిలైడ్ టెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు సరిగ్గా 36 పరుగులే చేయడం గమనార్హం. అయితే ఈ ముప్పై ఆరు పరుగులు భారత జట్టును కాస్త మెరుగైన స్థితిలోనే నిలుపుతున్నాయి.
టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీసుకుంది. అయితే ఆరంభంలోనే భారత బౌలర్లు విజృంభించారు. 38 పరుగులకే ఆసీస్ మూడు వికెట్లను కోల్పోయింది. అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దుకున్నారు.
కానీ అవసరమైనప్పుడల్లా భారత బౌలర్లు వికెట్లు తీయడంతో.. ఆస్ట్రేలియా 195 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు తీయగా, అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ తో టెస్టు కెరీర్ మొదలుపెట్టిన మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీసి శుభారంభం చేశాడు. రవీంద్రజడేజా ఒక్క వికెట్ తీశాడు.
భారత బ్యాటింగులో ఆరంభంలోనే మయాంక్ అగర్వాల్ వికెట్ ను కోల్పోయింది. గత మ్యాచ్ మూడ్ నుంచి బయటకు రానట్టుగా తొలి ఓవర్ లోనే మయాంక్ అగర్వాల్ వికెట్ చేజార్చుకున్నాడు.
బౌలింగ్ లో టీమిండియా రాణించినప్పటికీ.. బ్యాట్స్ మెన్ ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని ఆడాల్సి ఉంది. రెండు ఇన్నింగ్స్ లలోనూ ఒకరిద్దరు బ్యాట్స్ మెన్ రాణించిన బౌలర్లు మిగతా పని పూర్తి చేయగలరు.