కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో రాబోయే రెండు నెలలూ చాలా కఠినమైనవని అభివర్ణించారు ఎయిమ్స్ చీఫ్ రణ్ దీప్ గులేరియా. బ్రిటన్లో కరోనా కొత్త స్ట్రెయిన్ బయటపడిన నేపథ్యంలో, అది 70 శాతం అధిక వేగంగా వ్యాపిస్తుందన్న పరిశోధకుల ప్రకటన నేపథ్యంలో… మళ్లీ ప్రపంచం గడగడలాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎయిమ్స్ చీఫ్ ఈ అంశాలపై స్పందించారు.
కరోనా వైరస్ రూపం మార్చుకోవడం ఇది తొలి సారి కాదని ఎయిమ్స్ చీఫ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకూ సగటున ప్రతి నెలకూ వైరస్ లో రెండు రకాల మ్యూటేషన్లు బయటపడ్డాయని వివరించారు. కరోనా వైరస్ అనేక మ్యూటేషన్లలో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తిలో ఉందని గులేరియా వివరించారు.
కొత్త మ్యూటేషన్లకు చికిత్సలో ఎలాంటి మార్పూ ఉండదని వివరించారు. సింప్టమ్స్ విషయంలో అయినా, వైద్య చికిత్స విషయంలో అయినా.. కొత్త స్ట్రెయిన్ లకు మార్పు ఏమీ ఉండదని గులేరియా పేర్కొన్నారు.
ఇండియాలో ఇప్పుడిప్పుడు రోజువారీ యాక్టివ్ కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టి, కరోనా కారణ మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టడంపై గులేరియా స్పందించారు.
అప్పుడే పూర్తిగా రిలాక్స్ అయిపోవడానికి లేదని ఎయిమ్స్ చీఫ్ అభిప్రాయపడ్డారు,. రాబోయే ఏడెనిమిది వారాలూ చాలా కీలకమైనవి అని కఠినమైనవి అని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది మార్చి వరకూ కరోనా కేసుల సంఖ్య ఇలాగే తగ్గుముఖంలోనే కొనసాగితే రిలాక్సేషన్ లభించినట్టే అని ఇది వరకూ పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో కొంతమందికి అయినా వ్యాక్సినేషన్ జరిగితే.. అది కూడా సానుకూల పరిణామం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇంతలో కొత్త స్ట్రెయిన్ ఆందోళనలను రేపుతూ ఉంది. ఈ పరిణామాల మధ్యనా రాబోయే రెండు నెలలూ చాలా కీలకం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.