ఒకే టెస్టులో ఇద్దరు బౌలర్లు ఆరంగేట్రం చేశారు, పేస్ దళం మొత్తం అనుభవం కలిపితే ఐదారు టెస్టులు లేదు! ఇక బ్యాటింగ్ లో కూడా అంతే పరిస్థితి. ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లు తమ కెరీర్ లో ఇంకా పదో టెస్టును కూడా ఆడలేదు. స్థూలంగా ఫస్ట్ క్లాస్ అనుభవం తప్ప, అంతర్జాతీయ టెస్టులు ఆడిన అనుభం సగం మందికి కూడా గొప్పగా లేని జట్టుతో టీమిండియా బ్రిస్బెన్ లో రంగంలోకి దిగింది.
ఈ మ్యాచ్ తో తమిళనాడు బౌలర్లు నటరాజన్, వాషింగ్టన్ సుందర్ లు టెస్టు క్యాప్ ను ధరించారు. వీరిలో సుందర్ కు కొంత ఫస్ట్ క్లాస్ అనుభవం ఉన్నా, నటరాజన్ కు ఎలాంటి ఫస్ట్ క్లాస్ అనుభవం లేదు. నెట్ ప్రాక్టీస్ కోసం అంటూ ఆస్ట్రేలియాకు టీమ్ తో పాటు వెళ్లిన ఈ ఐపీఎల్ స్టార్ వరసగా టీ20, వన్డే, టెస్టు ఆరంగేట్రాలను కూడా పూర్తి చేసేశాడు!
ఇక ఐపీఎల్ ద్వారానే వెలుగులోకి వచ్చిన అండర్-19 ప్రపంచకప్ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్ తో టెస్టులకు పరిచయం అయ్యాడు.
ఇక ఇటీవలే టెస్ట్ ఆరంగేట్రం చేసిన మహ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్ లో భారత్ కు ప్రధాన పేసర్! ఇక శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీలకు ఎంత అనుభవం ఉందో వేరే చెప్పనక్కర్లేదు. ఇలా ఐదు మంది ప్రధానబౌలర్లుగా టీమిండియా-ఏ జట్టుకు కూడా ఆడిన అనుభవం పెద్దగాలేని వాళ్లతో టీమిండియా బ్రిస్బెన్ టెస్టును మొదలుపెట్టింది.
ఇక బ్యాటింగ్ విభాగం వైపు తొంగి చూస్తే.. శుభ్ మన్ గిల్ కు ఇది మూడో టెస్టు. మయాంక్ అగర్వాల్ కూడా డజనులోపు టెస్టుల వాడే. ఏతావాతా ఈ మ్యాచ్ లో సీనియర్లు ఎవరంటే.. రోహిత్ శర్మ, పుజారా, రహనే, పంత్!
కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరుగా గాయాల పాలై ఈ మ్యాచ్ కు దూరం అయ్యారు. వన్డే స్పెషలిస్టులను ఆ సీరిస్ లు పూర్తి కాగానే ఇండియాకు పంపించేశారు. ఇక మిగిలిన వాళ్లతో టీమిండియా ఈ మ్యాచ్ ఆడుతోంది.
కొత్త వాళ్లే అయినా బౌలర్లు ఆకట్టుకుంటూ ఉన్నారు. ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్ పరుగులు చేయడానికి కష్టపడే పరిస్థితిని కల్పిస్తున్నారు. వాషింగ్టన్ సుందర్ టెస్టుల్లో తన తొలి వికెట్ తీశాడు. స్టీవ్ స్మిత్ ను ఔట్ చేసి.. ఘనంగా ఖాతా తెరిచాడు.