36 పరుగులకు ఆలౌట్ అయ్యి తొలి టెస్టులో దారుణ ఓటమిని మిగుల్చుకున్న టీమిండియా, ఆ అవమానం తర్వాత చాలా త్వరగా పుంజుకుంది. చారిత్రక ఓటమి తర్వాత చారిత్రక గెలుపును సాధించింది. అడిలైడ్ టెస్టులో ఓడిన జట్టు మెల్ బోర్న్ లో మేలుకుంది. ఆస్ట్రేలియాపై అన్ని రకాలుగానూ పై చేయి సాధిస్తూ రెండో టెస్టులో నెగ్గి 1-1తో సీరిస్ ను సమం చేసింది.
రహనే కెప్టెన్సీలో జట్టు విజయం సాధించింది. ఈ గెలుపులో అటు బ్యాట్స్ మన్ గా కూడా రహనే అద్భుత ప్రతిభను ప్రదర్శించాడు. కాస్త ఓపికగా ఆడితే పరుగులు వచ్చే పిచ్ మీద రహనే అద్భుత శతకం సాధించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ గెలుపులో బౌలర్ల పాటవాన్ని కూడా కచ్చితంగా ప్రశంసించాల్సిందే. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్ ను 195 పరుగులకు ఆలౌట్ చేసిన భారత బౌలర్లు రెండో ఇన్నింగ్స్ లో 200 పరుగులకు వారిని ఆలౌట్ చేసి.. విజయానికి మార్గం సుగమం చేశారు.
ఈ మ్యాచ్ తో టెస్టు ఆరంగేట్రం చేసిన మహ్మద్ సిరాజ్ తొలి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్లను పడగొట్టి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. అలాగే బ్యాటింగ్ విభాగంలో తొలి టెస్టు ఆడిన శుభ్ మన్ గిల్ కూడా కొత్త ఆశాకిరణంగా ఉదయించాడు.
డ్యాషింగ్ బ్యాటింగ్ స్టైల్ తో గిల్ తొలి ఇన్నింగ్స్ లో 45 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ కూడా ఏ మాత్రం తడబాటు లేకుండా 35 పరుగులతో నాటౌట్ గా నిలిచి.. ఆరంగేట్రంలోనే అందరి దృష్టినీ ఆకర్షించాడు. చాన్నాళ్ల తర్వాత టెస్టుల్లో టీమిండియా ఒక డ్యాషింగ్ ఓపెనర్ ను చూస్తోంది.
డ్యాషింగ్ బ్యాటింగ్ స్టైల్, టెక్నిక్ తో లక్ష్మణ్, సెహ్వాగ్ వంటి వాళ్లను గుర్తు చేస్తున్నాడు గిల్. ప్రపంచ అత్యుత్తమ శ్రేణి బౌలింగ్ లైనప్ ను తొలి ఓవర్లలో కొత్త బంతితో ఎదుర్కొంటూ ఈ 21 యేళ్ల కుర్రాడు ఆడిన తీరు క్రికెట్ ప్రియులను ఆకట్టుకుంటూ ఉంది. తదుపరి రెండు టెస్టుల్లో కూడా గిల్ కు జట్టులో స్థానం ఖరారు అయినట్టే. ఈ నేపథ్యంలో.. తదుపరి మ్యాచ్ లలో అందరి కళ్లూ గిల్ పై ఉండబోతున్నాయి.
ఓవరాల్ గా ఆస్ట్రేలియన్ గడ్డ మీద టీమిండియాకు ఇది ఎనిమిదో విజయం మాత్రమే. ఆసీస్ వేదికలపై పర్యాటక జట్లకు అరుదుగా మాత్రమే విజయాలు దక్కుతాయి. అలాంటి అరుదైన ఫీట్ ను సాధించింది టీమిండియా. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తదుపరి మ్యాచ్ జనవరి ఏడో తేదీ నుంచి ప్రారంభం కానుంది. నెక్ట్స్ మ్యాచ్ కు రోహిత్ శర్మ కూడా జట్టుకు అందుబాటులోకి రాబోతున్నాడు.