టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీ, భారత మాజీ ధిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ల మధ్య ఉన్న ప్రధాన పోలిక.. అసమాన రికార్డులు. క్రికెట్ లో సచిన్ సృష్టించిన అద్భుత రికార్డులను అధిగమించే సత్తా ఎవరికైనా ఉందంటే అది కొహ్లీకే అనే అభిప్రాయాలు ఇప్పటివి ఏమీ కావు. అయితే రెండేళ్లుగా కొహ్లీ ఫామ్ ను బట్టి చూస్తే… మాత్రం అంత సీనుందా? అనే సందేహాలూ జనిస్తాయి.
రెండేళ్ల కిందటి కొహ్లీ బ్యాటింగ్ వేరు, గత రెండేళ్లలో అతడి ఆట వేరే. ఒక సాధారణ ఆటగాడి తరహాలో మాత్రమే కొహ్లీ కెరీర్ సాగుతోందిప్పుడు. ఇక జట్టు విజయాల బాటనే పయనిస్తున్నా.. అందులో కొహ్లీకి ప్రత్యేకంగా దక్కే క్రెడిట్ ఏమీ లేదంటే ఆశ్చర్యం లేదు!
ఆస్ట్రేలియాలో టీమిండియా టెస్టు సీరిస్ సాధించినప్పుడు కొహ్లీ కనీసం జట్టులో కూడా లేడు. యువ ఆటగాళ్ల అద్భుత పటిమతో ఆ విజయాలు సాధ్యం అయ్యాయి. కొహ్లీ కెప్టెన్ గా వ్యవహరించిన మ్యాచ్ లో టీమిండియా చిత్తయ్యింది!
ఇక ఇంగ్లండ్ తో ఆ దేశంలో జరిగిన టెస్టు సీరిస్ లో టీమిండియా లీడ్ లో నిలిచినప్పటికీ.. కొహ్లీ ఆట మాత్రం అంత గొప్పగా లేదు. పదే పదే అండర్సన్ కు వికెట్ ను సమర్పించుకుంటూ వచ్చాడు.
ఏ ఆటగాడికైనా అతడి ప్రస్తుత ఫామే ప్రామాణికం కావాలి. ఫామ్ లో లేకపోతే ఎవ్వరినైనా పక్కన పెట్టడం టీమిండియాలో సంప్రదాయంగా మారింది. ఈ క్రమంలో గావస్కర్ లాంటి వాళ్లు.. కొహ్లీకి ఒక న్యాయం ఇతర ప్లేయర్లకు మరో న్యాయమా? అంటూ కూడా ప్రశ్నించారు చాలాసార్లు.
ఇక కొహ్లీ కెప్టెన్సీపై విమర్శలు తక్కువేమీ కాదు. అటు ఆటగాడిగా అద్భుతాలు చేయలేక, ఇక జట్టునూ కీలక సీరిస్ లలో విజేతగా నిలపలేకపోతున్నా.. కొహ్లీ మాత్రం వీటిని ఒత్తిడిగా తీసుకోలేదు! వేరే వాళ్లు అయితే.. ఈ విమర్శల జడికి అయినా భయపడి కెప్టెన్సీ నుంచి తప్పుకునే వారు.
సచిన్ టెండూల్కర్ కే అది తప్పలేదు! సచిన్ కెప్టెన్ గా ఉన్న సమయంలో అతడి ఆట ఏమీ దెబ్బతినలేదు. జట్టు మాత్రం గెలిచేది కాదు. కెప్టెన్ గా సచిన్ విఫలం అయ్యాడు. దాన్ని అతడే హుందాగా ఒప్పుకున్నాడు.. ఆ హోదా నుంచి తప్పుకోవడం ద్వారా! గంగూలీ, ద్రావిడ్ ల కెప్టెన్సీలో సచిన్ ఆట గొప్పగా సాగింది. గంగూలీ చెప్పిన ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడానికి అయినా, అతడు బాలిస్తే మాత్రమే బౌలింగ్ చేయడానికి అయినా సచిన్ ఎలాంటి ఇగో చూపలేదు. మేట్.. నీకు ఈ ఒక్క ఓవరే అంటూ గంగూలీ బంతిని సచిన్ చేతికి ఇచ్చిన వైనాలు స్టంప్ మైక్స్ లో రికార్డు అయ్యాయి!
ఇక తన కన్నా చోటా అయిన ధోనీ కెప్టెన్సీలో కూడా సచిన్ ఆడాడు, కెప్టెన్సీ నుంచి వైదొలిగాకా ఆ బాధ్యతల్లోకి చొచ్చుకుపోవడం, కెప్టెన్లకు ఉచిత సలహాలు ఇవ్వడం, మీరెంత అన్నట్టుగా బిహేవ్ చేయడం..ఇవేమీ సచిన్ చేయలేదు. తన కెప్టెన్సీపై భారత క్రికెట్ అభిమానులు సంతృప్తిగా లేరని సచిన్ భావించాడు. తప్పుకున్నాడు. అయితే కొహ్లీ ఈ తరహాలో వ్యవహరించలేదని స్పష్టం అవుతోంది.
టీ20 కెప్టెన్సీ నుంచి అతడు తప్పుకోవడం కూడా యాజమాన్యం ఒత్తిడే అని, తన తర్వాత ఎవరు కెప్టెన్ గా ఉండాలనే అంశంపై కూడా ఉచిత సలహాలు ఇచ్చాడని, పంత్ , రాహుల్ లలో ఎవరో ఒకరిని తనకు డిప్యూటీ చేయాలని కోరాడని.. అది జరగకపోవడంతోనే ఆ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడనే ప్రచారం జరుగుతూ ఉంది. ఇక వన్డే కెప్టెన్సీ హోదా నుంచి తప్పుకోవాలని కొహ్లీకి బీసీసీఐ అల్టిమేటం ఇచ్చేంత వరకూ వచ్చింది వ్యవహారం. ఇక మిగిలింది టెస్టు కెప్టెన్సీ మాత్రమే. ఏదేమైనా.. హుందాగా జరగాల్సిన కెప్టెన్సీ బదిలీని కొహ్లీ సరిగా చేయడం లేదేమో అని సగటు భారత క్రికెట్ అభిమానికి అనిపిస్తోంది.