నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లమూడి డైరక్షన్ లో ఆసియన్ సునీల్ నిర్మించిన చిత్రం లక్ష్య. కేతిక శర్మ హీరోయిన్. సినిమా విడుదల సందర్భంగా హీరో నాగశౌర్య మీడియాతో మాట్లాడారు ఆ విశేషాలు…
వరుడు కావలెను సినిమా నా పరిధికి సంబంధించినది. అలాంటి సబ్జెక్ట్ ఎన్ని సార్లు చేసినా సక్సెస్ అవుతుందన్న నమ్మకం దర్శక నిర్మాతలకు ఉంది. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఇప్పుడు లక్ష్య సినిమా రాబోతోంది. లక్ష్య ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను.
కథ విన్న వెంటనే నా వైపు నుంచి వంద శాతమివ్వాలని అనుకున్నాను. కొత్త నాగ శౌర్యను చూపించాలని అనుకున్నాను. ఇలాంటి కథలు రావడమే అదృష్టం. ఇలాంటివి వచ్చినప్పుడు యాక్టర్స్ ఎవ్వరైనా ఓ అడుగు ముందుకు వేస్తారు. నేను కూడా అదే చేశాను.
ముందు ఆసియన్ సునీల్ గారు ఫోన్ చేశారు. ఓ కథ ఉంది వెంటనే వినాలని అన్నారు. సంతోష్ వచ్చి దాదాపు నాలుగు గంటల పాటు ఫస్ట్ హాఫ్‌ను నెరేట్ చేశారు. ప్రతీది విడమరిచి చెప్పారు. బాణం ఎలా పట్టుకోవాలి.. ఎలా నిల్చోవాలి అంటూ ఇలా అన్నీ వివరించి చెప్పారు. కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాను.
ఆర్చరీ మనకు తెలియంది కాదు. పురాణాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం.. మన వీరుల చేతుల్లో విల్లు ఉంటుంది. ఆర్చరీని మాత్రమే విలు విద్య అని అంటాం. దాన్ని మనం ఎడ్యుకేషన్‌గా గౌరవిస్తాం. మన వాళ్లు దాన్ని మరిచిపోయారు. కాస్త గుర్తు చేద్దామని ఈ సినిమా తీశాం.
ఏ ఆట అయినా సరే ప్రొఫెషనల్‌గా వెళ్లాలంటే చాలా కష్టం. కానీ ఈ సినిమా కోసం ఆర్చరీని నేర్చుకున్నాను. 35 కేజీలను వెనక్కి లాగడం మామూలు విషయం కాదు. ఎన్నో గాయాలు కూడా అవుతుంటాయి. కొత్త దనం చూపించేందుకే ఈ సినిమాను చేశాం.
సై సినిమానే మాకు స్ఫూర్తి. ఎవ్వరికీ తెలియని ఆటను తీసుకొచ్చి కమర్షియల్‌గా జోడించి అద్బుతంగా చూపించారు. నెరేషన్ బాగుంటే సినిమా అద్బుతంగా వస్తుంది. అందులో సంతోష్ సక్సెస్ అవుతాడని నమ్మకం ఉంది…అంటూ ముగించారు శౌర్య.