ఇండియాలో క్రికెట్ హీరోగా వెలిగిన వారికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి వారి బయోపిక్ లను చేసి క్యాష్ చేసుకోవడాన్ని సులభతరమైన మార్గంగా మార్చుకుంది బాలీవుడ్. కాస్త సరిగా తీస్తే..ఆ బయోపిక్స్ వందల కోట్ల రూపాయలను వసూలు చేస్తాయని ధోనీ బయోపిక్ తో రుజువు అయ్యింది.
అజర్ బయోపిక్ వచ్చింది కానీ, దాన్ని సరిగ్గా తీయకపోవడంతో బోల్తా కొట్టింది. ఇక సచిన్ బయోపిక్ ను ఒక డాక్యుమెంటరీ తరహాలో రూపొందించడంతో, థియేటర్ల వద్ద దాని ముచ్చట పెద్దగా లేకపోయింది. ఈ క్రమంలో 1983 క్రికెట్ వరల్డ్ కప్ విజయం పై ఒక సినిమా రెడీ అయ్యింది. కరోనా- లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఆ సినిమా ఇప్పటికే విడుదల అయ్యేది కూడా!
ఆ సంగతలా ఉంటే.. తన బయోపిక్ ప్రస్తావన గురించి స్పందించాడు టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లీ. ధోనీ బయోపిక్ వచ్చింది కాబట్టి, కొహ్లీ బయోపిక్ రావడంలో వింత లేదు. ఈ క్రమంలో.. ఈ విషయంపై కొహ్లీ స్పందించాడు. తన బయోపిక్ లో తనే నటిస్తానంటూ కూడా ఈ క్రికెటర్ ప్రకటించేశాడు. అయితే అందులో షరతు ఉందట!
అందులో తన భార్య అనుష్క కూడా నటించాలట. అది చాలా చిన్న షరతే. కొహ్లీ బయోపిక్ లో తన పాత్రను చేయడానికి అనుష్క కాదనకపోవచ్చు. తన బయోపిక్ లో తనే నటించడానికి సై అని కొహ్లీ ప్రకటించాడు. ఇన్ స్టాగ్రమ్ చాట్ లో చేసిన ఈ సరదా ప్రకటన ద్వారా.. బాలీవుడ్ కు కొహ్లీ బయోపిక్ సంకేతాలను పంపినట్టేనేమో!