49 వన్డే సెంచరీలను చేయడానికి సచిన్ తీసుకున్న మ్యాచుల సంఖ్య 463. తన 200వ మ్యాచ్ లో 31వ వన్డే సెంచరీని పూర్తి చేశాడు విరాట్ కొహ్లీ. రెండు వందల వన్డేల్లో ఏ క్రికెటర్ చేయనన్ని సెంచరీలను పూర్తి చేశాడు విరాట్ కోహ్లీ. ఇన్నేళ్లూ రన్స్ మిషన్ అని చాలా మంది క్రికెటర్లను కీర్తిస్తూ వచ్చారు విశ్లేషకులు. అయితే ఆ పదం సెట్ అయ్యేది విరాట్ కు తప్ప మరొకరికి కాదేమో అనిపిస్తోంది.
రెండు వందల వన్డేలను పూర్తి చేసుకునే సరికి అత్యధిక పరుగులను సాధించిన ఘనత, అత్యధిక బెస్ట్ సగటును సాధించిన ఘనత, అత్యధిక సెంచరీలు చేసిన ఘనత.. వరల్డ్ క్రికెట్ లో విరాట్ కొహ్లీకే సొంతం అయ్యింది. అంత వరకూ ఎందుకు.. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తన 200వ వన్డే పూర్తి చేసుకునే సరికి చేసిన సెంచరీల సంఖ్య 17 అయితే, ఇన్నే మ్యాచ్ లలో విరాట్ దాదాపు అంతకు రెట్టింపు సెంచరీలను పూర్తి చేసుకున్నాడు!! విరాట్ ఊపు చూస్తుంటే.. సచిన్ వన్డే సెంచరీల రికార్డులను చెరిపేయడానికి పెద్దగా సమయం అక్కర్లేదు అని అనుకోవచ్చు.
రెండు వందల వన్డేల్లో 31 సెంచరీలు.. సచిన్ మొత్తం సెంచరీల సంఖ్య 49. తేడా 18 సెంచరీలు. విరాట్ ఊపు చూస్తుంటే.. మరో వంద వన్డేలు, ఈ మాత్రం మ్యాచ్ లలోనే విరాట్ సచిన్ సెంచరీల రికార్డును అధిగమించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి! విరాట్ కష్టించే తత్వాన్ని చూస్తే.. అతడు తన ఫామ్ ను కొనసాగించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మూడువందల వన్డేలను పూర్తి చేసుకునే సరికి.. సచిన్ సెంచరీల రికార్డును ఊదేసే అవకాశాలున్నాయి.
అయితే ఇక్కడ కొన్ని విమర్శలు లేకపోలేదు, సచిన్ సమయంలో చాలా గొప్ప బౌలర్లు ఉండే వాళ్లు.. అక్రమ్, వకార్, మెక్ గ్రాత్, లీ, అక్తర్, డొనాల్డ్, మురళీధరన్, వార్న్…. వంటి గొప్ప గొప్ప బౌలర్లను ఎదుర్కొంటూ సచిన్ కెరీర్ ను సాగించాడు. అయితే ఈ జనరేషన్ లో అలాంటి బౌలర్లు లేరు.. కాబట్టి విరాట్ ఆటలు సాగుతున్నాయి.. అంటారు. ఈ వాదన మరీ కొట్టి పడేయదగినది కాదు. నేడైతే వరల్డ్ క్రికెట్లో నాటి స్థాయి బౌలర్లు లేరు. ఇలాంటి నేపథ్యంలో విరాట్ కు ఆట కొంత సులువు అయ్యుండొచ్చు. కానీ.. సచిన్ సెంచరీల రికార్డును విరాట్ 300 వన్డేల్లోనే చెరిపేస్తే మాత్రం, విరాట్ వండర్ కూడా అద్భుతమైనదే అవుతుంది.